అమరకోశము దిగ్వర్గము
దిశస్తు కకుభః కాష్ఠా
ఆశాశ్చ హరితశ్చ తాః
దిశః = అవకాశామిచ్చునట్టివి,
ప్రాగ్దక్షిణాది భేదముల చేత తెలియబడుచున్నవి
కకుభః = సూర్యునిచేత
ప్రకాశించుచున్నవి, ఉదకమునైననూ, గాలినైననూ
విస్తరింపజేయునది
కాష్ఠాః = ప్రకాశించునవి
ఆశాః = వ్యాపించి యుండునట్టివి
హరితః = తమస్సులను హరించునట్టిది,
అజ్ఞానమును హరించునట్టిది
తాః అను శబ్దము వలన ఈ
ఐదున్ను స్త్రీలింగములని తెలియనగును
ఈ ఐదున్ను దిక్కుల పేర్లు
ప్రాచ్యవాచీ ప్రతీచ్య
స్తాః పూర్వ దక్షిణ పశ్చిమాః
ఉత్తరాది గుదీ చీ స్యాత్
–
ప్రాచీ = ప్రధమముగా సూర్యుడు
ఈ దిక్కున బొడమును కనుక ప్రాచి
అవాచి = సూర్యుడు దక్షిణాయనమున
ఈ దిక్కున తోచును, మధ్యాహ్నమునందు దీనిని బొందును కనుక అవాచి
ప్రతీచీ = సూర్యుడు సాయం
సమయమున ఈ దిక్కున అస్తమించును కనుక ప్రతీచీ
ఉదీచీ = దీనిని సూర్యుడు
ఉత్తరాయణమున ఊర్ధ్వముగా పొందును కనుక ఉదీచీ,
ప్రాచీ, అవాచీ, ప్రతీచీ,
ఉదీచీ అనునవి క్రమముగా తూర్పు, దక్షినమ, పశ్చిమ, ఉత్తర దిక్కులా పేర్లయి ఉన్నవి
[పూర్వత్వా పూర్వాః
= మొదటి దిక్కు, దక్షతే వర్ధతే దక్షిణాః = వృద్దిపొందునట్టిది, పశ్చాద్భవాః పశ్చిమాః
= వెనుక వైపు దిక్కు, ఉత్తరతి మేర్వాదిభ్యః ఉత్తరాః = మేర్వాదులను దాటించునది ఉత్తరము]
ఇవి నాలుగున్ను దిక్కుల
పేర్లు
దిశ్యం తు త్రిషుదిగ్భవే
(అవాగ్భవ మవాచీన ముదీచీన ముదగ్భవం
ప్రత్యగ్భవం ప్రతీచీనం
ప్రాచీనం ప్రాగ్భవం త్రిషు )
దిశ్యం = దిక్కుల యందు
పుట్టినది
త్రిషు లింగేషు వర్ధతే
= మూడు లింగములయందు వర్తించును
తూర్పు దిక్కు యందును,
దక్షిణ దిక్కు యందు, పశ్చిమ దిక్కు యందు, ఉత్తర దిక్కు యందు పుట్టినవి
ఇన్ద్రో వహ్ని పితృపతి
ర్నైరృతో వరుణో మరుత్
కుబేర ఈశః పతయః పూర్వాదీనాం
దిశాం క్రమాత్
ఇంద్రుడు, అగ్ని, యముడు,
నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు వీరు వరుసగా తూర్పు, ఆగ్నేయాది దిక్కులకు
పాలకులు
ఐరావతః పుణ్డరీకో వామనః
కుముదో ఽ ఞ్జనః
పుష్పదన్త స్సార్వభౌమ
స్సుప్రీకశ్చ దిగ్గజాః
ఐరావతః = సముద్రమునందు
పుట్టినది
పుణ్డరీకః = తెల్లని
తామర వంటి కాంతి గలది, ప్రకాశించునట్టిది
వామనః = పొట్టిది కనుక
వామనము, అందమైన శరీరము గలది
కుముదః భూమిని సంతోషింప
జేయునట్టిది, తెల్లకలువ వర్ణము కలది,
ఆంజనః = కాటుక వన్నె
గలది, లెస్సగా నడచునది, ప్రకాశించునది
పుష్పదంతః = పుష్పముల
వలె ప్రకాశించు దంతములు గలది
సార్వభౌమః = సమస్త భూమియందు
ఎరుగబడునది
సుప్రతీకః = మంచి అవయవములు
గలది
దిగ్గజాః = దిక్కుల యందుండు
గజములు
ఈ ఎనిమిదిన్నీ వరుసగా
అష్ట దిగ్గజముల పేర్లు
కరిణ్యో ఽ భ్రముః కపిలా
పిఙ్గళా నుపమాః క్రమాత్
తమ్రపర్ణీ శుభదన్తీ చాఙ్గనా
చాఙ్గనావతీ
అభ్రముః = తన మగనిని
విడిచి కదలనిది, మేఘములయందుండునది
కపిలా = కపిల వర్ణము
గలది,
పిఙ్గళా = పింగళ వర్ణము
కలిగినది
అనుపమా = తనకు సాటి లేనిది
తామ్రపర్ణీ = తామ్రపర్ణ
మనెడి ఓషధితో గూడినది
శుభ దంతీ = చక్కని దంతములు
కల్గినది
అంగనా = మంచి అవయవములు
కలిగినది
అంజనా = అంజన పర్వతముతో
సమానమగు వర్ణము కలిగియుండుట వలనగాని, కాటుక వన్నె కలిగియుండుట వలన కాని అంజన
అంజనావతీ = కాటుక వంటి
దేహకాంతి కలది
ఇవి ఎనిమిదిన్ని అష్ట
దిగ్గజముల భార్యల పేర్లు
క్లీబావ్యయం త్వపదిశం
దిశోర్మధ్యే విదిక్ స్త్రియాం
దిశోర్మధ్యం క్లీబావ్యయం
= ఇది నపుంసక లింగమును, అవ్యయము గూడను. దిక్కుల మధ్యము.
విదిక్ = రెండు దిక్కుల
వలన విగతమైనది, విశిష్టమైనది
అవి ఆగ్నేయము, నైరుతి,
వాయవ్యము, ఈశాన్యము అను మూలల పేర్లు
అభ్యంతరం త్వంతరాళమ్
అభ్యంతరం = అవకాశము గలిగినది,
అవకాశము నిచ్చునది
(అభ్యంతరాంతరాళ శబ్దౌ
అష్టదిఙ్గ్మధ్య వాచకౌ = ఈ పైన చెప్పిన నాలుగు మూలలున్ను ఉపచారము చేత కేవల మధ్య వాచకములు
)
చక్రవాళం తు మండలం
చక్రవాళమండల శబ్దములు
మండలాకార దిక్సమూహ వాచకములు
చక్రవాళమనగా చక్రము వంటి
వలయము గలది, చక్రాకారముగాయుండునది
మండలమనగా అలంకరించునది
అభ్రం మేఘో వారివాహః
స్తనయిత్ను ర్వలాకహః
దారాధరో జలధర స్తటిత్త్వా
న్వారిదో ఽ మ్బుభృత్
ఘన జీమూత ముదిర జలముగ్దూమయోనః
అభ్రం = ఉదకమును భరించునది,
ఉదాకములు దీనియందు కొరవడవు, ఉదకమునిచ్చునది, సంచరించునది
మేఘః = తడుపునది
వారివహః = జలమును వహించునది
స్తనయిత్ను = మ్రోయునది
వలాకహః = బలమును విడువనిది
ధారా ధరః = జలధారలను
ధరించునది
జలధరః = జలమును ధరించునది
తటిత్వా = మెరుపులు గలది
వారిదః
= ఉదకమునిచ్చునది
అంబుభృత్ = ఉదకమును భరించునది
ఘనః = తాపమును పోగొట్టునది,
వాయువు చేత కొట్ట బడునది
జీమూతః = ఉదకము దీనియందు
బంధింపబడి యున్నది
ముదిరః = సంతోషము నిచ్చునది
జలముక్ = జలమును విడచునది
ధూమ యోనిః = ధూమము కారణముగా
కలిగినది
ఇవి పదిహేనున్ను మబ్బుల
పేర్లు
కాదమ్బినీ మేఘమాలా –
ఉదకమును పుచ్చుకొనునవి
కనుక కదంబములు అనగా మేఘములు ఇవి కలిగినది కనుక కాదంబినీ, ఇది వర్షించినపుడు కదంబ వృక్షము
(కడిమి చెట్టు) పుష్పించును, హంసలు గలిగినది.
మేఘమాలా = మేఘముల వరుస
గలిగినది.
ఇవి రెండును మేఘ పంక్తి
పేర్లు
త్రిషు మేఘభవే ఽ భ్రియం
మేఘభవే = మేఘము వలన బుట్టినది
ఇది మేఘమునదు పుట్టిన
దాని పేరు
స్తనితం గర్జితం మేఘ
నిర్ఘోషో రసితాదిచ
స్తనితం = మ్రోయుచుండినట్టిది
గర్జితం = గర్జించునది
మేఘ నిర్ఘోష = మేఘముల
గొప్ప ధ్వని
రసితం = మ్రోయుచుండినట్టిది
ఈ నాలుగున్ను ఉరుముల
పేర్లు
శంపా శతహ్రదా హ్రాది
న్యైరావత్యః క్షణప్రభా
తడి త్సౌదామనీ విద్యు
చ్చంచలా చపలా ఆపి
శంపా = భయమును కలిగించునది
కనుక సుఖమును మ్రింగి వేయునది
శత హ్రదా = అనేకవిధములుగా
అస్ఫుటమై మ్రోగుచుండినట్టిది
హ్రాదినీ = అవ్యక్త శబ్దము
కలిగినట్టిది
ఐరావంతీ = ఇరావంతమన్న
మేఘమున బుట్టినది
క్షణప్రభా = క్షణమాత్రము
ప్రకాశించునది
తడిత్ = అంధకారమును పోగొట్టునది,
కాంతి చేత కన్నులను మూయింప జేయునట్టిది
సౌదామనీ = సుదామమనగా
ఐరావతము దానితో కూడినది, సుదామమను పర్వతముతో ఒక దిక్కునండుండునది, దండ వలే దీర్ఘాకారము
కలిగినది
విద్యుత్ = మిక్కిలి
ప్రకాశించునది
చంచలా = కదలునది
చపలా = మెల్లగా బోవునది
ఈ పదియున్ను మెరుపుల
పేర్లు
స్ఫూర్జథు ర్వజ్ర నిర్ఘోషే
–
స్ఫూర్జథుః = మిక్కిలి
మ్రోయునది
వజ్ర నిర్ఘోషే = వజ్రాయుధము
వంటి మ్రోత గలది
ఇవి రెండును వజ్రపు మోత
పేర్లు
మేఘజ్యోతి రిరం మదః
మేఘజ్యోతి = మేఘ సంబంధమైన
అగ్ని
ఇరం మదః = ఇరమనగా జలము
దానిచే వృద్ది పొందునది ఇవి రెండును వజ్రాగ్ని పేర్లు
ఇంద్రాయుధం శక్రధనుః
ఇంద్రాయుదః = ఇంద్రుని
ఆయుధము
శక్రధనుః = ఇంద్రుని విల్లు
ఇవి రెండును ఇంద్ర ధనుస్సు
పేర్లు
తదేవ ఋజు రోహితం
ఆ ఇంద్ర ధనుస్సు చక్కగా
నుందునేని రోహితమనబడును, రోహిత వర్ణమనగా రక్తవర్ణము అది గలది
ఇది చక్కని ఇంద్ర ధనుస్సు
పేరు
వృష్టి ద్వర్షం
వృష్టి అనగా వర్షము
వర్షము అనగా తడుపునట్టిది
కనుక.
ఇవి రెండును వర్షము పేర్లు
తద్విఘాతే వగ్రవాహగ్రహౌ
సమౌ
వగ్రహము, అవగ్రహము ఇవి
రెండును గ్రహ విరోధము చేత సంభవించిన వర్ష ప్రతిబంధము
ఇవి రెండును కఱవు పేర్లు
ధారా సంపాత ఆసారః
ధారా సంపాతః = ఉడక దారాలు
ఎడతెగక పడుట
ఆసారః = అంతటా పడునది
ఇవి రెండును జడివాన పేర్లు
శీకరో మ్బుకణాసృతాః
శీకరః = తడుపునది, శీతమును
కలుగజేయునది
అమ్బుకణాః = గాలిచే అటునిటు
విసరబడిన వానచినుకులు
ఈ రెండును నీటి తుంపురులు
వర్షోపలస్తు కరకా
వర్షోపలః = వాన యొక్క
శీల
కరకాః = పైరులను చెరచునది,
వాయువు చేత వెదజల్లబడునట్టిది
ఇవి రెండు వడగండ్ల పేర్లు
(రభసః)
మేఘఛ్ఛన్నే హ్ని దుర్దినం
మేఘఛ్ఛన్నే = మొయిళ్ల
చే కప్పబడిన దినము దుర్దినమనబడును
ఇది ముసురు పట్టిన రోజు
పేరు
అంతర్ధా వ్యవధా పుంసి
త్వంతర్ది రపవారణమ్
అపిదాన తిరోదాన పిదానాచ్ఛా
దనానిచ
అంతర్ధా = పదార్ధము దీనిచే
వ్యవహితముగా దరించబడును,
అంతర్దిః = దీనిచే పదార్ధము
కానబడదు
అపవారణం = దీని చేత పదార్ధము
కప్పుబడును
అపిధానం = మిక్కిలి మరుగు
పరచునది
తిరోధానం = అడ్డమగునది
పిధానం = మరుగు అగునట్టిది
చ్చాదనం = కప్పునది
ఈ ఏడున్నూ ముసురు పేర్లు
హిమాంశు శ్చంద్రమాశ్చంద్ర
ఇన్దుః కుముదబాన్ధవః
విదు స్సుధాంశుః శుభ్రాంశుః
రోషధీశో నిశాపతిః
అబ్జో జైవాతృక స్సోమో
గ్లౌర్మృగాఙ్క కళానిధిః
ద్విజరాజ శ్శశిధరో నక్షత్రేశః
క్షపాకరః
హిమాంశు = మంచు వలె చల్లని
కిరణములు కలవాడు
చంద్రమా = చంద్రమనగా
కర్పూరము, దానితో పోల్చదగువాడు
చంద్రః = ఆహ్లాదమును
కలుగజేయు వాడు
ఇన్దుః = మంచు కిరణములచేత
తడిపెడి వాడు
కుముద బాన్ధవః = కలువలకు
చుట్టము
విధుః = దేవతలు ఇతనిని
మిక్కిలిగా పానము చేయుదురు
సుధాంశుః = అమృత రూపమైన
కిరణములు గలవాడు
శుభ్రాంశుః = తెల్లని
కిరణములు గలవాడు
ఓషదీశో = ఓషదులకు ప్రభువు
నిశాపతిః = రాత్రికి
రేడు
అబ్జః = నీటియందు పుట్టినవాడు
జైవాతృకః = పైరులను బ్రతికించువాడు
సోమః = అమృతామును పుట్టించినవాడు,
ప్రతి పక్షమునందు (15 రోజులకు) పుట్టింప బడువాడు
గ్లౌం = ప్రతి మాసము
క్షయించువాడు
మృగాంకః = మృగము చిహ్నముగా
గలవాడు
కళానిధిః = కళలకు ఉనికిపట్టు
ద్విజరాజః = వేల్పులకు
రేడు
శశధరః = కుందేటిని ధరించినవాడు
నక్షత్రేశః = నక్షత్రములకు
రేడు
క్షపాకరః = రాత్రిని
చేయువాడు
ఈ ఇరవయ్యిన్ని చంద్రుని
పేర్లు
కలా తు షోడశో భాగో
చంద్రుని పదునారవ భాగము
కళ యనబడును. కలా యనగా లెక్కింపబడునది
బిమ్బో ఽ స్త్రీ మణ్డలం
త్రిషుః
బిమ్బః = విస్తారమును
చెందునది, ప్రకాశించునది
మండలం = ఆలంకరించునది
ఇవి రెండున్ను సూర్య
చంద్రుల మండలములు
భిత్తం శకలఖణ్డే వా పుంస్యర్ధః
భిత్తం = వ్రక్కలించబడునది
శకలం = భేదింప శక్యమైనది
ఖండం = త్రుంచబడునది
అర్దః = భేదమును పొండునది
ఇవి నాలుగును తునకల పేర్లు
అర్ధం సమేం ఽ శకే
అర్ధం = సగముపాలు
ఇది శకలమును చెప్పునపుడు
పుంలింగము, సగమును చెప్పునపుడు నపుంసక లింగము
చన్ద్రికా కౌముదీ జ్యోత్స్నా
చంద్రికా = చంద్రయుక్తమైనది
కౌముదీ = కలువలు పుష్పించుటకు
హేతువైనది
జ్యోత్స్నా = ప్రకాశము
కలిగినది
ఈ మూడును వెన్నెలకు పేర్లు
ప్రసాదస్తూ ప్రసన్నతా
ప్రసన్నమగుట ప్రసాదమును,
ప్రసన్నతయును కూడ.
ఈ రెండును నైర్మల్యత
పేర్లు
కళఙ్కాఙ్కో లాంచనం చ
చిహ్నం లక్ష్మ చ లక్షణం
(పాళిః కేతో ర్ధ్వజో
లిఙ్గం నిమిత్తం వ్యఞ్జనం పదమ్
ప్రజ్ఞానం చాప్యభిజ్ఞానం
లలామం చ లలామ చ)
కళంకః = దీని చేత పదార్ధము
ఎరుగబడును (కలయతే జ్ఞాయతే అనేనేతి కళంకః )
అంకః = దీని చేత పదార్దము
లక్షించబడును
లాంఛనం = దీని చేత పదార్దము
లక్షించబడును
చిహ్నం = ఎరిగించునది,
ఎరుగబడునది
లక్షణం = పదార్ధము దీని
చేత చూడబడును
ఈ ఐదున్ను గుర్తుల పేర్లు
సుషమా పరమా శోభా
దీనికి సర్వము లెస్సగా
సమమై యుండును
ఇది శ్రేష్టమైన కాంతి
పేరు
శోభా కాన్తిర్ద్యుతి
శ్చవిః
శోభా = ప్రకాశింపజేయునది
కాంతి = కోరబడుచున్నది
కనుక కాంతి
ద్యుతిః = ప్రకాశించుచున్నది
చవిః = అంధకారమును పోగొట్టునది,
అశోభను పోగొట్టునది
శోభతొ కూడి యుండుటవలన ఈ పై శబ్దములు స్త్రీ లింగమని తెలియనగును
ఈ పై నాలుగున్నూ కాంతి
పేర్లు
అవశ్యాయన్తు నీహార స్తుషార స్తుహినం హిమం
ప్రాలేయం మిహికాచ
ఆవశ్యాయః = శైత్యమును
పొందించునది
నీహారః = అగ్ని చేత మిక్కిలి
హరించబడునది
తుషారః = తాపము నొందినవానిని
సంతోషింపజేయునది
తుహినం = పద్మమును పీడించునది
హిమం = తాపమును పోగొట్టునది
ప్రాలేయం = శరత్కాల అంతమున
వచ్చునది
మిహీకా = భూమిని తడుపునది,
కాముకులచే పూజింపబడునది
హిమికా = వృద్ది పొండునది
ఈ ఎనిమిదిన్ని మంచు పేర్లు
అధ హిమానీ హిమ సమ్హతిః
హిమానీ = అధికమైన మంచు
హిమసమ్హతిః = మంచు సమూహము
ఇవి రెండు దట్టమైన మంచు
పేర్లు
తద్వాదార్దాస్సుషీమ శ్శిశిరో
జడః
తుషార శ్శీతలో శ్శీతో
హిమ స్సప్తాన్య లింగకాః
శీతం = వ్యాపించునది
సుషీమః = చక్కని హద్దు
గలది, చక్కగా వ్యాపించునది
శిశిరః = పద్మముల కాంతి
చెరచునది
జడః = ధైర్యమును నివారించునది
తుషారః = తప్తుడైనవానిని సంతోషింప జేయునది
శీతః = వ్యాపించునది
హిమః = వృద్ది పొందునది
ఈ ఏడున్ను విశేష్య లింగము
గలవి, మరియు చల్లని వస్తువుల పేర్లు
ధ్రువ ఔత్తానపాదిః స్యాత్
ధృవః = స్థిరముగా యుండువాడు
ఔత్తానపాదిః = ఉత్తానపాదుని
కొడుకు
ఇవి రెండున్ను ధ్రువుని
పేర్లు
అగస్త్యః కుంభ సంభవః
మైత్రావరుణిః
ఆగమనగా పర్వతము(వింధ్య
పర్వతము) దానిని అణచినవాడు
కుంభ సంభవః = కలశమందు
పుట్టినవాడు
మైత్రావరుణః = మిత్రావరుణుల
కుమారుడు
ఇవి మూడున్ను అగస్త్యుని
పేర్లు
అస్త్యైవ లోపాముద్రా
సధర్మిణీ
లోపాముద్రా = స్త్రీల
యొక్క రూపాభిమానములను లోపింపజేయునది, బ్రహ్మ సృష్టిని ముద్రింపజేయునది, ముద్రయనగా సంతోషము
పతి శుశ్రూష లేమి చేత సంతసము లేనిది కనుక లోపాముద్ర
సధర్మిణీ = పతి తోడ సరియైన
ధర్మము గలది
ఇది అగస్త్యుని భార్య
పేరు
నక్షత్రమృక్షం భం తారా
తారకాప్యుడు వా స్త్రియాం
నక్షత్రం = నశింపనిది
కనుక నక్షత్రము
ఋక్షం = చీకటిని పోగొట్టునది,
సంచరించునది
భం = ప్రకాశించునది
తారా, తారకా = దీని చేత నావికులు తరింతురు
ఉడుః = ఆకాశమందు సంచరించునది (దీనికి స్త్రీ మరియు నపుంసక
లింగములు వర్తించును)
ఈ ఆరున్ను చుక్కల పేర్లు
దాక్షాయణ్యౌః ఽ శ్వినీ త్యాది తారాః
దాక్షాయిణ్యౌః = అశ్విన్యాది రేవతీ పర్యంతం నక్షత్రములను దాక్షాయణిలని
పిలతురు వీరు దక్షప్రజాపతి కుమార్తెలు
వీరు ఇరవైఏదుగురున్ను
నక్షత్రముల పేర్లు( అశ్విని మొదలుకుని రేవతి వరకు)
ఆశ్వయు గశ్వినీ ఆశ్వయుక్
= రూపము చేత అశ్వ సామ్యమును పొందినది
అశ్వినీ = అశ్వము వంటి
రూపము గలది
ఈ రెండున్ను అశ్విని
పేర్లు
రాదా విశాఖా
రాధః = దీని చేత కార్యము
సిద్ధించును
విశాఖా = దీని చేత కాంతి
వ్యాపించును
ఈ రెండున్ను విశాఖ పేర్లు
పుష్యే తు సిద్ధ్యతిష్యా
పుష్యః = కోరికను వృద్ది
పొందించునది
సిద్ధః = దీని యందు ప్రయోజనములు
సిద్ధించును, కోరికను సాధించునది
తిష్యః = దీనియందు కార్యసిద్ది కొరకు సంతోషింతురు , ప్రకాశించునది
ఇవి మూడున్ను పుష్య నక్షత్రము
పేర్లు
శ్రవిష్ఠయా
సమా ధనిష్టా
శ్రవిష్ఠా = శుభ కర్మమునందు
మంచిదని వినబడునది
ధనిష్టా = (ధన ధాన్య)
సంపదను జేయునది
ఇవి రెండున్ను ధనిష్ఠ
పేర్లు
స్యుః ప్రోష్ఠపదా భాద్రపదాః
స్త్రియః
ప్రోష్ఠపదాః = (ప్రోష్ఠమనగా
ఎద్దు) ఎద్దు పాదముల వంటి పాదములు గలది
భాద్రపదః = (భద్రం పదం
యసాం తా) శుభకరమైన పాదములు గలది
ఈ రెండున్ను పూర్వాభాద్ర,
ఉత్తరాభాద్రల పేర్లు
మృగశీర్షం మృగశిర స్తస్మి
న్నే వా గ్రహాయణీ
మృగశీర్షం, మృగశిరః =
ఆకృతి చేత మృగము శిరసు వంటి శిరస్సు గలది
ఆగ్రహాయణీ = మృగశిరతొ
కూడిన పున్నమిన సంవత్సరమున మొదటగా నూతన ధాన్యము చేత హవిర్యాగము
చేయుట వలన అగ్రమందు
హాయనము కలిగినది, ఇందు నూతన ధాన్యములు కలవు
ఈ మూడున్ను మృగశీర్షము
పేర్లు
ఇల్వలా స్తచ్చిరో దేశే
తారకా నివసంతియాః
ఇల్వలాః = మృగశిర నక్షత్రము
పైనున్న నక్షత్రములను ఇల్వలములందురు, ఆ నక్షత్రములమీద సంచరించునవి, శివుని బాణముచే
ప్రేరేపింపబడునవి
ఇవి మృగశిర నక్షత్రము
పైనుండు చిన్న నక్షత్రముల పేర్లు
బృహస్పతి స్సురాచార్యో
గీష్పతి ర్ధిషణో గురుః
జీవ అంగీరసో వాచస్పతి
శ్చిత్ర శిఖండిజః
బృహస్పతి = దేవతలు చదువు
మంత్రములను బృహత్తులందురు. వారలకు, అనువారికి ప్రభువు
సురాచార్యః = దేవతలకు
ఆచార్యుడు
గీష్పతి = వాక్కులకు
పతి
ధిషణః
= మంచి బుద్ది కలవాడు
గురుః = సర్వార్ధములను
వచించువాడు
జీవః = దేవతలను బ్రతికించువాడు,
చచ్చిన వారిని బ్రతికించువాడు
అంగీరసః = అంగిరస్సు
కుమారుడు
వాచస్పతి = వాక్కులకు
పతి
చిత్రశిఖండిజః = చిత్రశిఖండి
యనగా అంగిరస్సు అతని కుమారుడు
ఈ తోమ్మిదిన్ని బృహస్పతి
పేర్లు
శుక్రో దైత్యగురుః కావ్య
ఉశనా భార్గవః కవిః
శుక్రః = తెల్లని వర్ణము
గలవాడు, రుద్రుని రేతస్సు వలన పుట్టినవాడు, దేవతలకు దుఃఖమునిచ్చువాడు
దైత్యగురుః = దైత్యులకు
గురువు
కావ్యః = కవి యను ఋషికి
కొడుకు ఉశనః = = అసురుల శ్రేయస్సును ఇచ్చగించు వాడు
భార్గవః = భృగు సంతతియందు
పుఇట్టినవాడు
కవిః = చాతుర్యము చేత
వర్ణించువాడు
ఇవి ఆరున్ను శుక్రుని
పేర్లు
అఙ్గారకః కుజో భౌమో లోహితాన్గో
మహీసుతః
అంగారకః = సంచరించువాడు,
శరీరమును పీడించువాడు, నిప్పువంటి వర్ణము గలవాడు
కుజః = భూమి యందు పుట్టినవాడు
భౌమః = భూమి కొడుకు
లోహితాంగః = ఎర్రని శరీరకాంతి
గలవాడు
మహీసుతః = భూమి కొడుకు
ఇవి ఐదున్ను అంగారకుని
పేర్లు
రోహిణేయో బుధః సౌమ్యః
రోహిణేయః = రోహిణీ దేవి
కుమారుడు
బుధః = సర్వము నెరిగినవాడు
సౌమ్యః = చంద్రుని కొడుకు
ఇవి మూడున్ను బుధుని
పేర్లు
సమౌ శ్శౌరి శనేశ్చరౌః
(శని మందో పంగు కాళో
ఛాయాపుత్రో ఽ సితో ర్కజః)
సౌరిః = సూర్యుని కొడుకు
శనైశ్చరః = మెల్లగా సంచరించువాడు
( శని, మందుడు, పంగుడు,
కాళుడు, ఛాయా పుత్రుడు, అసితుడు, అర్కజుడు)
ఇవి యన్నియు శనైశ్చరుని
పేర్లు.
తమస్తు రాహు స్స్వర్భాను
స్సైమ్హికేయో విధుంతుదః
తమః = ఇతని వలన సూర్యచంద్రులు
వ్యధను పొందుదురు, తమస్సును జేయువాడు, చీకటి రూపముగా కలవాడు
రాహుః = (రహత్యాగే) సూర్య
చంద్రులను కబళించి విడచువాడు
స్వర్భానుః = స్వర్గమునందు
ప్రకాశించువాడు
సైంహికేయః = సింహిక
(హిరణ్యకశిపుని చెల్లెలు) కుమారుడు
విధుంతుదః = విధువనగా
చంద్రుడు – అతడిని వ్యధపెట్టువాడు
ఇవి అయిడున్ను రాహువు
పేర్లు
సప్తర్షయో మరీచ్యత్రి
ముఖాశ్చిత్ర శిఖన్డినః
మరీచి, అత్రి, అంగిరస్సు,
పులస్త్య్డుడు, పులహుడు, క్రతువు, వశిష్టుడు అను వారలు ఏడుగురును చిత్ర శిఖండులని పిలువబడుదురు అనగా చిత్రమైన జటా విశేషములు గలవారు
రాశీనా ముదయో లగ్నం
మేషాది రాశుల ఉదయము లగ్నమనబడును
రాశిః = కాలాది ఫలము
నిచ్చునది
లగ్నం = గ్రహములకు సంబంధించినది
తే తు మేషవృషాదయః
అవి మేషము ఆదిగా గలవి
( మేషము, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మకరం,
మీనం)
సూరా స్సూర్యార్య మాదిత్య
ద్వాదశాత్మ దివాకరాః
భాస్కరా హస్కర బ్రధ్న
ప్రభాకర దివాకరాః
భాస్వ ద్వివస్వ త్సప్తాశ్వ
హరిదశ్వోష్ణరశ్మయః
వికర్తనార్క మార్తాణ్డ
మిహిరారుణ పూషణః
ద్యుమణి స్తరణి ర్మిత్ర
శ్చిత్ర భాను ర్విరోచనః
విభావసు ర్గ్రహపతి స్త్విషాంపతి
రహర్పతిః
భానుర్హంస స్సహస్రాంశు
స్తపన స్సవితా రవిః
(కర్మసాక్షీ జగచ్చక్షు
రంశుమాలీ త్రయీతనుః
ప్రద్యోతనో దినమణిః ఖద్యోతో
లోకబాన్ధవః
సురోత్తమో ధామనిధిః పద్మినీ
వల్లభో హరిః)
సూరః = సంచరించు వాడు
సూర్యః = ప్రేరేపించువాడు
ఆర్యః = గమనయుక్తుడు
ఆదిత్యః = అదితి కొడుకు
ద్వాదశాత్మా = పన్నెండు
విధములైన మూర్తులు(రూపములు) గలవాడు
దివాకరః = దినమును చేయువాడు,
పగలు జీవులను వ్యాపారవంతులను జేయువాడు
భాస్కరః = కాంతిని కలుగజేయువాడు
ఆహస్కరః = ఆహస్సును చేయువాడు
బ్రధ్నః = ఇతరుల తేజస్సును
నిరోధించు వాడు, తిమిరమును అడ్డగించువాడు
ప్రభాకరః = ప్రశస్తమైన
కాంతిని జేయువాడు
విభాకరః = మిక్కిలి కాంతిని
కలుగజేయువాడు
భాస్వాన్ = కాంతులు గలవాడు
వివస్వాన్ = కాంతిచేత
అన్నిటిని కప్పెడువాడు
సప్తాశ్వః = ఏడు గుఱ్ఱములు
గలవాడు, సప్తయనెడు ఒక గుఱ్ఱము గలవాడు
హరిదశ్వః = పచ్చని కాంతి
గల గుఱ్ఱములు గలవాడు
ఉష్ణరశ్మిః = ఉష్ణమైన
కిరణములు గలవాడు
వికర్తనః = తమస్సును
పోగొట్టువాడు, విశ్వకర్మ సానపట్టడం వలన తగ్గిన కాంతి గలవాడు
అర్కః = పూజింపబడువాడు
మార్తాండః = మృతండు డనెడి
వాని కొడుకు, నశించిన బ్రహ్మాండమును బ్రతికించెడి వాడు
మిహిరః = తాను మేఘరూపియై
ప్రపంచమును తడుపు వాడు
అరుణః = సంచరించువాడు
పూషాః = పోషించు వాడు
ద్యుమణిః = ఆకాశమునకు
మణి వంటివాడు
తరణిః = అంధకారము ఇతనిచేత
తరించబడును, ఆకాశమును దాటువాడు
మిత్రః = సర్వ భూతములయందు
స్నేహయుక్తుడు
చిత్రభానుః = నానా వర్ణములైన
కిరణములు గలవాడు
విరోచనః = విశేషముగా
ప్రకాశించు వాడు
విభావసుః = కాంతియే ధనముగా
గలవాడు
గ్రహపతిః = గ్రహములకు
ప్రభువు
త్విషాంపతిః = కాంతులకు
పతి
అహర్పతిః = పగలుకు ప్రభువు
భానుః = ప్రకాశించువాడు
హంసః = తమస్సును పోగొట్టువాడు
సహస్రాంశుః = వేయి కిరణములు
గలవాడు
తపనః = తపింప జేయువాడు
సవితా = సుప్తుని ప్రేరేపింపజేయువాడు
రవిః = నుతింపబడువాడు
కర్మసాక్షీ = కర్మలకు
సాక్షి
జగచ్చక్షుః = జగత్తుకు
నేత్రములవంటివాడు
అంశుమాలీ = కిరణ సమూహములు
గలవాడు
త్రయీ తనుః = మూడు వేదములు
శరీరముగా కలవాడు
ప్రద్యోతనః = విశేషముగా
ప్రకాశించు వాడు
దినమణిః = దినమునకు రత్నము
వంటివాడు
ఖద్యోతః = ఆకాశమునందు
ప్రకాశించువాడు
లోక బాన్ధవః = లోకమునకు
చుట్టము
సురోత్తమః = దేవతల యందు
శ్రేష్టుడు
ధామనిధిః = కాంతులకు
గనియైనవాడు
పద్మినీ వల్లభః = తామర
తీగకు ప్రియుడు, పద్మినీ దేవి భర్త
హరిః = చీకటిని పోగొట్టు
వాడు
ఇవి ముప్పై ఏడున్ను సూర్యుని
పేర్లు
మాఠరః
పిఙ్గళో డణ్డ శ్చణ్డాశోః పారిపార్శ్వికాః
మాఠరః = సూర్యుడు దయాళువు
కనుక రాక్షసులకు వరములిచ్చునను సందియము చేత యమాగ్ని రుద్రులు విఘ్న దేవతలై మాఠరపింగళ
దండులన్న నామంతరముతో సూర్యుని వద్ద నుందురు.
పింగళః =పింగళ వర్ణము
గలవాడు
దండః = దండించు వాడు
పారి పార్శ్వికాః = పార్శ్వముల
నుండువారు
వీరు ముగ్గురున్ను నామాంతర
ధారులై సూర్యునికి పరిచర్యలు చేయు ఇంద్రాదుల పేర్లు
సూర్య సూతో రుణో నూరుః
కాశ్యపి ర్గరుడాగ్రజః
సూర్య సూతః = సూర్యుని
సారధి
అరుణః = గమనయుక్తుడు,
ఎర్రని కాంతికలవాడు
అనూరః = తొడలు లేనివాడు
కాశ్యపిః = కశ్యప ప్రజాపతి
కొడుకు
గరుడాగ్రజః = గరుత్మంతుని
అన్న
ఈ అయిదున్ను
సూర్యుని సారధియగు అనూరుని పేర్లు
పరివేషస్తు పరిధిః
పరివేషః = అంతటను వ్యాపించునది
పరిధిః = అంతటా ఆవరించునది
ఇవి రెండున్ను పరివేషము
పేర్లు
ఉపసూర్యక మండలే
సూర్యకం = సూర్య సమీపమున
నుండునది
మండలం = అలంకరించునది
ఇవి రెండు ప్రతి సూర్యుని
పేర్లు
కొందరు పరివేష మొదలుకుని
మండల వరకు నాల్లుగు పేర్లు పరివేషమునకు పేర్లని అందురు
కిరణో స్ర మయూఖాంశు గభస్తి
ఘృణిఘృష్టయః
భానుః కరో మరీచిః స్త్రీపుంసయోః
ర్దీధితః స్త్రియాం
కిరణః = తమస్సును పోగొట్టునది
ఉస్రః = దీనియందు జలములుండును
మయూఖః = అంధకారమును పోగొట్టునది
అంశుః = వ్యాపించునది
గభస్తిః = వస్తువులను
చూపునది
ఘృణిః = దీని వలన జలము
జారును, ప్రకాశించునది
ధృష్ణిః = ప్రగల్భమైనది
భానుః = ప్రకాశించునది
కరః = తమస్సును హరించునది,
తమస్సును హింసించునది, భూమి యందు వెదజల్లబడునది, వర్షమును కలుగజేయునది
మరేచిః = దీని వలన క్షుద్ర
జంతువులు, అంధకారము నశించును
దిధేతిః = ప్రకాశించునది
ఇవి పదునొకండును కిరణముల
పేర్లు
స్యుః ప్రభాః సు గ్రుచిస్త్విడ్వాభాశ్చ
విద్యుతి దీప్తయః
రోచిశ్శోచిరుభే క్లీబే
–
ప్రభా = మిక్కిలి ప్రకాశించునది
రుక్ రుచిః = మిక్కిలి
ప్రకాశించునది
త్విట్ = కాంతి యుక్తమైనది
భాః= ప్రకాశించునది
చవిః = అంధకారమును పోగొట్టునది
ద్యుతిః = ప్రకాశించునది
దీప్తయః = ప్రకాశింపజేయునది
రొచిః = ప్రకాశించునది
శోచిః = తీవ్రమైనది కనుక
దుఃఖపెట్టునది
ఇందు ప్రభా మొదలు దీప్తి
వరకు స్త్రీ లింగము, రోచి, శోచి పుంలింగము
ఇవి పదకొండును కాంతి
పేర్లు
ప్రకాశో ద్యోత ఆతపః
ప్రకాశః = ప్రకాశించునది
ద్యోతః = ప్రకాశించునది
ఆతపః = అంతటను తపింపజేయునది
ఇవి మూడును ఎండ పేర్లు
కోష్ణం కవోష్ణం మందోష్ణం
కదుష్ణం త్రిషు తద్వతి
కోష్ణము,
కవోష్ణము, మందోష్ణము, కదుష్ణము ఇవి నాలుగును కొంచెము వేడిమి పేర్లు.ఇవి గుణ వాచకములైనపుడు
నపుంసక లింగము, గుణముగల పదార్ధములకు వాచకమైనపుడు మూడు లింగములయందును వచ్చును.
తిగ్మం తీక్ష్ణం ఖరం
తద్వత్
తిగ్మం
తీక్ష్ణం ఇవి రెండును మిక్కిలి వేడిమి, ఖరం అనగా ఇంద్రియ క్షోభము కల్గించునది
ఇవి గుణ వాచకములైనపుడు
నపుంసక లింగము, గుణముగల పదార్ధములకు వాచకమైనపుడు మూడు లింగములయందును వచ్చును.
మృగ తృష్ణా మరీచికా
మృగతృష్ణ = మృగములకు
దీని యందు ఆశ కలదు
మరీచికా = క్షుద్ర జంతువులు,
మృగములైనను దీని చేత మృతి నొందును, కిరణము వలే త్రోచునది
ఇవి రెండును ఎండమావుల
పేర్లు
దీనితో దిగ్వర్గము పూర్తియైనది
తరువాత కాల వర్గము
No comments:
Post a Comment