అమరకోశము వాగ్వర్గము
బ్రాహ్మీ తు భారతీ భాషా
గీర్వా గ్వాణీ సరస్వతీ
బ్రాహ్మీ = బ్రహ్మ
సంబంధమైనట్టిది
భారతీ = భరించునది, భరతుడనే
ముని చేత ఈ లోకమునకు తేబడినది
భాషా = భాషింపబడునది
గీః = దీనిని పలుకుదురు,
లెస్సగా పలుకునది
వాక్ = పలుకబడునది
వాణీ = పలుకబడునది
సరస్వతీ = బ్రహ్మ లోకమందు
బ్రహ్మ వర్చస్సునాశ్రయించి నది రూపముగా ప్రవహించునది
ఇవి ఏడును వాగధి దేవత
పేర్లు
వ్యాహార ఉక్తిర్లపితమ్
భాషితం వచనం వచః
వ్యాహార = పలుకబడునది
ఉక్తిః = పలుకబడునది
లపితం = పలుకబడునది
భాషితం = భాషింప బడునది
వచనం = పలుకబడునది
ఇవి ఐదును మాట్లాడుట పేర్లు
అపభ్రంశో ఽ పశబ్ద స్స్యాత్
అపభ్రంశః = సంస్కృతము నుంచి
భ్రష్టమైనది
అపశబ్దః = భ్రష్టమైన శబ్దము
ఇవి రెండు అపశబ్దముల పేర్లు
శాస్త్రేశబ్దస్తు వాచకః
ప్రక్రుతి ప్రత్యయములచేత
సంస్కృతమై అర్ధ వాచకమైన సుశబ్దము శబ్దమనబడును , అర్ధము నెరిగించునది, అర్ధము
చెప్పునది
ఇది సంస్కృతమై అర్ధబోధకమైన
శబ్దము పేరు
తిఙ్సుబన్తచయో వాక్యం
క్రియా వా కారకాన్వితా
వాక్యం = పలుక దగినది (
తిఙ్సుబన్తచయస్య ఏకవాక్యతయా అర్ధవాచాకత్వాద్వాక్యం ) తిఙంత సమూహము గానీ, సుబంత
సమూహము గాని వాక్యమనబడును.
[తిఙంతానాం యధా “పచతి ఖాదతి మోదతే”
సుబంతానాం యధా “ప్రకృతి సిద్ధ మిదం హి దురాత్మనా”]
ఒకానొక చోట క్రియ
లేకుండిననూ ఆధ్యాహారముచేత క్రియ గలిగిన సుబంత సముదాయము వాక్యమనబడును
రామకృష్ణాది శబ్దములు
సుబంతములు, భవతి, ఏధతే వంటి శబ్దములు తిఙంతములు
ఇది వాక్యము పేరు
శృతిః స్త్రీ వేద ఆమ్నాయ
స్త్రయీ
శృతి = దీని చేత
ధర్మాధర్మాదులు వినబడును
వేదః = దీని చేత
ధర్మాధర్మములు ఎరుగుదురు
ఆమ్నాయః = పారంపర్యము చేత
అభ్యసింపబడునది
ఇవి మూడున్ను వేదమునకు
పేర్లు
ధర్మస్తూ తద్విధిః
ధర్మః = లోకములను
ధరించునది, జనులచే బూనబడునది
ఇది వేదవిహితమైన కర్మకు
పేరు
స్త్రియా మృక్సామ యజుషీ
ఋక్ = దేవతలు దీని చేత
స్తోత్రము చేయబడుదురు
సామః = పాపమును
నశింపజేయునది
యజుః = దేవతలు దీనిచేత
పూజింపబడుదురు
ఇవి మూడును వరుసగా మూడు
వేదముల పేర్లు
ఇతి వేదా స్త్రయ స్త్రయీ
వేదాస్త్రయః = ఈ వేదములు
మూడును త్రయి యనబడును, మూడు వేదములు అవయవములుగా గలది, మూడు వేదముల ఏకీభావము
ఇది మూడు వేదముల సమూహము
పేరు
శిక్షేత్యాది శృతే రఙ్గం
శిక్ష మొదలైనవి వేదమునకు
అంగమనంబడును దీనిచేత అన్ని పదార్దములును పొందబడును
[ఇవి శిక్ష, వ్యాకరణం,
ఛందస్సు, నిరుక్త్తం, జ్యోతిషము, కల్పము]
శిక్ష = అకారాది
వర్ణములయొక్క స్థాన విధాన ప్ర్రయత్నములను బోధించునది
వ్యాకరణం = దీని చేత
శబ్దములు విశేషముగా వివరించి చెప్పబడును
చందస్సు = పద్య వివేచకమైన
శాస్త్రము
నిరుక్తం = వర్ణాగమమనియు,
వర్ణవపర్యయమనియు నిది మొదలైన నిశ్చయముచేత చెప్పబడినది
జ్యోతిషం = గ్రహ,
నక్షత్రముల ఉదాయాస్తమయాదుల ప్రతిపాదించునది
కల్పము = యుగాది బ్క్రియాల
యందు సమర్ధమైనది
ఓంకార ప్రణవౌ సమౌ
ఓంకారం = సర్వ భూతములను
రక్షించునది
ప్రణవః = మిక్కిలి
స్తోత్రము చేయుట ప్రణవము, మిక్కిలి స్తోత్రము చేయబడునది
ఈ రెండును ఓంకారము పేర్లు
ఇతిహాసః పురావృత్తం
ఇతిహాసః = పారంపర్యోపదేశము
దీని యందు కలదు
పురావృత్తం = నిబంధనప్రాయం
ఇవి ప్రాచీన చరిత్ర బోధక
వ్యాస ప్రణీతములైన భారతాదుల పేర్లు
ఉదాత్తాద్యాస్త్రయ స్సర్వాః
ఉదాత్త అనుదాత్త
స్వరితములనెడు మూడును స్వరములనబడును
స్వరాః = ఉచ్చరింపబడునవి,
తమంత తామే ప్రకాశించునవి
ఉదాత్తః = మీద పలుకబడునది
అనుదాత్తః = తగ్గున పలుకబడునది
అన్వీక్షకీ డణ్డనీతి స్తర్క
విద్యార్ధ శాస్త్రయోః
అన్వీక్షకీ =
ప్రత్యక్షాగమముల చేత అవగతమై వస్తువునకు వెనుకకు మరలి విచారించుట
దండనీతిః = గ్లానిని
కలిగించునది దండము సామ దానాది ఉపాయములలో నాల్గవ ఉపాయము దండము. అది దీని చేత
ప్రధానముగా ప్రతిపాదించ బడుతున్నది
అర్దః =
ప్రార్ధించబడుచున్నది కనుక అర్ధము అనగా భూ హిరణ్యాదికము
ఇవి అక్షపాదాది ప్రణీతమైన
తర్క శాస్త్రమునకు, చాణక్యాది ప్రణీతమైన నీతి శాస్త్రమునకు పేర్లు
ఆఖ్యాయి కోపలబ్ధార్దా
ఆఖ్యాయిక = నాయక చరితము
దీని చేత చెప్పబడును
ఉపలబ్దః = ఏ యుపాయము
చేతనైనా ఎరుగబడిన అర్ధము కలిగినది.
సత్యమైన హర్ష చరిత్రము
మొదలైన వాటి పేర్లు
పురాణం పంచ లక్షణం
[సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో
మన్వంతరాణి చ
వంశానుచరితం చేతి లక్షణానాం
తు పంచకం]
పురాణము = పూర్వమైనది కనుక
పురాణము
సర్గము, ప్రతిసర్గము,
వంశము, మన్వంతరము, వంశానుచరితం అను ఐదు లక్షణములు కలది పురాణము
వ్యాసాది ప్రణీతమైన మత్స్య
పురాణాదుల పేరు
ప్రబన్ధ కల్పనా కధా
ప్రబన్ధ కల్పనా = ప్రబంధము యొక్క రచించుట
కధా = రచింప బడునది
[ఉపరి కధ = సమర్ధుల చేత
చెప్పబడిన బహునాయకుల కధ ఉపరి కధ
ఖండ కధ = భానుమత్యాది
గ్రంధాంతరమందు ప్రసిద్ధమైన కధ మధ్యమము నందైనను, అంతమునందైనను ఏ ప్రబంధమునండు
చెప్పబడియున్నదో ఆ కధ ఖండ కధ. ఉదా : భానుమతీ పరిణయము
ఉపకధ = అతి ప్రసిద్ధమైన
కధాంతరము విచిత్రముగా ఎచ్చట చెప్పబడునో అది ఉపకధ ఉదా : చిత్రలేఖ
బృహత్ కధ = అంకములనెడు
గురుతుల చేత చిహ్నితమై అద్భుతార్దములు కల్గి పిశాచ భాషా మాయమైన నరవాహనదత్తాదుల
చరిత్రము బృహత్కధ యనబడును, ఉదా : కాదంబరి ]
ప్రవల్హికా ప్రహేళికా
ప్రవల్హిక = వీని యందు
అభిమతార్ధము గూధముగా నుంచబడును
ప్రహేళిక = అభిప్రాయమును సూచింపజేయునది
ఇవి రెండును గూఢార్ధము గల
ప్రబంధము పేర్లు
స్మృతిస్తు ధర్మసంహితా
స్మృతి = మహర్షుల చేత
వేదార్ధ పర్యాలోచన పూర్వకముగా నిర్మించబడినది
ధర్మ సంహితా = ధర్మము దీని
యందు మునులచే కూర్చబడినది
ఇవి రెండును మానవాది ధర్మ
శాస్త్రముల పేర్లు
సమాహృతిస్తు సంగ్రహః
సమాహృతి = దీనిచేత
అర్ధమొకచోటికి తేబడును, దీనిచేత అర్ధము సంక్షేపముగా గ్రహింపబడును
ఇది సంగ్రహించి వ్రాసిన
అనేక గ్రంధముల సారాంశము పేరు
సమస్యా తు సమాసార్ధాః
సమస్యాః = దీని చేత
సంక్షేపించ బడును
సమాసార్ధాః =
సంక్షేపింపబడిన అర్ధము దీనియందు గలదు
ఇవి కవి పరిజ్ఞానార్ధమై
ఇయ్యబడెడు పద్యాంశమూల పేర్లు
కింవదంతీ జనశృతిః
కింవదంతీ = సత్యము, అసత్యము
కాని యోకానొక వాదము. ఏమి ఏమి అని పరస్పరము చెప్పికొందురు
జనశృతిః = జనుల వలన
వినబడుట, జనుల చేత వినబడునది
ఇవి రెండు లోకవాదము పేర్లు
వార్తాప్రవత్తిర్వృత్తాన్త
ఉదంతః స్యాత్
వార్తా = లోకము యొక్క నడత
దీని యందు కలదు
ప్రవృత్తిః = ప్రవర్తించునది
వృత్తాన్తః = అనువర్తించి
వచ్చునట్టి సమాప్తి కలిగినది
ఉదంతః = ఉత్పన్నమైన
నిశ్చయము కలిగినట్టిది
ఇవి నాలుగు వృత్తాంతము
పేర్లు
అథాహ్వయః
ఆఖ్యాహ్వే అభిదానం చ
నామధేయం చ నామ చ
ఆహ్వయః = దీని చేత
పిలువబడును
ఆఖ్యా = దీని చేత బలుకబడును
ఆహ్వా =
దీని చేత బలుకబడును
నామదేయః, నామం = దీని చేత
బలుకబడును కావున నామము
ఇవి నామదేయము పేర్లు
హూతి రాకార ణాహ్వానం
హూతిః, ఆహ్వానం = దీనిచే పిలతురు కనుక ఆహ్వానము
ఆకారణం = దీని చేత పిలతురు
ఇవి మూడు పిలచుటకు పేర్లు
సంహూతి ర్బహుభిః కృతా
అనేకులు చేరి పిలచుట సంహూతి
ఇది బహుజనులు చేరి పిలచుట
పేర్లు
వివాదో వ్యవహారః స్యాత్
వివాదః = వివిధమైన వాదము
వ్యవహారః = దీని చేత
వ్యవహరింతురు
ఇవి ధనాది నిమిత్తమైన కలహము
పేర్లు
ఉపన్యాసస్తు వాఙ్ముఖం
ఉపన్యాసః = ఉపన్యసించుట
వాఙ్ముఖం = వాక్కు యొక్క
ప్రారంభము
ఇవి రెండు వాక్యారంభము
పేర్లు
ఉపోద్ఘాతః ఉదాహారః
ఉపోద్ఘాతః = మిక్కిలి
సమీపము నందెరుగజేయ బడునది
ఉదాహారః = ఎత్తి
చెప్పబడునది
ఇవి ఉపన్యాసాది శబ్దములు
శపనం శపథః పుమాన్
శపనం, శపథః = ఆక్రోశించుట
శపథం అనగా మరి యొక అర్ధము
దీనిచేత జనులు విశ్వసింతురు
ఇవి రెండును ఒట్టు
పెట్టుకొనుట పేర్లు
ప్రశ్నో ఽ నుయోగః పృఛ్ఛా చ
ప్రశ్నః, పృచ్ఛాః= ఎరుగ
గోరి యడుగుట ప్రశ్నము
ఇవి అర్ధము నెరుగుటకై
అడుగునది
ప్రతి వాక్యోత్తరే సమే
ప్రతివాక్యం = అడిగినందులకు
బదులు చెప్పునది ప్రతి వాక్యము
ఉత్తరం = అడిగిన శంకను దీని
చేత దాటవేతురు
ఇవి అడిగిన వాటికి జవాబు
చెప్పుటకు పేర్లు
మిథ్యాభియోగో భ్యాఖ్యానం
మిథ్యాభియోగః = అసత్యమైన అభియోగము
అభ్యాఖ్యానం = లేనిపోనిదాని
నారోపించి పలుకుట
ఇవి మిథ్యా వివాదము పేర్లు
అథ మిథ్యాభిశంసనం
అభిశాపః
మిథ్యాభిశంసనం = అసత్యమైన
నిందను జెప్పుట
అభిశాపః = నిందను జెప్పి
యాక్రోశించునది
ఇవి లేనిపోనిదాని నారోపించి
చెప్పుటకు పేర్లు
ప్రణాదస్తు శబ్ద
స్స్యాదనురాగజః
ప్రణాదః = ప్రకృష్టముగా పలుకుట
ఇది అనురాగము వలన పుట్టిన శబ్దము
పేరు
యశః కీర్తిస్సమజ్ఞా చ
యశః = అన్ని దిక్కులకును
వ్యాపించునది
కేర్తిః = కీర్తింపబడునది
సమజ్ఞా = దీని చేత పురుషుడు
లెస్సగా నెరుంగబడును
ఇవి మూడు కీర్తి పేర్లు
స్తవః స్తోత్రం స్తుతిః
ర్నుతిః
స్తవము, స్తోత్రము, స్తుతి
= దీని చేత స్తోత్రము చేయబడును
నుతిః = దీని చేత నుతించ
బడుదురు
ఇవి నాలుగు స్తోత్రము పేర్లు
ఆమ్రేడితం ద్విస్త్రిరుక్తం
ఆమ్రేడితం = అనేక మార్లు
పలుకబడునది
సంతోషసంభ్రమముల చేత రెండు
మూడు మార్లు పలుక బడిన శబ్దము పేరు
ఉచ్చైర్ఘుష్టం తు ఘోషణా
ఉచ్చైర్ఘుష్టం = బెట్టుగా
పలుకబడునది
ఘోషణా = పలుకబడునది
ఇవి బెట్టుగా పలుకుట పేర్లు
కాకుః స్త్రియాం వికారో య శ్శోకభీత్యాది భిర్ధ్వనే
కాకుః = కుత్సితముగా
పలుకబడునది
ఇది శోక భయాదుల చేతనైన
ధ్వని యొక్క వికారము పేరు
అవర్ణాక్షేప నిర్వాద పరీవా
దాపవాదవత్
ఉపక్రోశో జుగుప్సా చ కుత్సా
నిన్డా చ గర్హణే
అవర్ణా = వర్ణమనగా స్తుతి
అది కాని విరుద్ధ స్తుతి అవర్ణము
ఆక్షేపః = ఆక్షేపించుట
నిర్వాదః, పరీవాదః, అపవాదః
= వాదము వలన నిష్క్రాంతమైనది
ఉపక్రోశః = అంతటా ఆక్రోశించుట
జుగుప్సా = రోత కల్గుట
కుత్సాః = నిందించుట
నిందః = నిందించుట
గర్హణం = గర్హించుట
ఇవి పదిన్ని నిందించుట
పేర్లు
పారుష్య మతివాద స్స్యాత్
పారుశ్యము = అప్రియ వచనము
అతివాదః = వాదము నతిక్రమించి పలుకుట
ఇవి అప్రియముగా పలుకుటకు
పేర్లు
భర్త్సనం త్వపకారగీః
భర్త్సనం = దీని చేత
బెదరింపబడును
పరులకు భయము పుట్టించుటకు
పలికెడు వాక్కు పేరు
యస్స నిన్ద ఉపాలమ్భస్తత్రస్యా
త్పరిభాషణం
ఉపాలమ్భము = దుర్వాక్యమును
పలుకుట ఉపాలంభము
ఇది గుణావిష్కరణ
పూర్వకమనియు, నిందాపూర్వకమనియు రెండు రకములు
ఉన్నత కులమున బుట్టిన నీకు
ఈ కార్యము యుక్తమా అనునది గుణావిష్కరణ పూర్వకము
వ్యభిచారిణీ పుత్రునికి
చేయరాణి పని గలదే యనుట నిందా పూర్వకము
ఇది నిందతో కూడిన
దుర్వాక్యమునకు పేరు
తత్ర త్యాక్షారణా
యస్స్యాదాక్రోశో మైథునం ప్రతి
త్యాక్షారణా = అంతటా
వ్యాపించునది
ఇది మైధునము గురించి
ఘోషించుట పేరు
స్యాదా భాషణ మాలాపః
ఆభాషణం = అంతటా సంభాషించుట
ఆభాషణము
ఆలాపము = లెస్సగా పలుకుట
ఆలాపము
ఇవి సంభాషణము పేర్లు
ప్రలాపో ఽనర్ధకం వచః
ప్రలాపః = మిక్కిలి పలుకుట
ఇది ప్రయోజనము లేని మాట
పేరు
అనులాపో ముహుర్భాషా
అనులాపః = చెప్పిన వెనుక
మరల చెప్పుట
ఇది పలుమారు పలుకుట పేరు
విలాపః పరిదేవనం
విలాపః = విలపించుట
పరిదేవనం = దుఃఖించి పలుకుట
ఇవి దుఃఖముతో పలుకు వాక్కు
పేర్లు
విప్రలాపో విరోధోక్తిః
విప్రలాపః = విరుద్ధమైన
ప్రలాపము
ఇది విరోధముతో పలుకుట పేరు
సంలాపో భాషణం మిథః
సల్లాపః = మంచి భాషణము
ఇది ప్రేతి చేత భాషించుటకు
పేరు
సుప్రలాప స్సువచనం
సుప్రలాపః = లెస్సగా పలుకుట
సువచనం = మంచి మాట
ఇవి పరిశుద్ధమైన మాటకు
పేర్లు
అపలాపస్తు నిహ్నవః
అపలాపః = అపలపించునది
నిహ్నవః = దీని చేత
మోసపుచ్చబడును
ఇవి మోసపు పలుకులకు పేర్లు
సందేశవాగ్వాచికం స్యాత్
సందేశః = ఊకరి చేత చెప్పబడు
అర్ధము, ఆ వాక్కు
వాచికం = సందిష్టార్ధమైన
వాక్కు, వాక్కులు దీని యందు గలవు
ఇవి చెప్పి పంపు మాట పేర్లు
వాగ్భేదాస్తు త్రిషూత్తరే
ఈ పైన చెప్పిన
శబ్దములన్నియూ 3 లింగముల యందును వర్తించును
రుశతీ వాగ కల్యాణీ
రుశతీ = శుభమును చేరుచునది,
మనస్సును వ్యధ పెట్టునది
ఇది ఆశుభమైన వాక్కునకు పేరు
స్యా త్కల్యా తు శుభాత్మికా
కల్యా = ఎంచదగినది, క్రియలందు ఉచితమైనది
ఇది శుభమైన వాక్కునకు పేరు
అత్యర్ధమధురం సాంత్వం
అత్యర్ధమధురం = చెవులకు వినుటకు మిక్కిలి ఇంపైన పలుకు
సాంత్వం = ఊరడించు పలుకు
బుజ్జగించుటకు పేరు సాంత్వము
సంగతం హృదయఙ్గమం
సంగతం = మనస్సును లెస్సగా పొందునది
హృదయఙ్గమం = మనస్సును పొందునది
నిష్ఠురం పరుషమ్
నిష్ఠురం = తీక్ష్ణమైయుండునది
పరుషం = పలికెడు వానిని పూర్ణముగా చేయునది
ఇవి కఠినమైన వాక్కునకు పేర్లు
గ్రామ్య మశ్లీలమ్
గ్రామ్యం = గ్రామమునందు పుట్టినది
అశ్లీలము = ఒప్పిదము లేనిది అశ్లీలము
ఇవి పామరజనులాడెడు పలుకులకు పేర్లు
సూనృతం ప్రియే, సత్యే
సూనృతం = దీని చేత లెస్సగా నాడుదురు, మంచి వీర్యము
గలది
ఇది ఇష్టమును, సత్యమును అయిన మాటకు పేరు
అథ సంకుల క్లిష్టే పరస్పర పరాహతే
సంకుల క్లిష్ట శబ్దములు పూర్వోత్తర విరుద్ధమైన
వాక్కు పేర్లు. దీని చేత జడులువుదురు.
క్లిష్టం = దీని చేత క్లేశము నొందుదురు
ఇవి విరుద్ధార్ధము గల మాట పేర్లు
లుప్తవర్ణపదం గ్రస్తం
గ్రస్తం = దీని చేత వర్ణములు గాని, పదములు కాని
మింగబడును
వర్ణము గాని పదము గాని లోపించుటకు పేరు
నిరస్తం త్వరితోదితం
నిరస్తం = త్వర చేత ప్రేరేపింపబడినది
ఇది త్వరగా చెప్పు మాటకు పేరు
అమ్భూకృతం సనిష్ఠేవం
అంబూకృతం = తుంపురులతో కూడుట వలన జలప్రాయము
చేయబడినది.
సనిష్టేవం = తుంపురులతో కూడినది
ఇవి తుంపురులతో కూడిన వాక్కు పేరు
అబద్ధం స్యా దనర్ధకం
అబద్ధం = దీనియందు హృదయం నిలువబడదు
అనర్ధకం = దీనియందు సముదాయార్ధము లేదు
ఇవి సముదాయార్ధము లేని మాట పేర్లు
అనక్షర మవాచ్యం స్యాత్
అనక్షరం = కుత్సితమైన అక్షరములు కలిగినది
అవాచ్యం = పలుక యోగ్యము కానిది
ఉచ్చరించరాని తిట్టు పేర్లు
ఆహతం తు మృషార్ధకమ్
ఆహతం = ప్రమాణాంతరము చేత బాధింప బడునది
మృషార్ధకం = అసత్యమైన అర్ధము గలది
ఇవి అత్యంత సంభావితమైన అర్ధము గల వాక్యము పేర్లు
సోల్లుణ్ఠనం తు సోత్ప్రాసం
సోల్లుణ్ఠనం = దెప్పుటతో కూడినది,
సోత్ప్రాసనం = ఎగతాళితో కూడినది
ఇవి పరిహాసముతో కూడిన మాట పేర్లు
మణితం రతి కూజితం
మణితం = కేక వేయబడినది
రతికూజితం = సురతము వేళ కేక
ఇవి రెండు రతి కూజితము పేర్లు
అథ మ్లిష్ట మవిస్పష్టం
అమ్లిష్టం = స్పష్టముగా పలుకబడనిది
అవిస్పష్టం = స్పష్టము కానిది
ఇవి ప్రకటము కాని మాట పేర్లు
వితథం త్వనృతం వచః
వితథం = తథమనగా సత్యము వితథమనగా సత్యము కానిది
అనృతం = సత్యము కానిది
ఇవి రెండు అనృత వాక్కు పేర్లు
సత్యం తథ్య మృతం సమ్యగమూని త్రిషు తద్వతి
సత్యం = సత్పురుషులయందు పుట్టినది
తథ్యం = ఆ ప్రకారంగా మంచిది
ఋతం = హృదయమును పొందునది
సమ్యక్ = అర్థముతో కూడ సంగతమై యుండునది
ఇవి సత్యమైన వాటి పేర్లు
దీనితో వాగ్వర్గము సుసంపన్నము. తరువాత శబ్దాది
వర్గము.