Monday, November 4, 2024

అమరకోశము స్వర్గవర్గము

 "అమరం చదవని వారికి నేనమరను" అన్నది దేవి సరస్వతి మాత వాక్కుగా ప్రతీతి. అమరకోశము అనేది ఒక ప్రాచీన సంస్కృత నిఘంటువు. ఒకనాటి జాతీయ పాఠ్యపుస్తకం. అమరాన్ని రచించినది అమరసింహుడనే నిఘంటుకారుడు. ఆయన ఏ కాలీనుడో, ఏ ప్రాంతీయుడో, ఏ కులస్థుడో నిర్ధారించడానికి తోడ్పడే వివరాలేవీ ఆ గ్రంథంలో లేవు. బ్రిటీషువారు భారతదేశానికి రాకముందు మన ప్రాచీన గురుకుల పాఠశాలల వ్యవస్థలో పై తరగతుల పిల్లలకి అమరకోశంతో పాటు రఘువంశం,కుమరసంభవం, మేఘసందేశం, కిరాతార్జునీయం, శిశుపాలవధ అనే ఈ అయిదు పుస్తకాలూ తప్పనిసరి వాచకాలుగా నిర్దేశించబడ్డాయి. నెమ్మదిగా అర్వాచీన విద్యా ఝరిలో అమరకోశం చదివేవారి సంఖ్య తరిగిపోతూ వచ్చింది. సంస్కృతం, తెలుగు వ్యాకరణం చదివేవారికి తప్ప మిగిలిన వారికి "అమరం అంటే ఏమిటి" అనే ప్రశ్న మనసులో మెదిలితే తప్పు ఎవరిది ?

అమరసింహుడు తన అమరకోశానికి ' నామలింగాను శాసనం అని పేరు పెట్టాడు. తన నిఘంటు రచనకు ముందు వెలసిన వ్యాకరణ గ్రంధాలను, నిఘంటువులను కూలంకషంగా పరిశీలించి అంతకుముందు ఉన్న గ్రంధాల ఉపయోగం సంకుచితమైనదని గ్రహించాడు. సంస్కృతం లో పదము అర్ధము మీద ఆధారపడి లింగనిర్దేశ్యం ఉండనందువల్ల ఆ పదము యొక్క లింగము పేర్కొనవలసి రావడము అవసరము ఉండేది. అందువలన అమరకోశాన్ని సంక్షిప్తంగానూ సమగ్రంగానూ లింగబోధకంగా ఉండేలాగ వివిధ వర్గ విభాగంలో మూడు కాండలలో ఆయన రచించాడు.

అందులో ప్రధమ కాండలో 12 వర్గములు, రెండవ కాండలో 10 వర్గములు, మూడవ కాండలో 6 వర్గములు ఉన్నాయి. మొదటి కాండలో 1. స్వర్గ. 2. వ్యోమ. 3. దిక్ 4. కాల. 5. ధీ 6. వాక్ 7. శబ్దాది 8. నాట్య. 9. పాతాళ. 10. భోగి 11. నరక. 12. వారి అన్న వర్గాలు ఉన్నాయి. రెండవ కాండలో 1. భూ 2. పుర. 3. శైల. 4. వనౌషధి 5. సింహాది 6. మనుష్య. 7. బ్రహ్మ. 8. క్షత్రియ. 9. వైశ్య. 10. శూద్ర. అనే వర్గాలు ఉన్నాయి. మూడవ కాండలో 1. విశేషనిఘ్న. 2. సంకీర్ణ. 3. నానార్ధ. 4. నానార్ధ వ్యయ. 5. అవ్యయ. 6. లింగాది సంగ్రహ వర్గాలుగా రూపొందింది. అమరకోశం లో కాండ విభాగం బట్టి కానీ వర్గ విభాగం నుంచి చేసిన పధ్ధతి చాలా శాస్త్రీయమైనది. అందువలననే అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ గ్రంధం విస్తృతంగా వ్యాప్తి చెందింది. సంస్కృత భాషను నేర్చుకునే ప్రాధమిక విద్యార్ధికి దీనిని మించిన ఉపయుక్తమైన గ్రంధం లేదు. అమరం అనంతరం అనేక నిఘంటువులు వచ్చినా అవి నిలదొక్కుకోలేక పోయినాయి. కేవలం దీనిలో లేని పదాలను ఉటంకిస్తూ మాత్రమే అవి అస్తిత్వాన్ని నిలుపుకోవలసి వచ్చినాయి. అమరకోశానికి దాదాపు 60 వరకూ వ్యాఖ్యాన గ్రంధాలు ఉన్నాయంటే ఆ సంఖ్యే అమరకోశం గ్రంధం యొక్క ప్రాశస్త్యానికి, ప్రచారానికి అడ్డం పడుతుంద. జాతరూపుడు, భానోజీ దీక్షితులు, సర్వానందుడు, లింగయ సూరి, మల్లినాధ సూరి, అప్పయ్య దీక్షితుడు, వీరే కాక తాళ్ళపాక తిరువెంకటాచార్యులు, నీలకంఠ దీక్షితుడు, , మల్లినాధ సూరి, వంటి దాక్షిణాత్యుల టీకలు కూడా విస్తృత ప్రచారంలో ఉన్నాయి. అక్షరాభ్యాసం చేసినప్పుడు ఒనామః శివాయః సీధం నమః అన్నవిధంగానూ, ఎ పనైనా మొదలు పెట్టేటప్పుడు శుక్లాంబరధరం విష్ణుం చదివినట్లు అమరం చదువుకునేవారు, ఆ మాటకొస్తే సంస్కృతం చదువుకునేవాళ్ళు మొదలు పెట్టె శ్లోకం ఇదీ : యస్య జ్ఞాన దయాసిందో రగాధస్య నఘా గుణాః సేవ్యతామక్షయో ధీరాః సశ్రియాయైచామృతాయచ
 అమరం గురించిన అనల్పానల్పాలు(Trivia) 1. అమర కోశాన్ని నిఘంటువు అనేకన్నా కోశము (Thesaurus) అనడమే సరి అయినది. 2. "అమరం వల్లే వేస్తె కావ్యాలెందుకు - కాల రాయనా! " అన్న చాటువూ విస్తృత ప్రచారంలో ఉండేది.

ఇటు తరువాత చెబుతున్న శ్లోకాలు ఐదూ అవతారికలు. అంటే ఇష్ట దేవతా ప్రార్ధనతో పాటు గ్రంధము యొక్క పేరు, ప్రయోజనము, గ్రంధమును ఉపయోగించుకొను విధమును తెల్పుతున్నాడు.

యస్య జ్ఞాన దయా సింధో రాగాధస్య నఘా గుణాః
సేవ్యతామక్షయో ధీరాః సశ్రియైచామృతాయచ

ఇది ఇష్ట దేవతా ప్రార్ధన. విద్వాంసులారా ! జ్ఞానసంపదకు, మోక్ష సాధన కొరకు గంభీరుడై, నాశరహితుడై, దయాజ్ఞానములకు ఆలవాలమై యున్నట్టి, రాగాది దోషములకు అతీతుడైనట్టి పరమాత్ముని సేవింపుడు.

ఇంకొక విధముగా అర్ధము : సముద్రుని సేవించి/మధించి దేవతలు లక్ష్మి ని, అమృతమును వడసిన విధముగా భగవద్భక్తులు పరమాత్ముని సేవించి ధర్మార్ధకామములనెడు సంపదలతో పాటు మోక్షమును కూడ పొందగలరు.

సమాహృత్యాన్య తంత్రాణి సంక్షిప్తైః ప్రతి సంస్కృతైః
సంపూర్ణ ముచ్యతే వర్గైర్నామ లింగాను శాసనం

ఇతరులైనటువంటి వరరుచ్యాది మహా విద్వాంసుల గ్రంధముల విషయ సంగ్రహము చేసి, గ్రహించిన పర్యాయపదముల చేతను, లింగ నిర్ణయాదుల చేతను నిండియున్న ఈ గ్రంధము "నామలింగానుశాసనం" అన్నీ తెలియబడుగాక.

అనల్పానల్పాలు (Trivia)
విక్రమాదిత్యుని నవరత్నాలు :
ధన్వంతరి క్షపణకామరసింహ శంఖ వేతాళభట్ట ఘటకర్పర కాళిదాసాః |
ఖ్యాతోమరాహమిహిరో నృపతేః సభాయాం రత్నాని వైవరరుచిర్నవ విక్రమస్య ||

ఈ శ్లోకాన్ని బట్టి అమరసింహుడు విక్రమాదిత్యుని కాలం వాడని తెలుస్తోంది.

ప్రాయశో రూప భేదేన సాహచార్యాశ్చ కుత్రచిత్
స్త్రీ పున్నపుంసకం జ్ఞేయం తద్విశేష విధేః క్వచిత్

కొన్ని చోట్ల రూప భేదము చేతను (విసర్గ యున్న ఎడల పుంలింగమని, దీర్ఘాంతమున్న స్త్రీ లింగమని, బిందు యుక్తమైన నపుంసక లింగమని ఎరుగదగును). కొన్ని చోట్ల ముందు వెనకాల పదముల సంబంధము చేతను, కొన్ని చోట్ల ఈ పదమీ లింగమని ప్రత్యేకముగా చెప్పుట చేతను లింగమును తెలిసికొన వలెను.

భేదానాఖ్యాయ న ద్వంద్వోనైక శేషో న సఙ్కరః
కృతో ఽ త్రభిన్న లింగానామనుక్తానాం క్రమాదృతే

లింగ భేదము చెప్పని చోట ఈ గ్రంధమున సంకర సమాసము ఉండదు. సమాసము సంకరము చేసిన చోట లింగ భేదము తప్పక చెప్పబడినది.

త్రిలిఙ్యాం త్రిష్వితి పదం మిధునే తుద్వయోరితి
నిషిద్ధలిఙ్గం శేషార్ధం త్వంతాథాదిన పూర్వభాక్ త్రిషు
అనుటచే మూడులింగముల పదము, ద్వయోః అను పదముచే స్త్రీ లింగ పుంలింగ పదములు తెలియదగును.
తు అన్న పదమున్నచో ఆ పదము కడపటనున్న పదము ముందు పదముతో అన్వయింపదు.
ఉదా: "త్రిషు స్ఫుల్లిన్గోగ్నికణః" అన్న చోట స్ఫుల్లిన్గాగ్నికణము త్రిలిన్గములు గలది యని తెలియవలెను. "ద్వయోః జ్వాల కీలౌః" అన్న చోట జ్వాల కీల స్త్రీ పుంలింగములలో ఏదైనా అయి ఉండవచ్చునని తెలియవలెను."పులోమజా శచీంద్రాణీ నగరీ త్వమరావతీ" అన్న చోట నగరీ అన్నది ఇంద్రాణీకి కాక అమరావతికి అన్వయించవలెను. 

అమరకోశం లో కాండ విభాగం బట్టి కానీ వర్గ విభాగం నుంచి చేసిన పధ్ధతి చాలా శాస్త్రీయమైనది. అందువలననే అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ గ్రంధం విస్తృతంగా వ్యాప్తి చెందింది. సంస్కృత భాషను నేర్చుకునే ప్రాధమిక విద్యార్ధికి దీనిని మించిన ఉపయుక్తమైన గ్రంధం లేదు. అమరం అనంతరం అనేక నిఘంటువులు వచ్చినా అవి నిలదొక్కుకోలేక పోయినాయి. కేవలం దీనిలో లేని పదాలను ఉటంకిస్తూ మాత్రమే అవి అస్తిత్వాన్ని నిలుపుకోవలసి వచ్చినాయి. అమరకోశానికి దాదాపు 60 వరకూ వ్యాఖ్యాన గ్రంధాలు ఉన్నాయంటే ఆ సంఖ్యే అమరకోశంగ్రంధం యొక్క ప్రాశస్త్యానికి, ప్రచారానికి అద్దం పడుతుంది. జాతరూపుడు, భానోజీ దీక్షితులు, సర్వానందుడు, లింగయ సూరి, మల్లినాధ సూరి, అప్పయ్య దీక్షితుడు, వీరే కాక తాళ్ళపాక తిరువెంకటాచార్యులు, నీలకంఠ దీక్షితుడు, మల్లినాధ సూరి, వంటి దాక్షిణాత్యుల టీకలు కూడా విస్తృత ప్రచారంలో ఉన్నాయి. అక్షరాభ్యాసం చేసినప్పుడు "ఓనామః శివాయః సీధం నమః" అన్నవిధంగానూ, ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు " శుక్లాంబరధరం విష్ణుం" చదివినట్లు అమరం చదువుకునేవారు, ఆ మాటకొస్తే సంస్కృతం చదువుకునేవాళ్ళు మొదలు పెట్టే శ్లోకం ఇదీ :

యస్య జ్ఞాన దయాసిందో రగాధస్య నఘా గుణాః
సేవ్యతామక్షయో ధీరాః సశ్రియాయైచామృతాయచ

మూడు లోకములలో స్వర్గము శ్రేష్టము కావున మొదటి కాండ మొదలులో స్వర్గ వర్గమును గురించి చెప్పుచున్నాడు. అందు దేవ సామాన్యులు, గణ దేవతలు, బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాదులును వర్ణించినాడు. తరువాత అగ్ని యమ నిఋతి వరుణ వాయు కుబేరుల ప్రస్తావన గలదు. వారి వారి పరివార పరికరములును వచ్చినవి . తరువాత ఆకాశము, చంద్రుడును, నక్షత్ర గ్రహములున్నూ, గ్రహాదిపతియైన సూర్యుని గురించి చెప్పినాడు. తరువాత మను ఋషి ప్రముఖుల ప్రస్తావన వచ్చును. తరువాత తత్ జ్ఞాన హేతువులైన బుద్ధ్యాదులు, బుద్ధి ప్రస్తావన విషయాడులును, ప్రస్తావమున వచ్చిన విషయాదులును నృత్య గీత వాద్యాదులును, వాటి తరువాత అధో దిక్కగు పాతాళమును, తన్నివాసులైన నాగాదులును, సముద్రము, జలచారములైన మత్స్యాదులు, పద్మాదులను చెప్పినాడు.

స్వరవ్యయం స్వర్గనాక త్రిదివ త్రిదశాలయాః
సురలోకో ద్యో దివౌ ద్వే స్త్రియాం క్లీబే త్రివిష్టపం

స్వః అనగా పొగడబడునది. అవ్యయం అనుటలో దానికి లింగ విభక్తి వచనాదులయందు అనేక రూపములు లేక ఏకత్వము కలిగినది కాబట్టి.
స్వర్గః = లెస్సగా సుఖమనుభవింపబడునది ,
నాకః = న + అకము దుఃఖము లేని చోటు,
త్రిదివః = మూడవ లోకము, త్రిదశాలయాః బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆవాసము,
సురలోకః = సురుల లోకము,
ద్యోః దివౌః = ఇచ్చోట అందురు క్రీడింతురు.
త్రివిష్టపం = మూడవ లోకము అమరా నిర్జరా దేవా స్త్రిదశా విబుధాస్సురాః సుపర్వాణ స్సుమనస స్త్రిదవేశా దివౌకసః
అమరాః = మరణము లేనివారు,
నిర్జరాః = ముసలితనము లేని వారు.,
దేవాః = క్రీడించు వారు,
త్రిదశాః = ఉత్పత్తి స్థితి నాశనములన్న మూడవస్థలు కలిగిన వారు అనగా ఈ మూడు దసల యందు ఇరువదియైదేండ్ల వారివలె ఉందురు. ఇంకొక వ్యుత్పత్తి ఏమనగా ముప్పది ఏండ్లకు లోబడిన వయసు గలవారు.
విబుధాః = విశేషముగా ఎరిగినవారు.,
సురాః = ఐశ్వర్య యుక్తులు, లెస్సగా ప్రకాశించువారు,
సుపర్వాణః = అభీష్టములు సిద్ధింపజేయువారు,
సుమనసః = లెస్సగా ఎరిగిన వారు,
త్రిదివేశాః = స్వర్గమునకు ప్రభువులు,
దివౌకసః = స్వర్గము స్థానముగా గలవారు

అదితేయా దివిషదో లేఖా అదితి నందనాః ఆదిత్యా ఋభవో స్వప్నా అమర్త్యా అమృతాంధసః

అదితేయః = అదితి కుమారులు,
దివిషదః = స్వర్గామునండు ఉండువారు
లేఖాః = కంఠ, హస్త, పాదములయందు మంచి రేఖలు గలవారు
అదితి నందనాః = అడితీ దేవి కుమారులు
ఆదిత్యాః = అదితి కుమారులు
ఋషభః = సత్యముతో పుట్టినవారు
అస్వప్నః = స్వప్నములు లేనివారు
అమర్త్యః = మరణము లేనివారు
అమృతాంధసః = అమృతము ఆహారముగా గలవారు

బర్హిర్ముఖాః క్రతుభుజో గీర్వాణా దానవారయః బృందారకా దైవతాని పుంసివా దేవతాః స్త్రియామ్

బర్హిర్ముఖాః = అగ్నియే ముఖముగా గలవారు అనగా అగ్నియందు జేసిన హోమములను గ్రహించి తృప్తినోన్డువారు క్రతుభుజః = యజ్ఞమునందు భుజించువారు
గీర్వాణః = వేదం శాస్త్రాది రూపమైన వాక్కును చెప్పువారు
దానవారయః = దానవులకు శత్రువులు
బృందారకః = మంచి సమూహము గలవారు
దైవతాని = దేవులే దేవతలు, దేవతలే దేవులు
ఈ 25 దేవతలకు పేర్లు

ఆదిత్య విశ్వ వసవ స్తుషితా భాస్వరానిలాః మహారాజిక సాధ్యాశ్చ రుద్రాశ్చ గణదేవతాః

ఆదిత్యులు పన్నెండుగురు (ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు)
విశ్వే = శ్రాద్ధాంగమందు ప్రవేశించు వారు. వీరు పది మంది. (వసు బంధులు, క్రతు దక్షులు, కాల కాములు, ధురి విరోచనులు, పురూరవా ద్రవులు )
వసవః = కూడుకొని యుండు వారు, వీరు ఎనమండ్రుగురు (ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధర్వుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు)
తుషితాః = సంతోషించు వారు,
 భాస్వరాః = అన్ని చోట్ల ప్రకాశించు వారు
అనిలాః = లోకములను ప్రాణ యుక్తముగా చేయువారు
మహారాజిక = మహారాజులనే పేరు గలవారు
సాధ్యాః = ఆరాధింపబడువారు, సిద్ధి గలవారు (వారు మనుడు, హనుమంతుడు, విష్ణువు, ధర్ముడు, నారాయణుడు మొదలగు 12 మంది
రుద్రాః = దుష్టుల దుఃఖింప జేయువారు, దుఃఖమును పోగొట్టు వారు (వీరు అజుడు, ఏక పాదుడు, ఆహిర్బుద్న్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు అను 11 మంది) వీరందరూ గణ దేవతలు.

విద్యాధరో ఽ ప్సరో యక్ష రక్షో గంధర్వ కిన్నరాః పిశాచో గుహ్యక స్సిద్దో భూతో ఽ మీ దేవయోనయః

విద్యాధరః = గుటికాంజనాది విద్యలను ధరించిన జీమూతవాహనాదుల వంటి వారు
అప్సరః = ఊర్వశి వంటి నీటి వలన పుట్టినవారు.
యక్షః = పూజింపబడు వారు.కుబేరాదులు.
రక్షః = వీరి నుంచి జంతువులు కాపాడబడతాయి కావున రక్షస్సులు - విభీషణాదులు
గంధర్వః = సువాసనను పొందు వారు గంధర్వులు - హా హా హూ హూ ప్రభృతులు.
కిన్నరః = గుఱ్ఱము మొగము గలవారు - తుంబురాదులు
పిశాచః = మాంసమును భుజించువారు - కుబేరానుచరులు
గుహ్యకః = నిధులను కాచువారు, తరచుగా కుత్సితము పలికెడు వారు - మాణిభద్రుని వంటి నిదిపాలకులు
సిద్ధః = ఆణిమాది సిద్ధులు గలవారు - విశ్వావసు వంటివారు.
భూతాః = ఇష్టము నొందెడి బాలగ్రహాదులు
 అమీ దేవయోనయః = అమీ అనగా వీరు దేవయోనయః అనగా దేవతలే ఉత్పత్తి స్థానముగా కలవారు లేక దేవతల వలన పుట్టిన వారు.
ఇవి 11 న్నూ దేవతా భేదముల పేర్లు.
అల్పానల్పాలు (Trivia) : అమరాకోశానికి దాదాపు 60 వరకు వ్యాఖ్యానాలు ఉన్నాయి. ముఖ్యమైనవి రచించిన వారు జాతరూపుడు, క్షీరా స్వామి, భానోజీ దీక్షితుడు, సర్వానందుడు, లింగయ సూరి, మల్లినాధ సూరి, అప్పయ్య దీక్షితులు, తాళ్ళపాక వేంకటాచార్యుడు మొదలగు వారు.

 అసురా దైత్యదైతేయ దనుజేంద్రారి దానవాః శుక్ర శిష్యా దితిసుతాః పూర్వదేవాః సురద్విషః

ఇచట చెప్పిన 10 పేర్లున్నూ రాక్షసుల పేర్లు :

అసురులు, దైత్యులు, దైతేయులు, దనుజులు (దనువను స్త్రీ వలన పుట్టిన వారు), ఇంద్రారులు(ఇంద్రుని శత్రువులు), శుక్ర శిష్యులు, దితి సుతులు, పూర్వ దేవులు(పూర్వకాలము దేవపదమందు ఉన్నవారు), సురద్విషులు (దేవతలను ద్వేషించు వారు).

సర్వజ్ఙః సుగతో బుద్దో ధర్మరాజ స్తధాగాతః
 సమంత భద్రో భగవాన్మార జిల్లోక జిజ్జినః
షడభిజ్ఙో దశ బలో ఽ ద్వయవాదీ వినాయకః
మునీన్ద్రః శ్రీఘనః శాస్తా మునిః -

సర్వజ్ఞః = సర్వమునెరిగిన వాడు
సుగతః = మంచి జ్ఞానము కలిగిన వాడు, లెస్సగా మోక్షము నందిన వాడు
బుద్ధః = మంచి బుద్ధి కలిగిన వాడు
ధర్మరాజః = సత్యము,అహింస మొదలుగా గల ధర్మములకు రాజు
తథాగతః = ఎట్లు పునరావృత్తి కలుగదో అట్టి గతి (మోక్షము) పొందిన వాడు
సమంత భద్రః = పుణ్య సంభారమునను, జ్ఞాన సంభారము వలనను శ్రేష్ఠుడు, సంపూర్ణమైన శుభము గలవాడు, భగవాన్ = సంపూర్ణమైన మాహాత్మ్యము, ధైర్యము, కీర్తి,సంపద, జ్ఞానము, వైరాగ్యము కలవాడు భగవానుడని చెప్పబడును
మారజిత్ = మన్మధుని జయించిన వాడు
లోకజిత్ = లోకమును తపస్సుచే జయించిన వాడు
జినః = సంసారమును జయించెడి వాడు
షడభిజ్ఙః = (దివ్యదృష్టి, దివ్యశ్రోత్రము, పూర్వనివాసానుస్మ్రుతి, పర చిత్త జ్ఞానము, అప్రత్యక్ష విషయ జ్ఞానము, వియద్గనాగమన వ్యూహాది లక్షణమైన బుద్ధి అను) ఆరు అభిజ్ఞలు గలవాడు
దశబలః = (బుద్ధి, క్షాంతి, వీర్యము, ధ్యానము, జ్ఞానము, కృప, శీలము, బలము, దానము, ఉపెక్ష అను) పది బలములు గలవాడు
అద్వయ వాదిః = జీవాత్మ, పరమాత్మలకు అభేదము డెల్పువాడు
వినాయకః = ప్రాణులకు హితము బోధించువాడు
 మునీన్ద్రః = మునులలో శ్రేష్ఠుడు ఉంటారు,
 శ్రీఘనః = యోగ సంపద చేత అధికుడు
 శాస్తా = దుష్టులను శిక్షించువాడు
 మునిః = సర్వ ధర్మములనెరిగిన వాడు ఈ 18 బుద్ధుని పేర్లు

 అల్పానల్పాలు (Trivia) : అమర సింహుడు బౌద్దుడని ఈ పైన చెప్పిన శ్లోకాన్ని ఉటంకిస్తూ పండితులు అభిప్రాయ పడుతూ ఉంటారు కానీ మిగిలిన వారు ఈ వాదాన్ని ఖండించి ఆయనకు విస్తృతమైన వైదిక పరిభాషా పారీణత ఉన్నదనీ జైన బౌద్ధులకు ఇంత వైదిక భాషా పారీణత లేదనీ దానికి తార్కాణంగా అనేక శ్లోకాలను ఉదహరిస్తూ ఉంటారు.

స శాక్యసింహ స్సర్వార్ధసిద్ధ శౌద్దోద నిశ్చసః
గౌతమ శ్చార్కబందుశ్చ మాయా దేవీ సుతశ్చసః

ఇవి శాక్యముని (శాక వనమందుండు వాడు, శక దేశముల యందు పుట్టిన ముని) పేర్లు.
శాక్య సింహుడు, సర్వార్ధ సిద్ధ (అన్ని పనులయండు కృతార్దుడైన వాడు),
శౌద్దోదన (శుద్దోదనుని కుమారుడు, న్యాయ పరిశుద్ధమైన అన్నమును భుజించు వాని కుమారుడు),
గౌతమ (గౌతమ ముని వంశమున బుట్టిన వాడు),
 అర్క బంధు (సూర్య వంశమున పుట్టిన వాడు),
మాయాదేవీ సుత

ఇవి ఆరున్నూ శాక్య ముని (బుద్ధుని) పేర్లు

 బ్రహ్మత్మ భూః సురజ్యేష్ఠః పరమేష్టీ పితామహః
 హిరణ్య గర్భో లోకేశ స్వయంభూ శ్చతురాననః
 ధాతాబ్జయోని ర్ద్రుహిణో విరిన్చిః కమలాసనః
స్రష్టా ప్రజాపతిర్వేధా విధాతా విశ్వసృ డ్విధిః
 (శతానంద శ్శతధృతి ర్విరిన్చోజో విరిఞ్చనః)

బ్రహ్మః = ప్రజలను వృద్ధి పొందించు వాడు,
ఆత్మభూః = తనంతట తాను పుట్టిన వాడు,
సుర జ్యేష్ఠః = దేవతలలో పెద్ద వాడు,
పరమేష్టి = ఉత్కృష్టమైన స్థానమునందుండు వాడు,
పితామహః = పితరుల(తండ్రిని) పుట్టించిన వాడు,
 హిరణ్య గర్భః = హిరణ్యమయమైన గర్భము గలవాడు, గర్భమందు హిరణ్యము గలవాడు,
లోకేశః = పదునాలుగు లోకములకు ప్రభువు ,
స్వయంభూః = తనంతట తానే పుట్టిన వాడు,
చతురాననః = నాల్గు ముఖములు కలిగిన వాడు,
ధాతః = సమస్తములను ధరించిన వాడు,
అబ్జ యోనిః = విష్ణు నాభి కమలమందు జనియించిన వాడు,
ద్రుహిణః = అసురులకు హింస జేయువాడు,
విరిన్చిః = భూతములను సృజించు వాడు, హంసలచే వహింప బడు వాడు,
కమలాసనః = కమలము ఆసనముగా కలవాడు,
స్రష్టః = సృష్టించు వాడు,
ప్రజాపతిః = ప్రజలకు ప్రభువు,
వేధాః = సృజించువాడు,
విధాతః = సర్వము జేయు వాడు,
విశ్వ సృట్ = విశ్వమును సృజించు వాడు,
విధిః = సర్వము జేయు వాడు.

ఇవి ఇరవయిన్నీ బ్రహ్మ పేర్లు

విష్ణు ర్నారయణః కృష్ణో వైకుంఠో విష్టరశ్రవాః
దామోదరో హృషీకేశః కేశవో మాధవః స్వభూః
దైత్యారిః పుండరీకాక్షో గోవిందో గరుడ ధ్వజః
పీతాంబరో ఽ చ్యుత శార్ఙ్గీ విష్వక్సేనో జనార్దనః
ఉపేంద్రో ఇంద్రావరజ శ్చక్రపాణి శ్చతుర్భుజః
పద్మనాభో మధురిపు ర్వాసుదేవ స్త్రివిక్రమః
దేవకీనందన శ్శౌరిః శ్రీపతిః పురుషోత్తమః
వనమాలీ బలిద్వంసీ కంసారాతి రధోక్షజః
విష్వంభరః కైటభజిద్విధుఃశ్రీవత్స లాంఛనః
(గదాగ్రజో ముంజకేశో దాశార్హోదశరూప భృత్)

విష్ణుః = విశ్వమున వ్యాపించిన వాడు
నారాయణః = నారా సంబంధమైన శరీరము గలవాడు, జలము(నార) స్థానముగా గలవాడు, ఎవరివలన శబ్దము వెడలుచున్నదో అతడు రాయణుడు, రాయణుడు కాని వాడు అరాయణుడు, నారాయణుడనగా అరాయణుడు కాని వాడు అనగా శబ్ద గమ్యుడు.
కృష్ణః = అన్నిటిని చేయువాడు, దైత్యులను నలిపివేయు వాడు, నల్లని(కృష్ణ) వర్ణము కలిగిన వాడు
వైకుంఠః = ఒకానొక మన్వంతరమున వికుంఠ అనునామెకు జనియించిన వాడు.
విష్టరశ్రవాః = దర్భ ముడి వంటి చెవులు గలవాడు, అశ్వత్థ వృక్షమందు వినబడు వాడు, వ్యాపన శీలమైన కీర్తి గలవాడు
దామోదరః = ఉదరమందు తులసి మాలిక గలవాడు, బాల్యమున యశోదచే ఉదరమున పలుపు కట్టబడిన వాడు. హృషీకేశః = ఇంద్రియములకు ఈశ్వరుడు
కేశవః = మంచి వెంట్రుకలు గలవాడు, కేశి అను అసురుని చంపిన వాడు
మాధవః = లక్ష్మీదేవికి భర్త, మధువు (యదువు యొక్క పెద్ద కుమారుడు)వంశములోని వాడు, శత్రువులను కంపింప చేయువాడు
స్వభూః = తనంత తానే పుట్టిన వాడు
దైత్యారిః = దైత్యులకు శత్రువు
పుండరీకాక్షః = తెల్లని తామరవంటి కనులు కలవాడు, హృదయ కమలమందు వ్యాపించువాడు
గోవిందః = భూమిని, స్వర్గమును, గోవును, వేదమును పొందువాడు
గరుడధ్వజః = గరుత్మంతుడే ధ్వజముగా గలవాడు.
పీతాంబరః = పచ్చని వలువలు ధరించినవాడు.
అచ్యుతః = తన చోటు నుంచి భ్రంశమునొందని వాడు
శార్ఙ్గీ = శార్ఙ్గమను విల్లు గలవాడు
విష్వక్సేనః = అంతటా వ్యాపించిన సేన గలవాడు
జనార్దనః = సముద్ర మధ్యమునందు ఉండెడు ‘జనులు’ అనెడు అసురులను పీడించిన వాడు
ఉపేంద్రః = ఇంద్రుని తమ్ముడు, ఇంద్రుని రక్షించుటకై అతని వద్ద యున్న వాడు, ఇంద్రలోకము పై లోకమందు ఉండువాడు
ఇంద్రావరజః = ఇంద్రుని తమ్ముడు
చక్రపాణిః = చక్రమును హస్తమందు కలిగినవాడు
చతుర్భుజః = నాల్గు భుజములు కలిగినవాడు
పద్మనాభః = పద్మము నాభి యందు గలిగినవాడు,
 మధురిపుః = మధువను రాక్షసుని శత్రువు
వాసుదేవః = వాసుదేవుని కుమారుడు, అన్ని జగములు తనయందు కలిగినవాడు (వస నివాసే), జగము అంతటను ఉండువాడు
త్రివిక్రమః = బలి బంధనమున ముజ్జగాములను మూడు అడుగులతో కొలిచిన వాడు
దేవకీ నందనః = దేవకీ దేవి కుమారుడు
శౌరిః = శూరుడు వసుదేవుని తండ్రి, అతని మనుమడు కనుక శౌరి
శ్రీపతిః = లక్ష్మీ దేవికి భర్త
పురుషోత్తమః = పురుషులయందు ఉత్తముడు
వనమాలిః = పాదముల వరకు వ్రేలాడెడు పుష్ప మాలిక ధరించినవాడు
బలిద్వంసీ = బలిని అణచినవాడు.
కంసారాతిః = కంసుని శత్రువు
అదోక్షజః = ఇంద్రియములను అధఃకరించి జనియించిన వాడు, జితేంద్రియులకు ప్రత్యక్షమగు వాడు
విశ్వంభరః = విశ్వములను భరించువాడు
కైటభజిత్ = కైటభుడను రాక్షసుని మర్దించిన వాడు
 విధుః = శత్రువులను వ్యధ పెట్టువాడు
శ్రీ వత్స లాంచనః = వక్ష స్థలమందు మహా పురుష లక్షణమైన శ్రీ వత్సమనెడు మచ్చను గురుతుగా గలవాడు

ఈ 39 న్నీ మహావిష్ణువు పేర్లు

వసుదేవో స్య జనక స్స ఏవా వానక దుందుభిః వసుదేవుడు,

ఆనక దుందుభి అనునవి శ్రీకృష్ణుని తండ్రి యొక్క పేర్లు.
ఇతని జనన సమయమున దేవతలు ఆనకములు, దుందుభులు మ్రోగింఛిరి కనుక యితడు ఆనక దుందుభి.

బలభద్రః ప్రలంబఘ్నోబలదేవో చ్యుతాగ్రజః
రేవతీరమణో రామః కామపాలో హలాయుధః
నీలాంబరో రోహిణేయ స్తలంకో ముసలీ హలీ
సంకర్షణ స్సీరపాణిః కాళిందీ భేదనో బలః

బలభద్రః = బలము చేత శ్రేష్టుడు,
ప్రలంబఘ్నః = ప్రలంబుడను రాక్షసుని చంపినవాడు,
బలదేవః ==బలముచేత ప్రకాశించువాడు,
అచ్యుతాగ్రజః = అచ్యుతుని అన్న,
రేవతీరమణః = రేవతీ దేవి భర్త,
రామః = రూప సంపదచేత సంతోషింప జేయు వాడు,
కామ పాలః = భక్తుల కోర్కెల తీర్చువాడు, కుమారుదగుట వలన మన్మధుని పాలించువాడు,
హలాయుధః = నాగలి ఆయుధముగా గలవాడు,
నీలామ్బరః = నల్లని వలువలు గట్ట్టువాడు,
రౌహిణేయః + రోహిణీ దేవి కుమారుడు,
తాలంకః = తాళ వృక్షాకారమైన ధ్వజము గలవాడు,
ముసలీః = ముసలము ఆయుధముగా గలవాడు,
హలీః = నాగలి ఆయుధముగా గలవాడు, \
సంకర్షణః = శత్రువులను లేక ప్రళయ కాలమందు సర్వజనులను సంహరించువాడు,
సీరపాణీ = నాగలి చేతియందు ధరించు వాడు,
కాలిందీ భేదనః = హలము చేత కాళిందీ నదిని భేదిమ్చిన వాడు,
బలీ = బలము గలవాడు.

ఈ పదహారున్నూ బలరాముని పేర్లు

మదనో మన్మదో మారః ప్రద్యుమ్నో మీనకేతనః
కందర్పో దర్పకోనంగః కామః పంచ శర స్మరః
సంబరారి ర్మనిసిజః కుసుమేషు రనన్యజః
పుష్పధన్వా రతిపతి ర్మకరధ్వజ ఆత్మభూః
( శృంగార యోనిః శ్రీపుత్రః శూర్పకార్యాతి రిత్యపి)
బ్రహ్మాసూర్విశ్వకేతుః స్యాత్ –

మదనః = మదింపజేయువాడు,
మన్మదః = బుద్ధిని కలియ బెట్టువాడు,
మారః = విరహి జనులను జంపు వాడు,
ప్రద్యుమ్నః = ప్రకృష్టమైన బలము గలవాడు,
మీన కేతనః = మత్స్యమును టెక్కెముగా (జెండాగా) గలవాడు,
కందర్పః = కుత్సితమైన దర్పము గలవాడు, బ్రహ్మను కూడా దర్పించిన వాడు, గర్వింప జేయు వాడు,
అనంగః = శరీరము లేని వాడు,
కామః = కోరికలకు కారణభూతుడు,
పంచ శరః = ఉన్మాదన, తాపన, శోషణ, స్తంభన, సమ్మోహనములను ఐదు శరములు గలవాడు,
 స్మరః = కామినీ కాముకులను తొందర పెట్టు వాడు,
శంబరారి = శంబరుడనే రాక్షసునకు శత్రువు,
మనసిజః = మనస్సు నందు పుట్టెడు వాడు,
కుసుమేషుః = పువ్వులు బాణములుగా కలవాడు,
అనన్యజః = మనస్సు కంటే ఇతర చోట్ల పుట్టని వాడు,
పుష్పధన్వాః = పుష్పములు ధనుస్సుగా కలవాడు,
రతిపతిః = రతీదేవి భర్త,
మకరధ్వజః = ధ్వజమునందు మకరము కలవాడు,
ఆత్మభూః = మనస్సున పుట్టెడి వాడు, తనంతట తానె పుట్టువాడు,
బ్రహ్మసూః = బ్రహ్మను, తపస్సును కూడా కలత పెట్టు వాడు,
ఋష్య కెతుః = ఋష్యమను మృగమును జెండాపై ధరించిన వాడు/
విశ్వకెతుః = విశ్వ వ్యాపకమైన తేజస్సు కలవాడు.

ఈ యిరవైయొక్కటిన్ని మన్మధుని పేర్లు.

అనిరుద్ధ ఉషాపతిః
అనిరుద్ధః = పరులచేత అడ్డగించబడని వాడు,
ఉషాపతిః = బాణుని కొమరిత ఉషకు భర్త.

లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీర్హరి ప్రియా
(ఇందిరా లోకమాతా మా రమా మంగళదేవతా భార్గవీ లోక జననీ క్షీరసాగరకన్యకా)

ఈమె సర్వమును చూడగలదు కావున లక్ష్మి,
పద్మమే ఇల్లుగాకలది, పద్మమును చేతియందు ధరించునది కాబట్టి పద్మాలయాః
కమలా యనగా కమలమును చేతియందు ఉన్నది,
శ్రీః అనగా హరిని ఆశ్రయించి యుండునది,
హరిప్రియః = విష్ణు మూర్తి ప్రియురాలు,
ఇందిరాః = పరమైశ్వర్యయుక్తురాలు,
లోకమాతః, మాః, లొకజననీః = లోకములకు తల్లి,
మంగళ దేవతాః = సర్వ శుభములకు దేవత,
భార్గవీః = భృగు మహర్షి కుమార్తె,
క్షీరసాగర కన్యకాః = పాలకడలి కుమార్తె.

ఇవి పన్నెండున్ను లక్ష్మీ దేవి పేర్లు

శంఖోః లక్ష్మీపతేః పాంచజన్యః

ఈ విష్ణుమూర్తి శంఖము పాంచజన్యము (సముద్రమున తిమిర రూపుడైయున్నట్టి పంచజనుడను రాక్షసుని ఆస్థి వలన పుట్టినది.

చక్రం సుదర్శనః
భక్తులచే సుఖముగా చూడబడునట్టి (సుదర్శనః) చక్రము విష్ణుమూర్తి ఆయుధము.

కౌమొదకీ గదాః
(కుం = భూమిని, మోదయతి = సంతోషపెట్టునది) భువిని సంతోషింపజేయు గద, విష్ణుమూర్తి సంబంధమైనది.

ఖడ్గో నందకః
నందకః = దేవతలను ఆనందింప జేయు ఖడ్గం ఇది నందకము.
కౌస్తుభో మణిః (చాప శ్శార్ఙ్గ మురారేస్తు శ్రీవత్సో లాఞ్చనం మతమ్)
కౌస్తుభః = భూమిని నిలిపినది, సముద్రమందు పుట్టినది ఐన మణి - విష్ణుమూర్తి ధరించినది.
చాప శ్శార్ఙ్గః = శ్శార్ఙ్గమనెడి ధనుస్సు,
శ్రీ వత్స లాఞ్చనం = పుట్టు మచ్చ – శ్రీవత్సము.

గరుత్మాన్ గరుడ స్తార్ క్ష్యో వైనతేయః ఖగేశ్వరః
నాగాంతకో విష్ణురధః స్సుపర్ణః పన్నగాశానః

గరుత్మాన్ = రెక్కలు గలవాడు,
గరుడః = రెక్కలచే ఎగిరెడి వాడు, 
తార్క్ష్యః = తృక్షుడను ముని కుమారుడు,
వైనతేయః = వినత కొమరుడు,
ఖగేశ్వరః= పక్షులకు ఈశ్వరుడు,
నాగాంతకః = సర్పములకు నాశకుడు,
విష్ణు రధః = విష్ణువునకు రధమైనవాడు,
సుపర్ణః = మంచి రెక్కలు గలవాడు,
పన్నగాశానః = సర్పములు అన్నముగా గలవాడు.
ఈ తొమ్మిదిన్నీ గరుత్మంతుడి పేర్లు.
ఈ పైన చెప్పినవి విష్ణు సంబంధమైన వాటి పేర్లు.

శంభు రీశః పశుపతి శ్శివశ్శూలీ మహేశ్వరః
ఈశ్వర శ్శర్వ ఈశాన శ్శంకర శ్చంద్ర శేఖరః
భూతేశః ఖండపరశు ర్గిరీశో గిరిశో మృడః
మృత్యుంజయః కృత్తివాసాః పినాకీ ప్రమధాదిపః
ఉగ్రః కపర్దీ శ్రీకంఠః శ్శితికంఠః కపాలభృత్,
వామదేవో మహాదేవో విరూపాక్షః స్త్రిలోచనః
కృశానురేతా స్సర్వజ్ఞో ధూర్జటీ ర్నీలలోహితః
హరః స్మర హరో భార్గ స్త్ర్యంబక స్త్రిపురాన్తకః
గంగాధరోంధకరిపుః క్రతుద్ధ్వంసీ వృషధ్వజః
వ్యోమకేశో భవో భీమః స్థాణూ రుద్ర ఉమాపతిః
 (అష్టమూర్తి రహిర్బుద్న్యో మహాకాలో మహానటః)

శమ్భుః = సుఖమునిచ్చు వాడు,
ఈశః = ఐశ్వర్య యుక్తుడు
పశుపతి = పశువులనగా ప్రమధులు, వారికి ప్రభువు, పశువులనగా జీవులు వారిని సంసార బంధముల రక్షించువాడు,
శివః = బ్రహ్మానంద స్వరూపుడు, నిర్వికారుడు కనుక శమించి యుండువాడు, మనసుల యందు శయనించి యుండువాడు
శూలీ = శూలమును ఆయుధముగా కలవాడు
మహేశ్వరః = శ్రేష్టుడయిన ఈశ్వరుడు, ఐశ్వర్య యుక్తుడు
శర్వః = ప్రళయమందు భూతముల హింసించు వాడు
ఈశానః = ఐశ్వర్యము గలవాడు
శంకరః = సుఖముల గలుగజేయువాడు
చంద్ర శేఖరః = చంద్రుడు శిరోభూషణముగా గలవాడు
భూతేశః = ప్రమాద గణములకు ఈశ్వరుడు
ఖండ పరశుః = ఖండించెడు గొడ్డలి ఆయుధముగా గలవాడు
గిరీశః = కైలాసమునకు ఈశ్వరుడు
గిరిశః = కైలాసమందు శయనించు వాడు
మృడః = భక్తుల సుఖింప జేయు వాడు, తాను సుఖము గలవాడు
మృత్యుంజయః = మృత్యువును జయంచిన వాడు
కృత్తి వాసాః = చర్మమును వస్త్రముగా గలవాడు
పినాకీ = పినాకమను విల్లు ఆయుధముగా గలవాడు
ప్రమధాదిపః = ప్రమాద గణములకు అధిపుడు
ఉగ్రః = భయంకరుడు
కపర్దీ = కపర్దమను జటాజూటము కలిగిన వాడు
శ్రీకంఠః = కాలకూటమును భరించుట వలన శ్యామల వర్ణమైన కంథము గలవాడు
శితి కంఠః = నల్లని కంథము గలవాడు
కపాలభృత్ = కపాలమును భరియించిన వాడు
వామదేవః = శ్రేష్టుడైన దేవుడు, ఎడమ ప్రక్కన భార్యను ధరించిన వాడు
మహాదేవః = శ్రేష్టుడైన దేవుడు,
విరూపాక్షః = సూర్య చంద్రాగ్ని రూపమగుట వలన మూడు కన్నులు గలవాడు
త్రిలోచనః = మూడు కన్నులు గలవాడు,
కృశానురేతాః = అగ్ని రూపమైన రేతస్సు గలవాడు
సర్వజ్ఙః = సర్వము నెరింగిన వాడు
ధూర్జటి = భారమైన జడలు గలవాడు
నీల వర్ణః = బ్రహ్మ హోమము చేయునపుడు లలాటస్వేదము తేజ రూపమున అగ్నియందు బడి నీలవర్ణమై పిదప రక్త వర్ణమయ్యెను. అందుండి పుట్టిన వాడు కనుక నీల లోహితుడు , కంఠమందు నీల వర్ణము కలిగిన వాడు
హరః = ప్రళయ కాలమందు సర్వమును హరించు వాడు, భక్తుల పీడను హరించు వాడు
స్మరహరః = మన్మధుని సంహరించిన వాడు
భర్గః = కామ కాలాదులను, కాలపాకమును బొందించిన వాడు
త్ర్యంబకః = మూడు కన్నుల గలవాడు, మూడు లోకములకు తండ్రి,
త్రిపురాంతకః = త్రిపురములకు నాశకుడు
గంగాధరః = గంగను ధరించిన వాడు
అంధకస్య రిపుః = అంధకాసురునికి శత్రువు
క్రతు ద్వంసీ = దక్ష యజ్ఞమును చెరిచిన వాడు
వృషధ్వజః = వృషభము ధ్వజముగా గలవాడు
వ్యోమకేశః = ఆకాశమున నిండియున్న తలవెంట్రుకలు గలవాడు
భవః = అంతటయు తానై యున్నవాడు
భీమః = ముల్లోకముల భయకంపితుల జేయు వాడు
స్థ్హాణుః = ప్రలయమందు యుండు వాడు
రుద్రః = శత్రువులను దుఃఖపెట్టు వాడు (ఒకానొకప్పుడు బ్రహ్మ వలన జననమొంది దుఃఖించెనుగనుక రుద్రుడని పురాణ ప్రసిద్ది), దుఃఖమును పోగొట్టువాడు
ఉమాపతిః = పార్వతీ దేవికి భర్త ఇవి నలభై ఎనిమిదిన్నీ శివుని పేర్లు.

కపర్దస్య జటాజూటః
ఈ శివుని యొక్క జటాజూటము కపర్దమని చెప్పబడుచున్నది.

పినాకో జగవం ధనుః
 త్రిపుర దహన కాలమందు శరజ్వాలల చేత (పిహితవాన్) స్వర్గమును కప్పినది కనుక పినాకము,
అజగవః = అజగవముయొక్క ఆస్థి విశేషము
ఇవి శివుని వింటి పేర్లు.

ప్రమధాః స్యుః పారిషదాః
ప్రమధాః = శత్రువులను మధించువారు,
పారిషదాః = సభ యందు సాధువులు – వీరు చండీశ్వర, నందీశ్వర, భృంగి, మహా కాలాది ప్రభృతులు.
వీరు ప్రమధ గణములు.
(బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ చేంద్రాణీ చాముండా సప్తమాతరః) వీరందరూ సప్త మాతృకలు, శివునికి పరిచర్య చేయువారు. వీరు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ.
విభూతి ర్భూతి రైశ్వర్య మణిమాదిక మష్టధా
(అణిమా మహిమాచైవ గరిమా లఘిమా తథా ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్టభూతయః)

విభూతి = విశేషముగా గలుగునట్టిది,
ఐశ్వర్య = ఈశ్వర భావము, ఆ ఐశ్వర్యము ఆణిమాది భేదము చేత ఎనిమిది విధములు – ఆణిమా = సూక్షత్వము, మహిమా = మహత్తులు గలిగి యుండుట, గరిమా = గురుత్వము అనగా బెద్దయగుట, లఘిమా = లుఘుత్వము అనగా చిన్నది యగుట, ప్రాప్తిః =ఇష్ట ప్రాప్తి, ప్రాకామ్య = సంచార శక్తి ఈశత్వమ్ = సర్వాతిశయం, వశిత్వం = స్వాధీనేన్ద్రియత్వం. ఇవి అష్టైశ్వర్యములు.

ఉమా కాత్యాయనీ గౌరీ కాళీ హైమవతీశ్వరీ
శివా భవానీ రుద్రాణీ శర్వాణీ సర్వమంగళా
అపర్ణా పార్వతీ దుర్గా మృడానీ చండికాంబికా
(ఆర్యా దాక్షాయణీ చైవ గిరిజా మేనకాత్మజా)

ఉమా = (ఉ = ఓ బిడ్డా మా = వలదు) తల్లిచే తపస్సువలన నిషేధింప బడినది, రక్షణ ఇచ్చునట్టిది.
కాత్యాయనీ = మోక్షములెన్ని అని విచారించినట్టి కత్యాయన ఋషి గోత్రమున బుట్టినది.
గౌరీ = గౌర వర్ణము కలిగినట్టిది (తెల్లని ఛాయ గలది)
కాళీ = నీల వర్ణము గలది
హైమవతీ = హిమవంతుని కుమార్తె,
ఈశ్వరీ = ఈశ్వరుని పత్ని
 శివా = శుభము గలది, శివుని భార్య
 భవానీ = భవుని భార్య
రుద్రాణీ = రుద్రుని ఇల్లాలు
శర్వాణీ = శర్వుని భార్య
సర్వ మంగళా =సమస్తమైన శుభములు గలది
అపర్ణా = పర్ణములు గూడ భుజింపక తపమొనర్చినది
పార్వతీ = పర్వతుని కూతురు
దుర్గా = కష్టముచే ఎరుంగ గలిగినది, వనాది దుర్గములు స్థానముగా కలది
మృడానీ = మృడుని భార్య
చండికా = చండాసురుని చంపినది, కోపము గలది
అంబికా = లోకములకు తల్లి, సమస్తలోకములను జనింపజేయునది
(ఆర్యా = శ్రేష్టురాలు , దాక్షాయణీ = దక్షుని కూతురు, గిరిజా = పర్వతము వలన పుట్టినది, మేనకాత్మజా = మేనకా దేవి కూతురు)

ఈ ఇరవైయెకటిన్నీపార్వతీ దేవి పేర్లు.

వినాయకో విఘ్న రాజః ద్వైమాతుర గణాదిపః
అప్యేక దంత హేరంబ లంబోదర గజాననాః

వినాయకః = దుష్టులను, విఘ్నములను శిక్షించువాడు, స్వతంత్రుడౌటవలన తనకు ఇతర ప్రభువు లేనివాడు విఘ్నరాజః = విఘ్నములకు రాజు
ద్వైమాతురః = ఇద్దరు తల్లులు గలవాడు (గంగా, పార్వతి లకు యితడు కుమారుడు)
గణాధిపః = ప్రమధాది గణములకు నాయకుడు
ఎకదంతః = కుమారస్వామిచే ఒక దంతము పెరికివేయ బడెను కనుక ఏకదంతుడు
హేరంభః = రుద్రుని యెద్దనుండువాడు, భక్తులను వృద్ధి పొందించువాడు
లంబోదరః = వ్రేలెడి బొజ్జ గలవాడు
గజాననః = ఏనుగు మొగము వంటి మొగము గలవాడు.

ఈ ఎనిమిదిన్నీ వినాయకుని పేర్లు

కార్తికేయో మహాసేన శ్శరజన్మా షడాననః
పార్వతీ నందన స్కన్ద స్సేనానీ రగ్ని భూర్గుహః
బాహులేయక స్తారకజి ద్విశ్శాఖ శ్శిఖి వాహనః
షాణ్మాతురః శ్శక్తిధరః కుమారః క్రౌంచ ధారణః
(భృంగీ భృంగిరిట స్తుండి నందినౌ నందికేశ్వరే
కర్మ మోటీ తు చాముండా చర్మ ముండా తు చర్చికా)
కార్తికేయః = షట్కృత్తికల కుమారుడు,
మహాసేనః = గొప్ప సేన గలవాడు
శరజన్మాః = ఱెల్లు నందు జన్మించిన వాడు, ఉదకమందు జన్మించిన వాడు
షడాననః = షట్కృత్తికల స్తన్య పానము చేయుటకై ఆరు మొగములు ధరించిన వాడు
పార్వతీ నందనః = పార్వతీ దేవి కుమారుడు
స్కంధః = శతృవులను శోషింపజేయువాడు, శివుని రేతస్సుచే జనించిన వాడు
సెనానీః = దేవసేనను నడిపించు వాడు
అగ్నిభూః = అగ్ని వలన బుట్టిన వాడు
గుహః = తన సేనలను రక్షించుకొనువాడు
బాహులేయః = కృత్తికల కొడుకు
తారకజిత్ = తారకాసురుని జయించిన వాడు
విశాఖః = విశాఖా నక్షత్రమున జన్మించిన వాడు, పక్షియైన నెమలిపై తిరుగువాడు
శిఖివాహనః = నెమలి వాహనముగాగలవాడు
షణ్మాతురః = ఆరుగురు తల్లులు గలవాడు
శక్తిధరః = శక్తి యను ఆయుధము గలవాడు
కుమారః = ఎల్లపుడు బాలుడుగా కనబడు వాడు, కుత్సితులను సంహరించువాడు, భువియండు మన్మధునివలె అందమైన వాడు, ఎల్లపుడును బ్రహ్మచారి
క్రౌంచ ధారణః = క్రౌంచ పర్వతమును ఉక్కళించినవాడు

ఇవి పదిహేడున్నూ కుమార స్వామి పేర్లు

(భృంగి, భృంగిరటి, తుండీ, నంది యన్నవి నందీశ్వరుని పేర్లు మరియు కర్మమోటి, చాముండా, చర్మ ముండా, చర్చిక అన్నవారు శివ పరిచారికల పేర్లు)

ఇంద్రో మరుత్వా న్మఘవా బిడౌజాః పాక శాసనః
వృద్ధశ్రవాః సునాసీరః పురుహూతః పురందరః
జిష్ణు ర్లేఖర్షభశ్శక్ర శ్షతమన్యు ర్దివస్సతిః
సుత్రామా గోత్రభి ద్వజ్రీ వాసవో వృత్రహా
వృషా వాస్తోష్పతి స్సురపతి ర్బలారాతి శ్శచీపతిః
జంభ భేదీ హరిహయ స్స్వారాణ్ణముచిసూదనః
సంక్రన్దనో దుశ్చ్యవనస్తురాషాణ్మేఘ వాహనః
(ప్రాచీన బర్హిరహిహా పృతనాషాట్పులోమజిత్)
ఆఖండలః సహస్రాక్ష ఋభుక్షాః –

ఇంద్రః = పరమ ఐశ్వర్య యక్తుడు
మరుత్వాః = దేవతలు గలవాడు
మఘవాః = పూజింపబడువాడు, యాగము గలవాడు
బిడౌజాః =వ్యాపన శీలమైన తేజస్సు గలవాడు, శత్రువులను ఆక్రోశింపజేయునట్టి తేజస్సు గలవాడు
పాకశాసనః = వృత్రాసురుని సోదరుడైన పాకాసురుని జంపినవాడు, గర్భమును శిక్షించినవాడు
వృద్ధశ్రవాః = ప్రవృద్ధమైన కీర్తి కలిగిన వాడు, వృద్ధులచే వినబడు వాడు, వృద్దులైన బృహస్పత్యాదుల వలన హితము వినువాడు,
సువసీరః = శ్రేష్టమైన సేనాగ్ర భాగము గలవాడు
శునాస్సీరాః = ఎవని చేత నాగేళ్ళు సమృద్దములగుచున్నవో అతడు, వాయు సూర్యులు గలవాడు
పురుహూతః = యజ్ఞములందు ప్రచురమైన పిలుపు గలవాడు, యజ్ఞములందు మిక్కిలి పిలువబడువాడు, పురువు అనెడు రాక్షసుని చంపినావాడు
పురందరః = శత్రువుల పురములను వ్రక్కళించిన వాడు
జిష్ణుః = జయించు శీలముగలవాడు
లేఖర్షభః = దేవతలలో శ్రేష్ఠుడు
శక్రః = దుష్టులపై జయమునందు శక్తుడు
శతమన్యుః = నూరు క్రతువులు గలవాడు
దివస్పతిః = దేవతలకు ప్రభువు
సుత్రామా = లోకములను మెండుగా రక్షించువాడు
గోత్రభిత్ = పర్వతములను భేదించిన వాడు
వజ్రీ = వజ్రాయుధము గలవాడు
వాసవః = రత్నములు గలవాడు
వృత్రహా = వృత్రాసురుని చంపిన వాడు
వృషాః = వర్షించువాడు
వాస్తోష్పతి = గృహ, క్షేత్రాదులకు అదిదేవత
సురపతి = దేవతలకు ప్రభువు
 బలారాతిః = బలాసురునికి శత్రువు
శచీపతిః = శచీదేవి భర్త
జంభభేదీ = జంభాసురుని భేదించిన వాడు,
హరిహయః = పచ్చని గుర్రములు గలవాడు
స్వరాట్ = స్వర్గమునందు ప్రకాశించు వాడు
నముచి సూదనః = నముచి యను రాక్షసుని హింసించినవాడు
సంక్రందనః = శత్రువుల మొరపెట్టించువాడు
దుష్చ్యవనః = తన వజ్రాయుధమునకు సాధ్యము కాని చ్యవనముని గలవాడు(చ్యవన ముని తన వృద్ధత్వమును అశ్వనీ దేవతలచే బాపుకొని వారలకు కృతజ్ఞతా పూర్వకముగా యజ్ఞ భాగములు కల్పించినప్పుడు ఇంద్రుడు కుపితుడై ఆయనపై వజ్రాయుధము నెత్తగా ఆ ఋషిప్రభావముచే స్తబ్ధబాహుడయ్యెనని పురాణ గాధ)
తుషారాట్ = శత్రువుల వేగమును సహించు వాడు
మేఘ వాహనః = గజ రూపమైన మేఘములు వాహనముగా గలవాడు, మేఘములయందు ప్రవేశించి వర్షించు వాడు
అఖండలః = శత్రువులను ఖండించు వాడు
సహస్రాక్షః = వేయి కన్నులు గలవాడు
ఋభుక్షాః = దేవతలను పనియందు ప్రేరేపించు వాడు

ఈ ముప్పై ఐదున్నూ ఇంద్త్రుని పేర్లు

పులోమజా శచీంద్రాణీ

పులోమజా = పులోముడను ముని వలన బుట్టినది
శచీ = హంసవంటి నడక గలిగినది
ఇంద్రాణి = ఇంద్రుని భార్య

 ఈ మూడున్ను శచీ దేవి పేర్లు

నగరీ త్వమరావతీ
 దేవతలు ఇందు నివసింతురు కనుక ఇంద్ర నగరి అమరావతి యని పేరునందినది

హయ ఉచ్చైశ్రవాః
ఉచ్చైశ్రవాః = ఉన్నతమైన చెవులు గలది, ఉన్నతమైన కీర్తి కల్గినది ఇంద్రాశ్వము ఉచ్చైశ్రవమని పిలువబడును 

సూతో మాతలిః
మాతలిః = కర్మములయండు మతములను గ్రహించినవాడు మతలుడు ఇతని కుమారుడు మాతలి. ఇంద్రుని సారధి మాతలి

నందనం వనం
నందనం = ఆనందము కలుగజేయునది ఇంద్రుని వనము నందన వనము

స్యాత్ ప్రాసాదో వైజయంతః
వైజయంతః = ప్రశస్తమైన ధ్వజములు కలది ఇంద్రుని మేడ వైజయంతము

జయంతః పాకశాసనిః
జయంతః = శత్రువుల జయించువాడు
పాకశాసని = పాకశాసనుని కుమారుడు 
ఇవి రెండున్ను ఇంద్రుని కుమారుడు జయంతుని పేర్లు

ఐరావతో భ్రమాతం గైరావణాభ్రము వల్లభాః
ఐరావతః = ఇరములనగా జలములు అవి గలవాడు సముద్రుడు అందు పుట్టినది ఐరావతము
అభ్రమాతంగః = ఆకాశామునందు ఉండెడి ఏనుగు, మేఘ స్వరూపమైన ఏనుగు
ఐరావణః = ఇరావణమనునది కల్లు గల వనము- అందు పుట్టినది 
అభ్రమువల్లభః = అభ్రమవనే ఆడ ఏనుగుకు పతి
ఇవి నాలుగున్ను ఇంద్రుని ఏనుగు పేర్లు

హ్రాదినీ వజ్ర మస్త్రీస్యా త్కులిశం భిదురం పవిః
శతకోటి స్స్వరుశ్శంభో దంభోళి రశనిర్ద్వయోః
హ్రాదినీ = మ్రోయుచుండినట్టిది
వజ్రం = అడ్డు లేనట్టిది
కులిశం = కీర్తిని వృద్ది పొందించునది, పర్వతముల రెక్కలను చేదించి వాటిని స్వల్పముగా చేయునది
భిదురం =శత్రు సైన్యములను భేదించునట్టిది
పవిః = వైర శుద్ధి (పగ తీర్చుకొనుట) చేయునట్టిది
శతకోటిః = నూరు అంచులు గలది
స్వరుః = మ్రోగునట్టిది, శత్రువులను దహింపజేయునట్టిది(అరుస్సులనగా అంచులు)
శంభః = శుభము కలిగినట్టిది, శత్రువులను అణచునట్టిది
దంభోళిః = ఆటోపము(వైభవము)వలననే చంపునట్టిది, శత్రువులను దుఃఖపెట్టునది
అశనిః = ముల్లోకము దీనిచే భుజింపబడుచున్నవి
ఇవి పదిన్నీ వజ్రాయుధము పేర్లు

వ్యోమయానం విమానో ఽ స్త్రీ
వ్యోమయానం = దేవతలకు ఆకాశగమనాము దేనివలన కలుగుచున్నదో అది
విమానః =గమనములో పక్షితో సాదృశము గలది
ఇవి రెండున్నూ దేవ రధము పేర్లు

నారదాద్యా స్సురర్షయః
నారదా = కలహప్రియుడగుట చేసి నర సమూహమును భేదించువాడు, మనుష్యులకు ధర్మమును ఉపదేశించువాడు ఈయన, తుంబుర, భరతాదులు దేవర్షులు

స్యాత్సుధర్మా దేవసభాః
సుధర్మాః మంచి ధర్మము గలది,
దేవసభాః = ఇందు దేవతలు ప్రకాశింతురు కనుక దేవ సభ
ఇవి రెండున్ను దేవసభ పేర్లు

పేయూష మమృతం సుధా
పేయూషః = పానము జేయబడునది
అమృతం = దీనిని పానము చేయుట వలన మృతులు కారు
సుధాః = సుఖముగా పానము జేయబడునది

మందాకినీ వియద్గంగా స్వర్ణదీ సురదీర్ఘికా

మందాకినీ = మెల్లగా కుటిల గమనముచే బోవునది
వియద్గంగా = ఆకసమున నుండెడు గంగ
స్వర్ణదీ = స్వర్గమున నుండెడు నది
సుర దీర్ఘికా = సురల యొక్క నడబావి
ఇవి నాల్గున్నూ గంగ పేర్లు

మేరు స్సుమేరు ర్హేమాద్రీ రత్నసానుస్సురాలయః
మేరుః = అసురులను హింసించునది, శిఖరములచే నక్షత్రాదుల వహించునది
సుమేరుః = మేరు శబ్దమునకు అర్ధమే సుమేరునకు కూడా,
హేమాద్రీ = బంగారుశిఖరముగలది
రత్నసానుః = రత్నమయములైన చరులు గలది
సురాలయః = సుఉరాలకు స్థానమైనది
ఇవి ఐదున్నూమేరు పర్వతము పేర్లు

పం చైతే దేవతరవోమందారః పారిజాతకః
సంతానః కల్పవృక్షస్య పుంసి వా హరిం చందనం
మందారః = సంతోషము కలుగ జేయునది, స్తోత్రము చేయబడునది
పారిజాతకః = సముద్రమునందు పుట్టినది
సంతానః = లెస్సగా కోరికలు దీర్చునది
కల్పవృక్షః = వాంఛిత ఫలములనిచ్చు వృక్షము
హరిచందనం = ఇంద్రుని సంతోషింపజేయునట్టిది
ఈ ఐదున్నూ దేవ వృక్షముల పేర్లు

సనత్కుమారో వైదాత్రః (సనాతనుడు బ్రహ్మ)
సనత్కుమారః = బ్రహ్మ యొక్క కుమారుడు, ఎల్లపుడు కుమారావస్థ యందుండువాడు
వైదాత్రః = విధాత పుత్రుడు

స్వర్వైద్యౌః వశ్వనీ సుతౌః నాసత్యా వశ్వినౌ దస్రా
వాశ్వినేయౌ చ తా వుభౌః
స్వర్ వైద్యౌః =స్వర్గమునందుండువైద్యులు, సూర్యుని భార్యయును, అశ్వ రూపము దాల్చిన సంజ్ఞాదేవికి కుమారులు
నాసత్యౌః = అసత్యము లేనివారు,
అశ్వినౌః = ఆశ్వరూపమున ఉన్న సంజ్ఞా దేవికి పుట్టినవారు, అశ్వినీ నక్షత్రమున బుట్టిన వారు, అశ్వములు గలవారు
దస్రః = రోగములను క్షయింపజేయువారు
 ఆశ్వినేయౌః = అశ్విని దేవి కుమారులు వీరు కవలలు

స్త్రియాం బహుష్యప్సరస స్స్వర్వేశ్యా ఉర్వశీ ముఖాః
(ఊర్వశీ మేనకా రంభా ఘృతాచీ చ తిలోత్తమా)

అప్సరసః = నీటియందు పుట్టిన వారు, అందరినీ ధైర్యము చేత స్ఖలింప జేయువారు, పుణ్యము చేసినవారిచే పొంద బడెడు వారు
స్త్రియాం = స్త్రీ లింగమందు,
బహుషుః = బహు వచనమందే ఈ ప్రయోగ నియమము
స్వర్ వేశ్యాః = స్వర్గమందలి వేశ్యలు
ఉర్వశీ = మిక్కిలి ప్రకాశించునది, విష్ణువు తొడలయందు ఉన్నది, విష్ణుమూర్తి తొడలయందు పుట్టినది ఊర్వశీ, మేనక, రంభ, ఘృతాచి, తిలోత్తమ ఆది గలవారు అప్సరసలు.

హాహాహూహూశ్చైవ మాద్యా గంధర్వాస్త్రి దివౌకసం
హాహాహూహూ = గానము చేయునపుడు హా యనీ హూ యనీ శబ్దమును పలికెడు వాడు హాహాహూహూ మొదలగువారు దేవగంధర్వులు, (గంధర్వాః = గానము ధర్మముగా గలవారు)

అగ్నిర్వైశ్వానరో వహ్నిర్వీతి హోత్రో ధనంజయః
కృపీటయోనిర్జ్వలనో జాతవేదాస్తసూనపాత్
బర్హిశ్శుష్మా కృష్ణవర్త్మా శోచిష్కేశ ఉషద్బుదః
ఆశ్రయాశో బృహద్భానుః కృశనుః పావకో ఽ నలః
లోహితాశ్వో వాయుసఖి శ్శిఖావా నాశుశుక్షణిః
హిరణ్యరేతా హుతభుగ్దహనో హవ్యవాహనః
సప్తార్చిర్దమునా శ్శుక్ర శ్చిత్రభాను ర్విభావసుః
 శుచి రప్పిత్తమ్ –

అగ్నిః = ఊర్ధ్వముగానైననూ కుటిలముగా జ్వలించువాడు
వైశ్వానరః = విశ్వానరుడను ఋషికి కొడుకు
వహ్నిః = హవిస్సులను దేవతలకు చేర్చువాడు
వీతిహోత్రః = వీతియనగా అశనము, హోత్రమనగా హవిస్సు అనగా ఆ ఆశనమే హవిస్సుగా స్వీకరించువాడు, హవిస్సులను గుర్రమువలె మోసుకునిపోయి దేవతలుకు ఇచ్చువాడు, అశ్వమేధము నందు గుర్రములు హవిస్సుగా గలవాడు
ధనంజయః = ధనమును జయించువాడు
కృపీట యోనిః = కృపీటకమనగా ఉదకము, ఉదకమునకు కారణ స్థానమైనవాడు, ఉదకమునకు ఉత్పత్తి స్థానము జ్వలనః = జ్వలించువాడు
జాతవేదాః = ఇతని వలన వేదములు, పుట్టిన దేహములన్నిటిలోను గలవాడు, పుట్టిన శుభాశుభములను ఎరిగిన వాడు, ఈయన వలన హిరణ్యము పుట్టినది
తనూనపాత్ = శరీరమును నిలుపువాడు, ఇంధనము లేనిచో తనను తాను రక్షించుకొనలేని వాడు
బర్హిః = ఆజ్యాదులచేత వృద్ది పొందువాడు
శుష్మాః = ఉదకమును శోశింప జేయువాడు
బర్హిశ్శుష్మాః = దర్భలు బలముగా గలవాడు
కృష్ణ వర్త్మానః = నల్లని జాడగలవాడు
శోచిష్కేశః = శోచిస్సులనగా జ్వాలలు, అవి కేశములుగా గలవాడు
ఉషద్బుదః = ప్రభాతకాలమందు జ్వలించువాడు
ఆశ్రయాశోః = తనకు ఆశ్రయమిచ్చిన వాటిని భక్షించువాడు
బృహద్భానుః = అధికములైన కిరణములు గలవాడు
కృశానుః = తనను అంటినదానిని కృశింపజేయువాడు, తాను కృశించిననూ వృద్ది పొందువాడు
పావకః = పవిత్రము జేయు వాడు
అనలః = ఇతనిచేత లోకములు జీవించుచున్నవి, కాష్టాదులచేత చాలుననుట లేని వాడు
లోహితాశ్వః = ఎర్రని గుర్రములు గలవాడు
వాయు సఖః = వాయువుకు స్నేహితుడు, వాయువు సఖుడుగా గలవాడు
శిఖావాః = జ్వాలలు గలవాడు
శుశుక్షణిః = అంతటా శోషింపజేయ నిచ్చ గలవాడు, త్వరగా శోషింప జేయనిచ్చ గలవాడు
హిరణ్య రేతాః = హిరణ్యమే రేతస్సుగా గలవాడు
హుతభుక్కు = హుతమును భుజించువాడు
దహనః = దహించువాడు
హవ్యవాహనః = హవిస్సును వహించువాడు, హవ్య విషయమై ప్రయత్నించువాడు
సప్తార్చిః = జిహ్వ రూపములైన కాళి, కరాళి మొదలైన ఏడు జ్వాలలు గలవాడు ( వీరు కాళి, కరాళి, మనోజవా, ధూమ వర్ణా, స్ఫులింగినీ, విశ్వపద)
దమునాః = గ్లానిని పొందించు వాడు
శుక్రః = శోకింపజేయువాడు, తేజస్సు గలవాడు, శత్రువులకు దుఃఖమునిచ్చు వాడు, రుద్రుని రేతస్సు ఇతనియందు గలదు
చిత్రభానుః = అనేక కాంతులు గల జిహ్వరూపములైన కిరణములు గలవాడు
విభావసుః = కాంతి ధనముగా గలవాడు
శుచిః = దుఃఖింపజేయువాడు, శుచియైనవాడు
అప్పిత్తం = జలమును పిత్తము వాలే శోషింపజేయువాడు
ఇవి ముప్పై నాలుగున్నూ అగ్ని పేర్లు

ఔర్వస్తు బాడబో బడబానలః
 ఔర్వః = ఔర్వుడను మునికి కొడుకు, హింసించునది బాడబః = బడబ యనగా ఆడు గుఱ్ఱము, దాని ముఖమునందుండునది బాడబము మరియు బడబానలము ఈ మూడున్ను బడబానలము పేర్లు

వహ్నేర్ధ్వయో ర్జ్వాలకీలా వర్చిర్హేతి శ్శిఖాస్త్రియాం

 జ్వాలః = జ్వలించునది
 కీలః = పక్ష్యాదుల గతిని నిరోధించునది
అర్చిః = అర్చింప బడునది
హేతిః = అటు ఇటు చలించునది లేక వృద్ది పొందునది, హింసించునది
శిఖాః = వ్యాపించునది ఇచ్చట అర్చిర్హేతి శిఖా మూడున్ను స్త్రీలింగమని చెప్పియున్నాడు,

ఈ అయిదున్ను అగ్ని జ్వాలల పేర్లు

త్రిషు స్ఫులింగో ఽ గ్నికణః

స్ఫులింగః = చలించునది
అగ్ని కణః = అగ్ని యొక్క లేశము
ఇవి రెండున్ను మిణుగురుల పేర్లు

 సంతాప స్సంజ్వర స్సమౌః
 సంతాపః = మిక్కిలి తాపము కలిగించునది
సంజ్వరః = మిక్కిలి పీడించునది
ఈ రెండున్ను వేడిమి పేర్లు

 (ఉల్కాస్యా న్నిర్గత జ్వాలా భూతిర్భసిత భస్మనీ
క్షారో రక్షాచ దావస్తు దవో వనహుతాశానః)

ఉల్క అన్నది మంట లేని నిప్పు,
నిర్గతజ్వాల, భూతి, భసిత, భస్మ, క్షార, మరియు రక్షా అనునవి బూడిద పేర్లు,
దావ, దవ అనునవి కార్చిచ్చు పేర్లు

ధర్మరాజః పితృపతి స్స్మవర్తీ పరేతరాట్
కృతాంతో యమునా భ్రాతా శమనో యమరాడ్యమః
కాలో డణ్డధరః శ్రాద్ధదేవో వైవస్వతోంతకః

ధర్మరాజః = అపరాధమునకు తగినట్లు శిక్షించుట చేత ధర్మమునకు రాజు
పితృపతిః = పితృదేవతలైన కావ్యవాహనాదులకు పతి
సమవర్తీ = పక్షపాతము లేక అందరియందు సమముగా వర్తించు స్వభావము గలవాడు
పరేతరాట్ = పరేతులనగా మృతి చెందినవారు - వారికి ప్రభువు
కృతాన్తః = ఇతనిచే వినాశనము చేయబడును
యమునా భ్రాతా = యమునా నదికి తోడ బుట్టిన వాడు
శమనః = ప్రాణులను శమింపజేయు వాడు
యమరాట్ = ఇతనికి కింకరులైన మృత్యువు మొదలైనవారు ప్రజల నియమించు వారు, వారికి ప్రభువు
యమః = దండించు వాడు, యమునకు కవలగా పుట్టినవాడు
కాలః = ధర్మాధర్మములను, ఆయువునైనను లెక్కబెట్టు వాడు
దండధరః = కాలదండమనెడి దండమును ధరించినవాడు
శ్రాద్ధదేవః = పితృకర్మమునకు దేవుడు
వైవస్వతః = సూర్యుని కుమారుడు
అంతః = నాశము జేయువాడు
ఈ పదునాలుగున్నూ యముని పేర్లు

రాక్షసః కౌణపః క్రవ్యాత్ర్కవ్యవాదో ఽ సవా ఆశరః
రాత్రించరో రాత్రిచరః కర్బురో నికషాత్మజః
యాతుధానః పుణ్యజనో నైరృతొ యాతు రక్షసీ

రాక్షసః = రక్షస్సే రాక్షసుడు
కౌణపః =కుణపమనగా శవము, దానిని భక్షించువాడు,
దక్షిణ పశ్చిమ మూలను (కోణమును) రక్షించువాడు
క్రవ్యాత్ = క్రవ్యమనగా మాంసము, దానిని భక్షించువాడు కనుక క్రవ్యాత్తు,
క్రవ్యాదోసవః = రక్తమును పానము చేయువాడు, మాంసమును పచనము చేయక భక్షించు వాడు, నెత్తురు ద్రావువాడు, హింసించువాడు
అసురః = ప్రాణములను అపహరించువాడు
రాత్రించరో, రాత్రిచరః = రాత్రియందు చరించువాడు, భక్షించ్చువాడు కనుక రాత్రించరుడును, రాత్రిచరుడును
కర్బురః = చిత్రమైన వర్ణము గలవాడు
నికషాత్మజః = నికష అను రాక్షస స్త్రీ కుమారుడు
యాతుధానః = యాతువనెడు నామము ధరించిన వాడు
పుణ్యజనః = విరుద్ధ లక్షణముల చేత పుణ్యము గలవాడు
నైరృతః = నిరృతి అను దిక్పాలకుని కొడుకు
యాతు = వ్యధ పెట్టెడివాడు
రక్షసః = తన ప్రాణములను రక్షించుకొనువాడు, ఇతనిచేత విదిక్కు రక్షింప బడుచున్నది

ఇవి పదిహేనున్ను నిరృతి పేర్లు

ప్రచేతా వరుణః పాశీ యాదసాంపతి రప్సతిః

ప్రచేతాః = మంచి మనస్సు గలవాడు
వరుణః = జనులు ఇతనిని వరములడుగుదురు కనుక వరుణుడు
పాశీః = పాశము చేత శత్రువులను కట్టువాడు
యాదసాంపతిః = యదస్సులనగా జలజంతువులు, వాటికి పతి
అప్పతిః = అప్పు అనగా జలము, దానికి పతి.

ఈ అయిదున్నూ వరుణుడి పేర్లు

శ్వశనః స్పర్శనో వ్వాయు ర్మాత రిశ్వా సదాగతిః
వృషదశ్వో గంధవహో గంధవాహాని లాశుగాః
సమీర మారుత మరు జగత్ప్రాణ సమీరణాః
సభాస్వ ద్వాత పవన పవమాన ప్రభంజనాః
(ప్రకంపన శ్చాతిబలో ఝంఝావాత స్సవృష్టికః)

శ్వసనః = ఇతనిచేత ప్రాణులు బ్రతుకుచున్నవి
స్పర్శనోః = స్పృశించు వాడు
వాయుః = విసరెడువాడు
మాతరిశ్వాః = ఆకాశామునందు వృద్ది పొందువాడు
సదాగతిః = సర్వదా సంచరించు వాడు
వృషద్వశః =వృషత్ అను మృగము వాహనముగా గలవాడు, జల బిందువులు వాహనముగా గలవాడు
గంధవహో గంధ వాహో = గంధమును వహించువాడు,
అనిలః = ఇతనిచేత ప్రాణులు బ్రతుకుదురు,
ఆశుగః = శీఘ్రముగా పోయెడువాడు
సమీరః = లెస్సగా సంచరించువాడు
మరుత్ = యితడు కుపితుడైన లోకము మృతి చెందును
జగత్ప్రాణః = జగత్తుకు ప్రాణమైన వాడు
సమీరణః = లెస్సగా సంచరించు స్వభావముగలవాడు
నభస్వః = ఆకాశము ఉత్పత్తి స్థానముగా గలవాడు
వాతః = వీచుచుండెడివాడు
పవనః = పవిత్రము చేయువాడు కనుక పవనుడు,పవమానుడున్ను , సంచరించు వాడు
ప్రభంజనః = వృక్ష శాఖాదులను విరుగగొట్టు వాడు

ఈ ఇరవయ్యిన్నీ వాయువు పేర్లు

 ప్రాణో ఽ పాన స్సమాన శ్చోదాన వ్యానౌచ వాయవః
(హృది ప్రాణో గుదే ఽ పాన స్సమానో నాభిసంస్థితః
 ఉదానః కంఠ దేశశ్చో వ్యాన స్సర్వశరీరగః
 నాగశ్చ కూర్మః కృకరో దేవదత్తో ధనఞ్జయః
 వాగ్ద్వారే నాగ అఖ్యాతః కూర్మ ఉన్మీలనే
స్మృతః కృకరాచ్చ క్షుతం జ్ఞేయం దేవదత్తా ద్విజృంభణం
న జహాతి మృతం వాపి సర్వవ్యాపీ ధనంజయః )
శరీరస్తా ఇమే –
ప్రాణః = ప్రకర్షముగా శ్వాసాదులను బయటకు వెడలించునది
అపానః = వీని మూలముగా విణ్మూతరములు అధోముఖులై ప్రాణులు జీవించుచున్నవి
సమానః = దీని చేత లెస్సగా బ్రతుకుదురు, దేహమంతట నెత్తురు మొదలైన వాని బొందించునది
ఉదానః = మాటలాడుట మొదలైన సామర్ధ్యము కలుగజేయును కనుక ఊర్ధ్వ ప్రదేశంబున దీనిచేత బ్రతుకుదురు, శబ్దాదులను ఊర్ధ్వమునకు తెచ్చునట్టిది
వ్యానః = శరీరమంతటను వ్యాపించి యుండునది
ఇమేః = ఇవి యన్నియు
శరీరస్థాః = శరీరమునందుండెడి వాయువుల పేర్లు
ప్రాణము హృదయమునందుండి గర్భమున అన్నాదులయందు ప్రవేశింపజేయుచుండును, అపానము గుద స్థానముననుండి విణ్మూత్ర రేతస్సులను అధోముఖంబు నొందించును, సమానము నాభి ప్రదేశమునందుండి అన్నాదుల జీర్ణమునొందించును, ఉదానము కంథము నందుండి భాషణాదుల బుట్టించును, వ్యానము సర్వ శరీరమునందుండి స్వేదా సృజ్ని మేషాదుల బుట్టించును.

రంహ స్తరసీ తు రయః స్యదః జవః
రంహః = దీని చేత జనము గమన యుక్తమగును
తరః = దీనిచేత జనులు తరించుచున్నారు
రయః = దీని చేత జనము గమన యుక్తమగును
స్యదః = దీని చేత గమన యుక్తమగును
జవః = దీని చేత జనము పరుగిడును
ఇవి ఐదున్ను గమన వేగము పేర్లు

అథః శీఘ్రం త్వరితం లఘు క్షిప్రా మరంద్రుతమ్
సత్వరం చపలం తూర్ణ మవిలంబిత మాశు చ

శీఘ్రం = శయనమును హరించునది (శయనం జిఘ్రతి హరతీతి శీఘ్రం), దీనిచేత వ్యాపింతురు
త్వరితం = దీనిచేత సంభ్రమింతురు
లఘుః = దీనిచేత లంఘింతురు
క్షిప్రః = దీనిచేత ప్రేరేపింపబడుదురు
గతౌః = దీనిచేత నడతురు
సత్వరం = త్వరతో గూడినది
చపలం = దీనితో జనము చపలమౌను
తూర్ణం = దీనిచేత జనము త్వరితమగుదురు
అవిలంబితం = దీనిచేత విలంబము (ఆలస్యము) కాకుండును
ఆశుః = దీనిచేత వ్యాపింతురు
ఇవి పదియున్నూ తొందర యొక్క పేర్లు

సత తానార తాశ్రాన్తసన్త తావిర తానిశమ్
ని త్యానవర తాజస్రమపి

సతతం = దీని చేత విస్తరింపబడుచున్నది
అనాతరం = తెఱపి లేనిది
అశ్రాంతం = దీని యందు విశ్రాంతి లేదు, దీని యందు బడలిక లేదు
సంతతం = దీనిచేత విస్తరింపబడుచున్నది
విరతి = తెంపు లేనిది
అనిశం = రాత్రి, పవలు అని భేదము లేనిది
నిత్యం = నియతమైనది
అనవరతం = ఎడతెగుట లేనిది
అజస్రం = విచ్చేదనము లేనిది

ఈ తొమ్మిదిన్నీ ఎడతెగని యునికి పేర్లు

అథాతిశాయో భరః అతివేల భృశాత్య ర్థాతిమా
త్రోద్గాడ నిర్గమమ్ తీ వ్రైకాన్త నితాన్తాని గాడబాఢ ధృడానిచ
అతిశయః = అన్నియు దీనిచేత అతిశయించబడును
భరః = అన్నిటిని భరించునది
అతివేలం = మర్యాద నతిక్రమించినది
భృశం = భరించునట్టిది
అత్యర్థం = మితిమీరినది
అతిమాత్రం = అల్పమును మించునది
ఉద్గాఢం =ఉన్నతమై తోచునట్టిది
నిర్భరం = ఇందు సమస్తమైన భరము నిశ్శేషమై యుండును
తీవ్రం = అధికమై యుండునట్టిది
ఏకాంతం = ముఖ్యమైన నిశ్చయము గలది
నితాంతం = మిక్కిలి కాంక్షించునట్టిది
గాఢం = కలియబెట్టునది
గాఢం = యత్నము చేయబడునట్టిది
దృఢం = ప్రకాశించునట్టిది

ఇవి పదునాలుగున్ను అతిశయమైన క్రియకు పేర్లు (Superlatives)

క్లీబే శీఘ్రా ద్యసత్త్వే స్యాత్రిశ్వేషాం భేద్యగామి
(సత్వగామి) యత్

ఈ పైన ఇచ్చిన పేర్లలో శీఘ్రము మొదలుకొని దృఢము వరకు గల శబ్దములు క్రియా విశేషణములు, గుణ వాచకములు అయినప్పుడు నపుంసక లింగములు. ఈ శీఘ్రాది పదములలో ఏది విశేష్య లింగమును పొందునో అది మూడు లింగముల యందు వర్తించును
 ఉదా : శీఘ్రం భుఙ్తే =త్వరగా భుజించుచున్నాడు, సతతం గచ్చతి = ఎల్లపుడు నడచుచున్నాడు, క్షిప్రం కరోతి = త్వరగా చేయుచున్నాడు, అశ్వస్య శీఘ్రం = అశ్వము యొక్క వడి, తూలస్య లఘు = దూది యొక్క చులకన, శీఘ్రః అశ్వః = వడి గల గుఱ్ఱము, క్షిప్రా జరా = త్వరగా పైబడు ముదిమి, సతతం సుఖం = ఎడ లేని సుఖము మొదలగునవి.,

కుబేర స్త్ర్యంబక సఖో యక్షరాడ్గుహ్యకేశ్వరః
మనుష్య ధర్మా ధనదో రాజరాజో ధనాదిపః
కిన్నరేశో వైశ్రవణః పౌలస్త్యో నరవాహనః
యక్షైకపింఙ్గైలబిల శ్రీద పుణ్యజనేశ్వరాః

కుబేర = కుత్సితమైన శరీరము గలవాడు
త్ర్యంమ్బక సఖః = శివుని సఖుడు
యక్షరాట్ = యక్షులకు రాజై ప్రకాశించు వాడు
గుహ్యకేశ్వరః = గుహ్యకులు నిధులకు రక్షకులు వారికి ప్రభువు
మనుష్య ధర్మాః = మనుష్యుల ధర్మము వంటి ధర్మము గలవాడు
ధనదో = ధనమునిచ్చువాడు
రాజరాజః = యక్షులకు రాజు
ధనాదిపః = ధనమునకు అధిపతి
కిన్నరేశో = కిన్నరులకు ప్రభువు
వైశ్రవణః = విశేషముగా వినువాడు విశ్రవస్సు ఆయన కుమారుడు కనుక వైశ్రవణుడు
పౌలస్త్యః = పులస్త్యుని వంశము నందు పుట్టినవాడు
నరవాహనః = నరుడు వాహనముగా గలవాడు
యక్షః = పూజింప బడువాడు
ఏకపింగః = పార్వతీ దేవి శాపము వలన పచ్చనైన ఒక్కటే కన్ను గలవాడు
ఐలబిలః = ఇలబిల అనునామె కుమారుడు, ఇడబిట్టనెడి తమ్ముడు గలవాడు
శ్రీదః = సంపదలిచ్చువాడు
పుణ్యజనేశ్వరాః = యక్షులు, కిన్నరులు పుణ్య జనులనబడుదురు, వారికి ప్రభువు

ఈ పదిహేడున్ను కుబేరుని పేర్లు

ఆశ్యోద్యానం చైత్రరధం –
చైత్ర రధం = చిత్రరధుడను గంధర్వ రాజుచే నిర్మించ బడినది, కుబేరుని ఉద్యాన వనం

పుత్రస్తు నలకూబరః

నలుని యొక్క రధావయవముల వంటి రధావయవములు గలవాడు ఇది కుబేరుని కుమారుని పేరు 

కైలాసః స్థానం

కేళీ సమూహము కైలము దాని చేత నుండ బడునది, శిఖర భాగమందు పార్వతీ పరమేశ్వరుల నాట్యము గలది, జలభూములయందుండునది కేలాసము (స్ఫటికము) దానికి సంబంధించినది ఇది కుబేరుని దేశము 

అలకాః పూః

తానుండుచోటును అలంకరించునది అలకాపురి, అది కుబేరుని పట్టణము

విమానంతు పుష్పకం

పుష్పము వలె నుండునది పుష్పకము కుబేరుని విమానము 

స్యాత్కిం నరః కిమ్పురుషః స్తురంగ వదనో మయుః

కిన్నరః = ఇతని శరీరము కొంచెము నరాకారమున నుండును, కుత్సితమైన నరుడు
కింపురుషః = కొంచెము పురుషాకృతి గలవాడు
తురంగవదనః = గుఱ్ఱము ముఖము వంటి ముఖము గలవాడు
మయుః = కామ రూపి

ఇవి నాలుగున్ను కిన్నరుల పేర్లు

నిధి ర్నా శేవధిః

నిధిః = మిక్కిలి రక్షింపబడునది శేవధిః = శేవమనగా స్థాప్య ధనము దానియందుంచబడునది
ఈ రెండున్ను నిధి పేర్లు

భేదాః పద్మ శాఙ్ఖాదయో నిధేః
(మహా పద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కఛ్ఛపా
ముకున్ద కున్ద నీలాశ్చ వరశ్చ నిధాయో నవ)

ఇవి నిధి భేదముల నామములు
పద్మః = సేవింప బడునది
శంఖః = దుఃఖమును శమింప జేయునది
మహా పద్మః = గొప్పదైన పద్మము
మకరః = మకరము వలే గ్రహింప శక్యము గానిది
కూర్మః = కూర్మము వలే నుండునది
ముకున్దః, కుందః = ఒప్పుచూ నుండును కనుక ముకుందము, కుందము
నీలః = మిక్కిలి కొనియాడ బడునది
వరః = వరింప బడునట్టిది

ఇవి నవ నిధులు దీనితో స్వర్గ వర్గము పూర్తి అయినది.

తరువాత వ్యోమ వర్గము

Monday, February 12, 2018

మా కాంభోజ దేశం యాత్రా విశేషాలు

     మా కంబోడియా – ఆంగ్కోర్ వాట్ యాత్రా విశేషాలు
          


          గత ఏడాది నేను, నా శ్రీమతి వెంకటరమణ ఇద్దరమూ  మా అబ్బాయి విరించి, కోడలు అఖిల, మనుమరాలు శ్రీబృహతి తో గడపడానికి మలేసియా కౌలాలంపూర్ వెళ్ళాము. నేను ఎప్పుడైనా భారత్ బయటి దేశం వెళితే చూడవలసిన ప్రదేశం కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ అని ఎప్పుడో చెప్పి ఉండడం వలన మా విరించి అక్కడ నుంచి కంబోడియా వెళ్ళడానికి ఏర్పాట్లు చకచకా చేసేసాడు.

         మలేషియా కౌలాలంపూర్ నుంచి ఉదయం 7.30 కి ఎయిర్ ఏషియా విమానంలో బయల్దేరితే రెండు గంటల తరువాత ఆంగ్కోర్ వాట్ కు దగ్గరలోని సీయెమ్ రీప్ చేరుకుంటాము. కానీ అక్కడకు వెళ్ళాక గడియారం ఒక గంట వెనక్కు మార్చుకోవాలి. అక్కడ వాతావరణం ఎక్కువగా ఎండగా ఉంటుంది. విజయవాడ అక్షాంశంలొ ఉన్నది  ఈ ప్రదేశం.

        చాలా విశాలమైన రహదారులతో ప్రశాంత వాతావరణం తొ ఉంటుంది సీయెం రీప్ పట్టణం. అక్కడ కుడివైపున వాహనాలు నడపాలి (Right hand drive). ప్రజలు చాలా మర్యాద చూపుతారు. ఎక్కువగా విదేశీ యాత్రికులు వస్తారు కాబట్టి అక్కడి కరెన్సీ రియాల్ అయినా డాలర్లే ఎక్కువ శాతం మారక ద్రవ్యం గా చెలామణీ అవుతుంది        (1 డాలర్ = 4000 రియాల్స్). మనతో పోలిస్తే వస్తువుల ధరలు ఎక్కువగా అనిపించేది ఇందువలననే.


       ఇక్కడ రవాణా సాధనాలుగా సైకిళ్ళు, ఆటో రిక్షాలు, టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. కానీ ఇక్కడ ఆటో అంటే టాక్సీ అని అర్ధం. మన ఆటోరిక్షాల వంటివి మోటార్ సైకిళ్ళకి అనుసంధానం చేసి నలుగురు వెనకాల కూర్చోగలిగిన వాహనం ఉంటుంది. దీనిని టుక్ టుక్ అంటారు. అద్దె మోటార్ సైకిళ్ళమీద కూడా ఎక్కించుకుని వెళ్ళే సదుపాయం ఉంది. చివరకు సైకిళ్ళు కూడా అద్దెకు తీసుకోవచ్చు. కాకపొతే ఇంగ్లీషు తెలిసిన డ్రైవర్లు తక్కువగా కనిపిస్తారు. ఎక్కువ మంది ఉంటే టూరిజం డిపార్ట్ మెంట్  వారి దగ్గర బస్సు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రోజుకి, మూడు రోజులకి, వారం రోజులకి చొప్పున టిక్కట్లు ఇస్తారు. మనం వెళ్ళిన ప్రతి చోట టికట్లు తనిఖీ చేస్తారు. విహంగ వీక్షణం చెయ్యదల్చుకునే వారికి హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది. ప్యాకేజ్ టూర్లు ఉన్నాయి.

      సియెమ్ రీప్ అంతర్జాతీయ విమానాశ్రయం పెద్దది కాక పోయినా దాదాపుగా 35 విమానయాన కంపెనీలు ఇక్కడకు విమానాలు నడుపుతున్నాయి. ఇక్కడకు చేరుకున్న తరువాత ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీలు ఒక 20 నిముషాలు పడుతుంది. టూరిస్టు వీసా అక్కడే తీసుకోవచ్చు (Visa on arrival). 30 రోజుల వీసాకు 30 డాలర్లు వసూలు చేస్తారు. విమానాశ్రయం బయట టాక్సీలకు ఒక ఆఫీసు ఉంటుంది. మోటార్ టాక్సీలు(ఆటోలు), ఆటోరిక్షాలు (టుక్ టుక్ లు), అద్దె మోటార్ సైకిళ్ళు (మోటోడుప్ లు), అద్దె సైకిళ్ళు కూడా దొరుకుతాయి. ప్రస్తుతం విమానాశ్రయం ఊరుకి దగ్గర. కొత్త  విమానాశ్రయం 65 కిలోమీటర్ల దూరములో కడుతున్నారు. 

      హోటళ్ళు అన్ని రకాలు ఉంటాయి 5 నక్షత్రాల నుంచి బడ్జట్ హోటళ్ళ వరకు. మనకు కావాల్సినది ఎంచుకోవచ్చు. బహుళ అంతస్తు భవనాలు కనిపించవు. పెద్ద భవనాలు 5 అంతస్తుల లోపే ఉంటాయి. అధిక భాగం హోటళ్ళకు మాంసాహారం, మద్యం, మసాజ్ పార్లర్(స్పా లు), స్విమ్మింగ్ పూల్, వై ఫి సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ అందరూ చాలా మర్యాదస్తులు. అతిధులను చేతులు జోడించి ఆహ్వానిస్తారు. ఇవేకాక కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, కుటుంబాలు నిర్వహించే హాస్టళ్ళలో చౌకగా వసతి లభిస్తుంది. విడిగా భారతీయ వంటకాలకు, భోజనాలకు కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. 

      అంగ్కోర్ వాట్ లో విశేషాలు చూడడానికి బయల్దేరినప్పుడు గొడుగు తప్పక తీసుకుని వెళ్ళాలి. వాన నుంచి, ఎండ నుంచి కూడా రక్షణ. అక్కడ సందర్శకులకు కచ్చితమైన వస్త్రధారణ నిబంధనలు ఉన్నాయి. కురచ దుస్తులు అసలు అనుమతించరు. మన దేశంలో గుళ్ళలో నిబంధనలను  విమర్శించేవారు ఎక్కువ !
అంగ్కోర్ వాట్ Angkor Wat  ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది ఒక దేవాలయం. 12వ శతాబ్దంలో సూర్యవర్మ II దీనిని నిర్మించారు. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలి లో నిర్మింపబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం. ఖ్మేర్ భాషలో ఆంగ్కోర్ వాట్ అంటే గోపురాల పట్టణము అని అర్ధం (City of pyramids). మనము “శంకు వాటి“ అనుకోవచ్చు.

      ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం సీమ్‌ రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళానైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌కోర్‌ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణంభారతదేశం లోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందినచోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఆంకోర్ వాట్  టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముఖ్య దేవాలయం మొత్తం చుట్టూ ఉన్న కందకము, బయటి ప్రాకారముతో కలుపుకుని 1.5 కిలోమీటర్లు X 1.3 కిలోమీటర్లు ఉంటుంది. దేవాలయం మొత్తం ఒక చదరపు కిలోమీటరు వైశాల్యంలో కట్టారు. ముఖ్య ఆలయం 65 అడుగుల ఎత్తు ఉంటుంది. ముఖద్వారం నుంచి చూస్తే మూడు గోపురాలు ఉన్నట్లు కనిపించినా మూడు అంతస్తులతో, మొత్తం ఐదు గోపురాలతో అలరారుతూ ఉంటుంది. 
     భారతదేశం లో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తురీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్‌ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందినది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి. 14 వ శతాబ్దంలో బౌద్ధమతం పరిఢవిల్లినపుడు విష్ణు శిల్పాలను బుద్ధ శిల్పాలుగా మార్చారు. మొత్తం నాలుగు బుద్ధ విగ్రహాలు కంటికి ఇంపుగా దర్శనమిస్తాయి. వీటిని అన్నిటినీ దర్శించుకుంటే అదృష్టమని ఇక్కడి వారి నమ్మకం. కానీ ఈ విగ్రహాలు చూస్తే విష్ణుమూర్తి విగ్రహాలని మనకి తెలిసిపోతుంది. చతుర్భుజాలతో ఉన్న విగ్రహము, ఐదు తలల పాము పడగల క్రింద ఉన్న విగ్రహము, శయనించిన విగ్రహము ఇవి విష్ణువువని చెప్పకనే చెపుతాయి.
      ముఖ్య ఆలయం తూర్పువైపున గర్భ గుడి లోకి వెళ్ళడానికి చెక్క మెట్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే వారు కట్టిన మెట్లు మోకాళ్ళ కన్నా ఎత్తు ఉంటాయి. గర్భగుడిలోనుంచి చూస్తే చుట్టూ మొత్తం గుడి ప్రాంగణము, ప్రాకారము, కందకము మొత్తం కనిపిస్తాయి. అంత ఎత్తుగా ఉంటుంది గర్భగుడి.

      ఖ్మేర్‌ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించేదట. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయంలో కూడా వాడారు. ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయిందనే విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్లు (వీటిని అక్కడ 'బారే'లు అంటారు) నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించేవారట. ఫ్రెంచ్‌ ఆర్కియాలజిస్ట్‌ ఫిలిప్‌ గ్లోసియర్‌ ఈ రిజర్వాయర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధృవపరిచాడు. నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్‌ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులుకాలువలుడ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయట.
      ఆలయం చుట్టూ ప్రాకారం చాలా పెద్దది. నలుచదరంగా ఉంటుంది. ఆ చదరానికి నాలుగు మూలలలో కూడా నాలుగు పెద్ద గోపురాలు అద్భుతంగా ఉంటాయి.
      ముఖద్వారం నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని పచ్చికతో అక్కడి వాతావరణమంతా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముఖద్వారం నుండే మూడు పెద్ద పెద్ద గోపురాలు దర్శనమిస్తాయి. ఇందులో మధ్య గోపురం నుండి లోపలికి వెళ్తే అనేక గోపురాలు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యోదయం. ఉషోదయ వేళ ఆలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. పొద్దున లేచి గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే చాలు... ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. ఎండ వేడెక్కి చుర్రుమనిపించేవరకు అలాగే ఉండిపోతారు కూడా.
      ఈ దేవాలయంలో మరో అద్భుతమైన ప్రదేశం బ్యాస్‌ - రిలీఫ్స్‌ గ్యాలరీ. నాలుగు గోడలతో నిర్మించిన ఈ మండపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణగాథలే కనిపిస్తాయి. ముఖ్యంగా తూర్పున ఉన్న 'మంధన్‌' అనే గ్యాలరీ అందర్నీ ఆకట్టుకుంటుంది. భారత పురాణాలైన రామాయణమహా భారతదృశ్యాలు అనేకం ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాయి. దేవతలూరాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. తూర్పు వైపు మండపంలో విష్ణుమూర్తి పుట్టుకఅవతారాల కు సంబంధించిన శిల్పాలు ఉంటే పశ్చిమం వైపు మండపం గోడలపై యుద్ధాలు, మరణాలకు సంబంధించిన ఆకృతులు కనిపిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం, రామ రావణ యుద్ధ సంఘటనలు ఎంతో చక్కగా మలచబడ్డాయి. ఇక దక్షిణ మండపంలో ఆలయాన్ని నిర్మించిన రాజు రెండవ సూర్యవర్మన్‌ రాజ్యానికి సంబంధించిన సైనిక పటాల దృశ్యాలు దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెర కింపురుషాధి అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభ వంటి అనేక కళాఖండాలు ఆంగ్‌కోర్‌ వాట్‌ ఆలయ గోడలపై సాక్షాత్కరిస్తాయి.
      పూర్వకాలంలో కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, టోనెల్‌ సాప్‌ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న 'నాగ' అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఖ్మేర్‌ సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్‌ సామ్రాజ్యాధినేత అయిన 'కాము'తో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్‌ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం ఒకటి.
      ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అద్భుత ప్రదేశం ఆంగ్‌కోర్‌ థోమ్‌. ఖ్మేర్‌ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తుల్లో ఒకరైన 'జయవర్మ - 6 ఆంగ్‌కోర్‌ థోమ్‌ను రాజధానిగా చేసుకుని రాజ్యాధికారం చేపట్టాడనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. దీనినే 'మహా నగరం' అని కూడా అంటారు. తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏనుగుల మిద్దెలు, లెపర్‌ రాజు ప్రతిమలు, బెయాన్‌, బఫూన్‌ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత. ఆంగ్‌కోర్‌ థోమ్‌ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డెన్‌ టవర్‌ (బెయాన్‌) ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మించిన బెయాన్‌ (బుద్ధుని) దేవాలయం ఆంగ్‌కోర్‌ థోమ్‌కి ఆకర్షణీయంగా నిలుస్తుంది ప్రాసాత్ త ప్రోమ్ / తా ప్రొమ్

     అంకోర్ వాట్ లోని అత్యంత ఆకర్షణీయమైన సముదాయం ఈ పురాతన ఆలయ సముదాయం. అంకోర్ థోమ్ కు తూర్పున ఒక కిలోమీటర్ దూరం లో ఉన్న ఈ కట్టడం జయవర్మ VII క్రీ.శ. 12వ శతాబ్దం చివర, 13వ శతాబ్దం పూర్వ భాగంలో కట్టించాడని చరిత్రకారుల నమ్మకం. బేయాన్ లాగే  దీనిని కూడా మహాయాన పద్ధతిలో నిర్మించారు. మొదట్లో దీని పేరు రాజ విహార(రాజు గారి ఆరామం). జయవర్మ కుటుంబ సభ్యలకు నివాసంగా దీనిని కట్టినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిని తా ప్రోమ్(పురాతన బ్రహ్మ) అంటున్నారు. యునెస్కో వారు వారసత్వ సంపదగా గుర్తించిన తరువాత పెద్దగా మార్పులు లేకుండానే పరిరక్షిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద బూరుగుదూది చెట్లు, మర్రి చెట్లు దేవాలయం మీద, ప్రాకారాల మీద వేళ్ళతో, ఊడలతో దట్టంగా పెరగడం వలన అదొక రకమైన ఆకర్షణగా నిలిచింది  ఈ కట్టడం. భారతీయ పురాతత్వ శాఖ, కాంబోడియా ప్రభుత్వపు APSARA (Authority for the Protection and Management of Angkor and the Region of Siem Reap) తో ఈ కట్టడం పరిరక్షణ బాధ్యత చేపట్టింది.             మిగిలిన ఆలయాలలా కాకుండా ఈ కట్టడం తూర్పు ముఖంగా ఉండి బల్లపరుపు కట్టడంగా ఉంటుంది. ఈ సముదాయంలో దాదాపు 8,00,000 మంది నివసించేవారని అప్పటి చారిత్రిక ప్రతుల వలన తెలుస్తోంది. ఇందులో 18 మంది రాజ గురువులు,  615 మంది నర్తకీమణులు ఉండేవారట. వీరికి సేవల కోసం సేవకులు, మిగిలిన ప్రజలు దాదాపు 8 లక్షల మంది చుట్టు ప్రక్కల గ్రామాలలో ఉండే వారట.
     ఆంజెలీనా జోలీ నటించిన హాలీవుడ్ సినిమా “లారా క్రోఫ్ట్ అండ్ ది టూంబ్ రైడర్స్” సినిమా ఇక్కడే చిత్రీకరించారు.      Banteay Srei or Banteay Srey (బాన్తే శ్రీ) : 
     ఆంగ్కోర్ వాట్ లోని దేవాలయాలలో ఇదొక్కటే రాజుల చేత కాకుండా ఇతరులచేత నిర్మించబడినది. ఇది పదవ శతాబ్దంలో ఒకటవ హర్ష వర్మ మనుమడు, రెండవ రాజేంద్ర వర్మకు సచివుడు అయిన యఙ్ఞ వరాహ నిర్మించిన శివాలయం. త్రిభువనేశ్వర ఆలయం గా పేరొందిన ఈ దేవాలయం ఉన్న ఊరు పేరు ఈశ్వరపుర. ఇది శివాలయమైనా ఉత్తరాన ఉన్న గుడులు విష్ణు మూర్తివి. ఈ ఆలయం ఆధునిక నామం బాన్తే శ్రీ అంటే సౌందర్య సౌధం లేక సౌందర్య సుదతి (citadelof beauty or citadel of woman). కుడ్యాలమీద ఉన్న శిల్ప సంపద చూస్తే ఆ పేరెందుకు వచ్చిందో తేలికగా అర్ధమవుతుంది. ఇక్కడ ఉపయోగించిన రాయి ఎర్ర ఇసుకరాయి (red sandstone) అందుకనే చాలా నైపుణ్యంతో శిల్పాలని చెక్కడం సాధ్యమైంది.
      ఈ ఆలయం లోని సొగసైన దేవతా మూర్తులు అనేక మార్లు జరిగిన చోరీలలో చేతులు మారాయి. వాటిని పరిరక్షించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొన్నిసార్లు విఫలమైనాయి. నాంఫెన్ లోప్రభుత్వ మ్యూజియంలొ భద్రపరచిన శివ, ఉమాదేవి మూర్తులు కూడా చోరీకి గురి అయ్యాయి.
       ఈ దేవాలయాల మీద శిల్పాలు లేని గోపురాలు కానీ, గోడలు కానీ లేవంటే అతిశయోక్తి కాదు.  కాల పురుషుడు, వాలి సుగ్రీవుల యుద్ధము, తిలోత్తమ కొరకు సుందోపసుందుల పోరాటము, ఖాండవ దహనము, నటరాజు తాండవము, రావణుని కైలాస పర్వత ఉద్ధరణ, ఆపై శివుని చే గర్వభంగము మొదలైనవి అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి.        ప్రా ఖాన్ (Preah Khan)         1191 లో ఏడవ జయవర్మ శత్రువులైన ఛామ్ వంశస్తుల మీద విజయం సాధించిన సందర్భంగా కట్టించిన అద్భుతమైన కట్టడం.. Preah Khan అంటే రాచ ఖడ్గం లేక పవిత్ర ఖడ్గం అని అర్ధం. ఈ ఆలయాన్ని కనుగొన్న తరువాత మరమ్మతులు జరిగినా, అంతకు ముందు అతి వేగంగా విస్తరించిన అరణ్య సంపదను అలాగే విడిచిపెట్టడం వలన ఆలయ సౌందర్యం ఎంతో కమనీయంగా ఉంటుంది.ఇక్కడి ముఖ్య దేవత బోధిసత్వ అవలోకితేశ్వరుడు, ఈయనకు జయవర్మ తండ్రి రూపంలో ఈ ఆలయంలో శిల్ప రూపం ఇచ్చారు. ఈ ఆలయ సముదాయం దేవాలయం, బౌద్ధ విశ్వవిద్యాలయం మరియు నగరం మూడిటి సంగమంగా ఉండేదిట.
      ఈ సముదాయం చుట్టూరా కందకము, ఆ లోపల ప్రాకారము ఉన్నాయి. ప్రాకార కుడ్యము మీద 50 మీటర్లకొక నాగులను చేత పట్టిన గరుడుల విగ్రహాలను మొత్తం 72 శిల్పాలను చెక్కారు మొత్తం  700 X 800 మీటర్ల కందకం లోపల ఈ సముదాయం 140 ఎకరాల మేర విస్తరించి ఉంది. ఈ సముదాయానికి నలువైపులా నాలుగు సింహద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల గుండా వెళ్ళదానికి కందకం మీద ఉండే దారికి ఇరువైపులా క్షీరసాగర మధనాన్ని తలపించే రకంగా దేవతలు, అసురులు సర్పాన్ని పట్టుకున్నట్లు చెక్కారు.లోపలి గర్భ గుడికి మూడు గోపురాలు ఉన్నాయి. తూర్పు వైపున నృత్యమండపం ఉన్నది. పడమటి వైపున చదరంగము, లంకా యుద్ధము చెక్కారు. దీని స్తంభాలు పురాతన భారతీయ ఆలయ స్తంభాలను పోలి ఉన్నాయి. ఆంగ్కోర్ లో మరెక్కడా ఇటువంటి స్తంభాలు లేవు. ఈ కట్టడం ధాన్యాగారం అని పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం. గుడికి నలువైపులా కొద్దిగా చిన్నవైన గుడులు ఉన్నాయి. గర్భ గుడిని బుద్ధుడికి అంకితం చేసినట్లు కనబడినా చుట్టూ ఉన్నా ఆలయాలు శివుడి గురించి కట్టినట్లు సులభంగా తెలిసిపోతుంది. ఈ కట్టడాలన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షాలతో ఆక్రమించబడి ఉన్నాయి. మిగిలిన కట్టడాల మాదిరే దీనిమీద శిల్ప సంపద కూడా కనులకింపుగా ఉంటుంది.
     మొత్తం మీద మూడు రోజులు ఉండి చాలా వరకూ చూశాము. మేము చూసినది తక్కువ, చూడాల్సింది ఇంకా చాలా ఉందని తెలుసు. కానీ సమయాభావం వలన మనసు భారంగా అవగా మలేసియాకి తిరుగు ప్రయాణమయ్యాం.  డాక్టర్ బి. మల్లికార్జున రావు  విజయవాడ  x

Thursday, January 18, 2018

కంద యాగము

కం.
కళకళమనుచు శివుడును
భళి భళి శంభోయనగను భక్తితొ మనమున్
కలకలమేమియు లేకను
పెళపెళ యర్భటముగూడి పెండ్లియె చేయున్ ... 1

కం.
కరివరదుడ నను బ్రోవవె
మరియాదలు సేతునింక మనసున యుంచీ
సరిగమ గమకములను విని
వరియించిన లచ్చి తోడ వరమీయ గదే. ... 2

కం.
కరుణయె రాదయ వీరికి ?
చరితమున జరుగు విలయము చదువుల వలనన్
దురితములు విజయములనుచు
మరిమరి వదరుచు చనెదరు మత్తగజములే... ... 3

కం.
కరివసనుడ యభయము నిడి
మరి మరి బ్రోవగను రావె మదనాంతకుడా
సరియా నీకిది తగునా
వరియించిన గిరిజకు మరి వగపేల ప్రభో... 4

కం.
ఇలవరమున నివసించెడి
జలజాక్షికి మరి యపుడును జవదాటకనే
కలవరమొందని తీరున
వలపుల తలపుల పిలుపుల వరుడే తోచెన్... 5

కం.
దివిజనులు వేచి చూడగ
పవిసుతుడును బయలువెడలె పగవాని కడన్
రవిసుతుని పనుపునననియు
కవి వాల్మీకి దెలిపెగద కమనీయముగా ... 6

కం.
కోశములైదును జనగను
పాశము వీడగ భయపడి పాడెకు వెరచీ
ఆశపడుదురు జనులు మరి
లేశపు కామనము తోడ లేశ్వాసలకున్... 7

రామలింగడు పరుగో పరుగు !!
కం.
నిసియని పద్యము వ్రాసిన
మసిచేయ గలుగు పదముల మరువనులేకన్
వసివాడని పెద్దన కవి
నుసి చేయగ చూచెనింక నుదుటిని ముడిచీ... 8

కం.
నిసి సమయమునను నెంతయు
మసిబారిన మోముతోడ మలినాశృవులన్
నుసిచేసెడు కోపముతో
వసివాడని కొమరుని గొని వచ్చెనుయామే... 9

కం.
ఆహా సినిమాయేమని
ఓహోయని జనులు చూడ యోపిక తోడన్
సాహో బాహుబలియనియు
నోహో యని పొగిడిరి మరి నోరారంగన్... 10

కం.
ఆహా మీసరి లేరని
సాహో మరి మాకు తమరు సాక్షాత్ దేవా
ఓహో యనెదరు కొందరు
ఈహీ యని వెక్కిరింతు రీవిధముననున్... 11

కం.
కళవరు రాణియు రాగను
భళయనకను సడి లేకయు భక్తితొ యపుడున్
పెళపెళలాడే మోమున
గళమును సవరించెనతడు గరువము తోడన్... 12

కం.
కళతప్పిన మోమున మరి
పెళపెళలాడెడి అతివతొ పెగలని గొంతున్
వలవలమని యేడువగను
భళి వేసములిక సరియనె భామిని నరుసే... 13

కం.
సాక్షి గణపతిని వేడద
వీక్షణలు సలుపుము మరియు విడబోకు  మదిన్
మోక్షము నిడుట తమ యితవు
యే క్షిప్ర గణేశ నీ దయే చాలు మరిన్... 14

కం.
దీక్షాబద్ధుడనై పద
వీక్షణమెంతయు సలిపితి విహగము బోలన్
మోక్షము గలుగదె నాకును
సాక్షాత్ మరియొక హననము సాగదె నేడున్... 15

కం.
వీక్షణ సేయగ మనకును
సాక్షులుగా తోచునిచట సారములైదున్
ప్రేక్షకులివె భువి నీరును
మోక్షమునిడు గాలియగ్ని మొగిలిన్ దారే... 16

కం.
ఏకం సత్ విప్రా యన
లోకం మెచ్చునుగ మరియు లోపల శంకల్
నాకం గలదా లేదా
శోకం కారణమిదియని శోధన లేదే... 17

వైద్యులు (చాలామంది) కోరేది ఇదే :

కం.
ఏకము యొకటే వెజ్జకు
లోకము యంతను తపనల లోవ వెలువడన్
నాకము యనవసరము గద
శోకములేమి కనపడని శోభిలు మనికిన్... 18

లోవ = లోయ
మనికి = జీవితము

కం.
కందము యందమె నాకం
దందున తేలినటులను గద మదిని లోకం
బందున గలిగిన శోకం
కందువగను దీరునటుల గమకము లేకం... 19

కం.
సుఖమేగద జీవనమును
ముఖపుస్తకమున్న చాలు ముదమే మాకున్
నఖముల గొరకను పనియే ?
మఖము దినముదినము జరుగ మదియును నిండున్ !... 20

కం.
ముఖమున తేటయు యింకను
సుఖమున తోచెడు నగవును సులభమె మాకున్
నఖముల వర్ణము చూడగ
ముఖమాశ్రయమగు పలుకులె ముదముగ యెపుడున్.. 21

కం.
నగవులె యందము మోమున
సిగకును మరియందమిచ్చు సిరిమల్లియలే
పగటికి రవి వెలుగు నిడును
తొగదొర జేయునుగ నిశిని తొలిరాతిరిగా.. 22

కం.
సిగరెట్టు ను వద్దని మరి
సగమును పావును కలుపక సరియగు పెగ్గున్
వగలాడుల పొందులు యిల
పగవారౌ స్వస్థతకని పలికుము మల్లీ.. 23

కం.
మేఘసముడు పింగాక్షుడు
మాఘము నందే కనబడె మాయలు సేయన్
లాఘవమున లంక జనిన
రాఘవు బంటగు హనుమయె రాగదె యిటకున్.. 24

కం.
కం.
మేఘములు కురిసి తడువగ
మాఘమున రుజమున బడిన మాతకు నిండా
రా ఘన యౌషధములనిడి
లాఘవమున తేర్చువారలామెకు పుత్రుల్.. 25

కం.
ఉచ్చము నీచము లేకను
అచ్చమగు మృగమును బోల యమదూత వలెన్
ఇచ్చట తిరిగెడి మనుజుడు
చచ్చిన మాత్రము జగమున  జడమా చూడన్.. 25

కం.
నిజముగ చూడగ ఖలులు
ప్రజలను యేమార్చుదురుగ ప్రభుతలొ యుండీ
సుజలములిమ్మని యడుగగ
గజమును మిధ్య, పరుగున్ను గతమే యనుగా.. 26

కం.
నిజముగ వెతలను తీయగ
రుజముల బాపెడు మనిసియు రుసియే చూడన్
ప్రజలను బందుగులనుకొని
గజిబిజి పడకను భిషజుడు గమనించు గదా.. 27
రుసి = ఋషి
భిషజుడు = వైద్యుడు

కం.
ప్రజలంత యెదురు చూడగ
నిజముగ కవులును గడిపిరి నిట్టూరుపుతో
గజముల మేరను పుటలును
గజిబిజి గిలికిరి మరియును గమనించగదే.. 28

కం.
ఆటగద దినము దినమూ
ఈటెలు కావవి పదముల యేర్పేటు గదా
ఊటగ మాటల తేటలు
ఘాటన్నది లేనివి మరి గమనింపంగన్.. 29

కం
మాటలు పలుకని రోగికి
ఈటెలు పొడవగ దినములు యీదగ బాధన్
ఊటగ యుబికెడు కన్నులు
చేటును తెచ్చును నిజముగ చెప్పగనేలా.. 30

కం.
ఆటో లో పయనంబున
ఈటెను బోలెడి ములుకులు భీకరముననూ
పోటెత్తునటుల గుచ్చెను
ఈ టెటనస్ సూది యటులె పీడించెనుగా.. 31

కం.
ఆ టామనెడి శునకమును
ఈ టేపుతొ కొలువ లేక యీసురు మంటిన్
ఊటీ పోవలెననుకొని
కాటికి పోయిన యటులను కామ్ గా నుంటిన్ .. 32

కం.
వంఠగ పంతమున వరుడ
కుంఠిత యర్చన సలుపగ కుంపెల ధారిన్
శుంఠయె యాతడు యప్పుడు
కంఠము నిండుగ పలుకెను కాళీ స్తవమున్ .. 33

కం.
శుంఠలు రాజ్యమునేల య
కుంఠిత దీక్షను తపమునకును కూర్చుండన్
వంఠ లగు విద్దెల కొరకు
కంఠము యురితాడు జుట్ట కనరే వెజ్జల్.. 34

వంఠ = సేవకుడు

కం.
శుంఠలు యెదురుపడగ యవ
గుంఠనమును సరియొనర్చకుండరె యతివల్
వంఠలు వంఠల యెదుటను
కంఠము సవరింపరు మరి కలభాషిణులే.. 35
వంఠ = సేవకుడు
వంఠ = బ్రహ్మచారి

కం.
కడుపార నగవులను మరి
పడిపడి దొరలుచు కలకల పదముల నొప్పన్
నిడుపగు మాటల చేతను
బుడుగే తనచేష్టలనిక పురమున జూపెన్.. 36

కం.
బుడిబుడి నడకల వయసున
బడిలో నేరిచితి సంధి భాషను తెలియన్
కడునడునిడుకురుపదముల
రడలకు యచ్చు ద్విగుణటకరంబుగ చెల్లున్.. 37

కం.
నిడుపగు మాటల చేతను
కడు కఠినపు చేష్టల మరి కదనము కోరన్
చడి చప్పుడు లేకుండగ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
పడియుండుట సాధ్యమగున పలుకక యుండన్.. 38

కం.
గాఢముగ నమ్ము వైద్యము
మూఢులకెటులను తెలియును మూసయె కాదే
రూఢము కాని విధములతొ
దాఢము చేసినను గాని దారికి రాదే.. 39

కం.
మూఢుని వలె సరసున దిగి
గాఢక్రీడల మకరిని గని యని సల్పన్
దాఢమున హరిని గరుడా
రూఢుడుగను తరలెను నిజ రూపుడుగ యటన్.. 40

కం.
మణిమయ లోకము యందున
అణిమ గరిమ సిద్ధులకును యధిపతి వెలసెన్
గణములు యున్నవి పెక్కులు
తృణము మొదలు దిశలయందు దృష్టిని నిలుపున్.. 41

కం.
కణకణమను మంటలు మరి
ఝణఝణ చూరుకు తగలగ జగములు కూలన్
వణుకుతు ఫోనున వచ్చెను
గణగణ సెగనార్పు బండి గంటల తోడన్.. 42

కం.
ఋణమున్నది పితరులకును
ఋణమున్నది  చూడగ మరి  ఋషులకు కూడన్
ఋణముండు దేవతలకును
ఋణమును తీరగ సలుపుము ఋజుమార్గమునన్.. 43

కం.
కణముల పెరుగును కాయము
గుణములను పెరుగు కుశలత గురుతెరుగగనూ
ఋణముల పెరుగవె జన్మలు
పణముగ పెట్టకు నెపుడును పరువును నీవున్.. 44

కం.
నేతలు తినగను ధనమును
రోతయె కలుగును నసున రోదన చేయన్
మేతల బతుకును మెకములు
వాతలు పెట్టిన తెలియున వారల కెపుడున్.. 45

కం.
జోతలు చేసెద నేడును
మోతల బరువని విడచిన మోదకములకున్
చేతులు రెంటిలొ గలవుగ
కోతుల బొమ్మలు మరియును కోపము మదిలో.. 46

కం.
తాడిని యెక్కెడి వాడిని
తాడించెడి వాడు గలడు తలనే తన్నన్
గోడల ఖరాబు చేయగ
వేడిననెంతయు వినకున వేసట కలుగున్.. 47

కం.
నేతల రోతల చేతలు
మోతెక్కును జనతకు యిక మోమెరుపెక్కున్
మేతలు తెలియదు యనుకొన
జోతలు చేయరె జనములు చోచో యనుచున్.. 48

కం.
కోతలు తప్పవు వెజ్జకు
రీతులనేకము చికిత్స రిక్తత లేదే
ధాతగ కొలుతురనేకులు
జోతలు చేతురు ముదమున జోగియె యతడున్.. 49

కం.
కోతులు సాయము శాయగ
ఊతముగ జలధిని దాటి పురమును గొట్టీ
ప్రీతిని జానకి బట్టెను
రాతిని నాతిగ మలచిన రాముడు యితడే.. 50

కం.
తాతలు నేతులు తాగిరి
మూతుల వాసన యిదియని మూర్ఖులు యనగా
కోతలు మానిన గానీ
చేతలు నమ్మము యనియును చెప్పిరి జనులే.. 51

కం.
నూతిలొ పీతలు కలవని
కోతలు కోయగ యతడును కోమలి తోడన్
వాతలు పెట్టెద నీకని
నాతియు పలికెను పొగరుగ నాటకమనుచున్.. 52

కం.
మథనము చేయగ మనమున
పథమే కనుగొన గలముగ పదములు బట్టన్
రథమున రాగల దేవుడు
కథనముల కనుగొనెదముగ కలవరమేలా.. 53

కం.
కథ విని పలికెదరందరు
మథనము చేయగ కడలిని మగువను బోలన్
పథికుని భంగిని సురనూ
తథాస్తనుచును యొసగ భవిత విడిరి యసురుల్.. 54

కం.
మదిలో దాగిన నిజమును
నదిలో ఈదెడి ఝషముల నడతలు యింకన్
గదిలో మర్మములన్నియు
పదిలము నుండుట యుచితము పరువౌ మల్లీ.. 55

కం.
మదనుని బాణము ఘాతము
గద కనిపించని పొగులుగ గమనించంగన్
వదనము నిండుగ యలజడి
సొదలను వినగల చనవును సొంపారదుగా.. 55
పొగులు = బాధ
చనవు = ఆసక్తి

కం.
ఎదలో గుసగుస మనెడిని
సొదలను వినివిని నగవుల సొబగుల తోడన్
గదినేతెంచిన వధువుకు
మది ఝల్లని యలజడినియు మరుడే జేసెన్.. 56

కం.
పదిలము మనసున దాగెడి
కధలను వెనకన వినబడు గానము యింకన్
మదిలో చెలగెడి యూహల
వదలక  నిలుపుచు గడుపుము వాటముగానున్.. 57

కం.
పదిలముగ మందులిచ్చియు
చదివిన దంతయు నగవుల జనులకు పంచన్
గదిలో బంధన జేసియు
వధియింపగ వైద్యుని మరి వగపులు రావా.. 58

కం.
నాధుడు తెలివియె లేకను
మేధకుడై యుండజూడ మేతకు బరువే
వేధను వేడిన గానీ
బాధలు తీరవు కనుకను బాధ్యత నీదే .. 59

కం.
యోధుడు పార్ధుడు పశుపతి
నాధుని గూర్చిన తపముకు నభమే వణికెన్
సాధన మెచ్చిన సాంబుడు
బాధలు తీర్చగ యొసగెను పాశుపతంబే.. 60

కం
బాధలు వేధింపగను సు
యోధనుడు శకునిని యడగ యోచన జేసిన్
మేధను యోగము గొనియును
వేధను తానని పలుకుచు వేసెగ కవరన్. .. 60

కం.
వేధించెడి వాంతులు మరి
బాధించెడి యుష్ణముకును భారములకునున్
శోధన కొద్దిక జాలము
నాధుడె వైద్యుడు జనుమిక నమ్మకముంచన్. .. 61
జాలము = అంతర్జాలం

కం.
మాధవుడవు నీవెగ యం
బా ధవుడవు నీవని మరి పాలితులము మే
మే ధర్మమునన్ పొందగ
నా ధరణిని కాచెడి బహు నాగడ వీవే. .. 62

కం.
సాధన లేకయు గానము
వేధయు లేనిది జగమును వేచిన కనమే
బాధయు లేనిది ప్రాణము
మాధవు లేనిది గనముగ మాతను లచ్చిన్. .. 63

కం.
మనమున తలచిన చాలును
వనమాలిని దయనొసగును వరములు చాలా
ఘనతరుడతడును నిరతము
ఒనరించుగ జగమునకును దోషము లేకన్. .. 64

కం.
దానము మేటియె జగమున
గానము మురిపించు మనను గమకము తోడిన్
మౌనము భూషణము మనకు
మానము దొడ్డది బ్రతుకున మరువకు మల్లీ. .. 65

కం.
ఘనమగు శాకమునడుగగ
పన‌సను చూపెను యపుడును పడతియె నగవున్
పనసలు చదివెడు బాపడు
ఘనమగు సామము గమకపు గానము చేసెన్. .. 66

కం.
దినమణి పూజ్యుడు మరిని య
ఘ నాశకుడు సత్వమున జగతికి పితగదా
జన జవ కారకు డవలీ
లను దిక్కుల తారణన బలయుతుడు కనరే. .. 67

కం.
అన విని వేటు తినిన నా
గిని సత్యను యూరడింప గిరధరుడేగెన్
తన వాహనమున వడిగా
మనసును దోచు విరిరాణి మందట తానున్. .. 68

మందట = వద్దకు

కం.
మనవిని వినుమదె మాధవ
తనువును మనసును యదుపున తపసును చేసీ
కనులారను నిను కనుచును
తనివిని పొందెడు వరమును దయచేయగదే. .. 69

కం.
అనఘుడు నారాయణుడును
అనఘుడు జగమున కనుగొన యంబిక  పతియే
అనఘన యమ్మయె సుందరి
అనగననగ నామమిచ్చు యశమును బుద్ధిన్. .. 70

కం.
ధన్విని రఘుకులతిలకుని
తన్విని తీర నుతియింతు తమకము తోడన్
జన్మము సాఫల్యమగును
తన్మయమగునుగ మది యిక తనువును విరియున్. .. 71

కం.
జపమును జేయగ నేరను
తపమా యదియును కుదరదు తగదుగ తనువున్
కృప జూడమనిన యేమది
విపరీతము గద కనగను వీడును దైవం. .. 72

కం.
తాపము హెచ్చగ మామిడి
తోపున జొచ్చిన యతివకు తోడుగ నుండీ
కాపుగ యుండెద నీకును
దాపున లేరెవరనగను తాడించె మరిన్. .. 73

కం.
చెప్పిన మాటయె చెప్పుచు
తప్పుడు మాటలు పలికిన తాటను తీతున్
చెప్పుతొ చేతును పూజను
ఉప్పుతొ పాతర సరిగను యుక్తము నీకున్. .. 74

కం.
అబ్బా యనుచును వచ్చిన
దెబ్బల బారిన పడగను దేహముయంతన్
జబ్బను చూపుతు జవ్వని
అబ్బో జబ్బకు దెబయని యావురనేడ్చెన్. .. 75

కం.
డబ్బున్న వ్యక్తి యొకరును
జబ్బున్నదని యనుకొనియు జంటగ రాగా
గబ్బే నీ జబ్బనుచును
సబ్బును వాడు యని వెజ్జ సంబాళించెన్. .. 76

కం
లోభికి ఖర్చెక్కువయని
శోభగ నుండెడి తనువుకు శోకులు జేయన్
నాభిని వాడిన యప్పుడు
లాభము గూభము యయినది లాలన పోయెన్. .. 77

కం.
నభమే భోరు కొలుపగను
సభయును పూర్తిగ తడిసెను సభికులు యంతన్
విభవము లేదని యలిగిరి
రభసే చేయగ యచటను రచ్చలు నయ్యెన్. .. 78

కం.
శోభగ తోచుగ తల్లిది
వైభవమైనట్టి ముఖము వైదర్భిది యున్
క్షోభలు తీర్చునది గదా
ఈ భవమును దాటెదనుగ యీ యమ వేడన్. .. 79

కం.
శోభిల దోచెన్ తిరుమల
వైభవమే గద కనులకు వైనము గానున్
లాభము భక్తుల మదిని
క్షోభలు తీర్చెడి నెలవిది క్షోణితలములో. .. 80

కం.
మామా వస్తిని యింటికి
ఏమా నను కనుగొనగను యేడుపులేలా
ధీమాగను యుంటివి కద
జామాతను వస్తిని మరి జాగు మరేలా. ...82

కం.
అమ్మా యెటకును పోతివి
కొమ్మా నా జోతలివిగొ కొమరుని గాదా
లెమ్మా యా దివినుండిని
రమ్మా నను దీవెనలతొ రాగములిమ్మా. ...83

కం.
కొమ్మా మనుజుల నమ్మకు
మమ్మా దనుజులె కనుగొన మారరు యెపుడున్
లెమ్మా చొచ్చుకు పొమ్మా
నిమ్మకు నీరుగ చనగను నీకే శాపం ...84

కం.
అమ్మల గంటివి గద మా
యమ్మవె గాచుము కరుణను  యపచారములన్
నమ్మితి నీ చరణమ్ముల
ఇమ్మా నిండుగ నిలకడయిన శరణమునున్ ...85

కం.
మామా వందనమిదె నా
రోమాలన్నియు నిగిడెగ రోషము తగ్గెన్
బీమా సొమ్ములు యిస్తివి
హామీయును లేకను మరి హాస్యములాడన్ ...86

కం.
గామా కిరణము సోకిన
రామా యేమని చెబుదును రాగల పీడన్
కోమా గద బ్రతుకే యిక
చీమను యైనా సరియను జీవివి కావా ...87

కం.
దుమ్మును రేపెడు సినిమా
గమ్మున యుండగ కుదరదు కనెదము మరలా
సొమ్ములు కావని యనుకొని
దమ్మును పట్టీ మరిమరి తగ చూడగదే ...88

కం.
దోమల చూడగ శోకము
చీమల చూడగ ఘనమగు చిత్రము జాలిన్
భామను చూడగ తమకము
మామను చూసిన కలుగును మగటిమదేలో ..89

కం.
సుందరుడగు రామునికిని
సుందరి సీతయు దొరకెను యందముగానున్
సుందరమీ వాల్మీకము
సుందరుడగు హనుమ తోను సుందరమయ్యెన్...90

కం.
కందువ పద్యము కందము
మందమనెడు జనులిక మరి మందమతులుగా
అందమ్మగునది కందము
సుందరమది వ్రాయగనిక సు కలముతోడిన్ ..91

కం
బిందువు ఆసనము గలిగి
కందువ చిరు నగవున మము కాపాడగదే
చందురు సిగపై దాల్చిన
సుందరుడగు స్వామి యేలు సుందరి నీవే ..92

కం.
ఇంపుగ తోచెను యాగము
వంపులు తిరిగిన నదివలె వయ్యారమునన్
కెంపులు దొరికిన చందము
సొంపగు పేయపు కవనము సొంతము నాకున్ ...93

కం.
అంకమునను జనకాత్మజ
జింకను తెమ్మని యడుగగ చిరునగవులతో
వంకరలేని శరములను
గొంకే లేకను వదలెగ కోదండముతో ..94

కం.
లెంకను రామునకనుచును
లంకేశు హరిత వనమ్ము లంకించంగన్
శంకలు వీడగ జానకి
సంకట మోచను హనుమను సాగగ నంపెన్ ..95

కం.
కంటికి రక్షణ రెప్పలు
ఒంటికి కావలె వసనము వొద్దిక కొరకున్
పంటికి కావలె శుభ్రత
ఇంటికి కావలె సతతము ఈశుని కృపయే ...96

కం.
అండగ పావని యుండగ
పండిన పండ్లన్నటినిడి పావన చరితున్
ఉండగ కోరెద మనమున
భండన వేళల యసురుల భయకారకుడిన్ ..97

కం.
మండన చేతు జననికిని
దండల నిత్తునిక పూజ దయను యడిగితిన్
గుండెలు నిండను నింపితి
దండన వద్దునిక శుభము దయచేయగదే ..98

కం.
భండన భీముడె రాముడు
మండెడు గుండెల యడిగెను మగువను సీతన్
కుండపు యగ్నిని జొచ్చగ
యుండుమని పలికె యపుడును యుద్ధతి తోడన్ ..99

కం.
కెంజాయ నున్న తల్లికి
వింజామర వీతునిపుడు వినయముతోడన్
జంఝాటములను బాపుచు
రంజిలు యా చూపులు మరి రమణీయమ్మే .... 100

కం.
కంబము నుండి జనించిన
గంభీరమగు వదనమును కనులను నిండన్
బెంబేలెత్తెడి రూపము
సంబాళించెడి నరహరి సకలము నిచ్చున్ ...101

కం.
వింటిని కవులను గూరిచి
కంటిని ముఖపుస్తకమున కవివృషభములన్
వంటల సందడి యల్లరి
తుంటరి మాటల ఖరాబు తూపులు యెన్నో ... 102

కం.
అండగ తల్లియు దండ్రియు
నుండగ యేమని తెలుపుదు నుజ్వల గతిలో
దండిగ పద్యముల తతిని
కుండమునకునిచ్చెదనిక కూర్మిని పొందన్ .. 103

కం
శంభుడు శార్వాణీశుడు
సంభవుడు సిరిభవుడు బహు సంతోషించీ
డింభకుల మాకు నిచ్చుత
దంభము లేకను నయమున దండములందన్ ..104

కం.
నిండుగ ధాన్యపు గాదులు
పండుగ సంక్రాంతి వేళ పరవశమందన్
మెండుగ బంధువులందరు
యుండగ మనసును నిరతము యుల్లాసమెగా ..105

కం.
పందెపు కోడిని తేగా
బందుగులందరు తెలివిగ బాగున్నదనీ
విందులు చేతుము రమ్మని
మందును కూడను కలిపెదమనగా వింటిన్ ..106

కం.
చందురుడు రాజయోగియె
ముందుండును యన్నిట మరి ముచ్చటలాడున్
అందముగ కందముల నిడి
సుందరుడగు శివునివియని సులువుగ పల్కున్ ..107

కం.
ఛందము నేర్పెడిది మిషయె
అందుండెడి భావము కడు యందము గానున్
అందరకు అచ్చ తెలుగును
సుందర రూపమున నేర్పు సుమధుర భావమ్ ..108

శ్రీ ప్రసాద్ కట్టుపల్లి గారికి ధన్యవాదాలు

కం.
అందరకు యీమె సోదరి
బంధువు కాకున్ననేమి బంధము లావే
అందముగను పలుకును మరి
సుందర గాత్రము మధురము సుగుణపు రాశిన్ ..109

సీతక్క కు హృదయ పూర్వక ధన్యవాదాలు Sita Lakshmi P

కం.
హరి హరి నీ నామమనెడి
సరిసాటి కనని గళమున సంగీత ఝరుల్
మరిమరి వినగను ముదమే
హరిదాసు కనగ మనసున హరి రూపమ్మే

కం.
ఇనుడును తన పథమును యిక
కనగను యుత్తరపు దిశకు కదులుతు యుండన్
అనిమిషులకిది పవలు గద
మనుజులకు బహుద శుభమని మరువకు నీవున్

కం.
కలదుగ యిందున తీపియు
కలుగును పున్నెము చెవులను కమ్మగ వినగన్
పిలువను యాకొను హరియే
సులువుగ కీర్తన సలుపగ సులభుడు మనకున్

కం.
మంగళమగు మాసంబున
మంగళకరమగు యుదయము మరువగ లేకన్
మంగళకైశికి రాగము
మంగళమని యెరుగుము బహుమతి వేరేదీ

కం.
పర్వము నేడే గనుడీ
సర్వులు జేతురు విభవము సంతోషమునన్
శర్వుని సూర్యుని విష్ణుని
గర్వము వీడియు కొలుతురు గాదా చూడన్

కం.
గర్వమునను పలికెదనుగ
ఉర్వియు యరుణుడు పశువులు యుత్తమమనుచున్
అర్వాచీనులు యొద్దని
పర్వము ప్రాణము మనకని పలికెద నిపుడున్

అరుణుడు = సూర్యుడు
అర్వాచీనులు = నవీనులు
పర్వము = పండుగ

కం.
పంచమ వత్సరమున కడు
చంచలులగు బాలలకును చక్కగ నెంతన్
మంచిగ పలకను వ్రాయక
ఎంచగ నేటి చదువులను యెటుల పొగడుదున్

ఆ.వె.
ఓం నమఃశివాయ యనకను పాశ్చాత్య
పదములను పలికెడి పలుకుల విన
కంపరమగు యొడలు కలుగును కష్టము
జనని భాష మించు జవము గనము