మా కంబోడియా – ఆంగ్కోర్ వాట్ యాత్రా విశేషాలు
గత ఏడాది నేను, నా శ్రీమతి
వెంకటరమణ ఇద్దరమూ మా అబ్బాయి విరించి,
కోడలు అఖిల, మనుమరాలు శ్రీబృహతి తో గడపడానికి మలేసియా కౌలాలంపూర్ వెళ్ళాము. నేను
ఎప్పుడైనా భారత్ బయటి దేశం వెళితే చూడవలసిన ప్రదేశం కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్
అని ఎప్పుడో చెప్పి ఉండడం వలన మా విరించి అక్కడ నుంచి కంబోడియా వెళ్ళడానికి
ఏర్పాట్లు చకచకా చేసేసాడు.
మలేషియా కౌలాలంపూర్ నుంచి
ఉదయం 7.30 కి ఎయిర్ ఏషియా విమానంలో బయల్దేరితే రెండు గంటల తరువాత ఆంగ్కోర్ వాట్ కు
దగ్గరలోని సీయెమ్ రీప్ చేరుకుంటాము. కానీ అక్కడకు వెళ్ళాక గడియారం ఒక గంట వెనక్కు
మార్చుకోవాలి. అక్కడ వాతావరణం ఎక్కువగా ఎండగా ఉంటుంది. విజయవాడ అక్షాంశంలొ
ఉన్నది ఈ ప్రదేశం.
చాలా విశాలమైన రహదారులతో
ప్రశాంత వాతావరణం తొ ఉంటుంది సీయెం రీప్ పట్టణం. అక్కడ కుడివైపున వాహనాలు నడపాలి
(Right hand drive). ప్రజలు చాలా మర్యాద చూపుతారు. ఎక్కువగా విదేశీ యాత్రికులు
వస్తారు కాబట్టి అక్కడి కరెన్సీ రియాల్ అయినా డాలర్లే ఎక్కువ శాతం మారక ద్రవ్యం గా
చెలామణీ అవుతుంది (1 డాలర్ = 4000 రియాల్స్). మనతో పోలిస్తే వస్తువుల ధరలు
ఎక్కువగా అనిపించేది ఇందువలననే.
ఇక్కడ రవాణా సాధనాలుగా
సైకిళ్ళు, ఆటో రిక్షాలు, టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. కానీ ఇక్కడ ఆటో
అంటే టాక్సీ అని అర్ధం. మన ఆటోరిక్షాల వంటివి మోటార్ సైకిళ్ళకి అనుసంధానం చేసి
నలుగురు వెనకాల కూర్చోగలిగిన వాహనం ఉంటుంది. దీనిని టుక్ టుక్ అంటారు. అద్దె
మోటార్ సైకిళ్ళమీద కూడా ఎక్కించుకుని వెళ్ళే సదుపాయం ఉంది. చివరకు సైకిళ్ళు కూడా
అద్దెకు తీసుకోవచ్చు. కాకపొతే ఇంగ్లీషు తెలిసిన
డ్రైవర్లు తక్కువగా కనిపిస్తారు. ఎక్కువ మంది ఉంటే టూరిజం డిపార్ట్ మెంట్ వారి దగ్గర బస్సు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక
రోజుకి, మూడు రోజులకి, వారం రోజులకి చొప్పున టిక్కట్లు ఇస్తారు. మనం వెళ్ళిన ప్రతి
చోట టికట్లు తనిఖీ చేస్తారు. విహంగ వీక్షణం చెయ్యదల్చుకునే వారికి హెలికాప్టర్
సౌకర్యం కూడా ఉంది. ప్యాకేజ్ టూర్లు ఉన్నాయి.
సియెమ్ రీప్ అంతర్జాతీయ
విమానాశ్రయం పెద్దది కాక పోయినా దాదాపుగా 35 విమానయాన కంపెనీలు ఇక్కడకు విమానాలు
నడుపుతున్నాయి. ఇక్కడకు చేరుకున్న తరువాత ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీలు ఒక 20
నిముషాలు పడుతుంది. టూరిస్టు వీసా అక్కడే తీసుకోవచ్చు (Visa on arrival). 30 రోజుల
వీసాకు 30 డాలర్లు వసూలు చేస్తారు. విమానాశ్రయం బయట టాక్సీలకు ఒక ఆఫీసు ఉంటుంది.
మోటార్ టాక్సీలు(ఆటోలు), ఆటోరిక్షాలు (టుక్ టుక్ లు), అద్దె మోటార్ సైకిళ్ళు
(మోటోడుప్ లు), అద్దె సైకిళ్ళు కూడా దొరుకుతాయి. ప్రస్తుతం విమానాశ్రయం ఊరుకి
దగ్గర. కొత్త విమానాశ్రయం 65 కిలోమీటర్ల
దూరములో కడుతున్నారు.
హోటళ్ళు అన్ని రకాలు ఉంటాయి 5
నక్షత్రాల నుంచి బడ్జట్ హోటళ్ళ వరకు. మనకు కావాల్సినది ఎంచుకోవచ్చు. బహుళ అంతస్తు
భవనాలు కనిపించవు. పెద్ద భవనాలు 5 అంతస్తుల లోపే ఉంటాయి. అధిక భాగం హోటళ్ళకు
మాంసాహారం, మద్యం, మసాజ్ పార్లర్(స్పా లు), స్విమ్మింగ్ పూల్, వై ఫి సౌకర్యాలు
ఉంటాయి. ఇక్కడ అందరూ చాలా మర్యాదస్తులు. అతిధులను చేతులు జోడించి ఆహ్వానిస్తారు.
ఇవేకాక కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, కుటుంబాలు నిర్వహించే హాస్టళ్ళలో చౌకగా వసతి
లభిస్తుంది. విడిగా భారతీయ వంటకాలకు, భోజనాలకు కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి.
అంగ్కోర్ వాట్ లో విశేషాలు చూడడానికి బయల్దేరినప్పుడు గొడుగు తప్పక తీసుకుని వెళ్ళాలి. వాన
నుంచి, ఎండ నుంచి కూడా రక్షణ. అక్కడ సందర్శకులకు కచ్చితమైన వస్త్రధారణ నిబంధనలు
ఉన్నాయి. కురచ దుస్తులు అసలు అనుమతించరు. మన దేశంలో గుళ్ళలో నిబంధనలను విమర్శించేవారు ఎక్కువ !
అంగ్కోర్ వాట్ Angkor Wat
ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది ఒక దేవాలయం. 12వ
శతాబ్దంలో సూర్యవర్మ II దీనిని
నిర్మించారు. ఇది ఖ్మేర్ నిర్మాణ
శైలి లో నిర్మింపబడింది.
ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం. ఖ్మేర్ భాషలో
ఆంగ్కోర్ వాట్ అంటే గోపురాల పట్టణము అని అర్ధం (City of pyramids). మనము “శంకు
వాటి“ అనుకోవచ్చు.
ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం సీమ్ రీప్ పట్టణానికి
సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే
అద్భుతమైన శిల్పకళానైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో
ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా
స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్
సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌కోర్ వాట్‌ను
రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు
చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30
సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణంభారతదేశం లోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందినచోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో
కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని
కలిగి ఉన్నాయి. ఈ ఆంకోర్ వాట్ టోనెల్
సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం
కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముఖ్య
దేవాలయం మొత్తం చుట్టూ ఉన్న కందకము, బయటి ప్రాకారముతో కలుపుకుని 1.5 కిలోమీటర్లు X
1.3 కిలోమీటర్లు ఉంటుంది. దేవాలయం మొత్తం ఒక చదరపు కిలోమీటరు వైశాల్యంలో కట్టారు.
ముఖ్య ఆలయం 65 అడుగుల ఎత్తు ఉంటుంది. ముఖద్వారం నుంచి చూస్తే మూడు గోపురాలు
ఉన్నట్లు కనిపించినా మూడు అంతస్తులతో, మొత్తం ఐదు గోపురాలతో అలరారుతూ ఉంటుంది.
భారతదేశం లో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే
చెప్పాలి. అద్భుతమైన వాస్తురీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్ పర్వత
శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా,
విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందినది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ
సంస్కృతికి దగ్గరగా ఉంటాయి. 14 వ శతాబ్దంలో బౌద్ధమతం పరిఢవిల్లినపుడు విష్ణు
శిల్పాలను బుద్ధ శిల్పాలుగా మార్చారు. మొత్తం నాలుగు బుద్ధ విగ్రహాలు కంటికి ఇంపుగా
దర్శనమిస్తాయి. వీటిని అన్నిటినీ దర్శించుకుంటే అదృష్టమని ఇక్కడి వారి నమ్మకం.
కానీ ఈ విగ్రహాలు చూస్తే విష్ణుమూర్తి విగ్రహాలని మనకి తెలిసిపోతుంది. చతుర్భుజాలతో
ఉన్న విగ్రహము, ఐదు తలల పాము పడగల క్రింద ఉన్న విగ్రహము, శయనించిన విగ్రహము ఇవి
విష్ణువువని చెప్పకనే చెపుతాయి.
ముఖ్య ఆలయం తూర్పువైపున గర్భ గుడి లోకి వెళ్ళడానికి
చెక్క మెట్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే వారు కట్టిన మెట్లు మోకాళ్ళ కన్నా ఎత్తు
ఉంటాయి. గర్భగుడిలోనుంచి చూస్తే చుట్టూ మొత్తం గుడి ప్రాంగణము, ప్రాకారము, కందకము
మొత్తం కనిపిస్తాయి. అంత ఎత్తుగా ఉంటుంది గర్భగుడి.
ఖ్మేర్ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు
అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు
ప్రవహించేదట. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంగ్‌కోర్ వాట్ దేవాలయంలో కూడా వాడారు.
ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయిందనే విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల
పొడవు, ఒకటిన్నర
మైలు వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్లు (వీటిని అక్కడ 'బారే'లు అంటారు) నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. ఈ రిజర్వాయర్లను
వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించేవారట. ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ ఫిలిప్ గ్లోసియర్
ఈ రిజర్వాయర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధృవపరిచాడు. నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు
జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్ అభిప్రాయాన్ని
బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయట.
ఆలయం చుట్టూ ప్రాకారం చాలా పెద్దది. నలుచదరంగా
ఉంటుంది. ఆ చదరానికి నాలుగు మూలలలో కూడా నాలుగు పెద్ద గోపురాలు అద్భుతంగా
ఉంటాయి.
ముఖద్వారం నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ
పచ్చని పచ్చికతో అక్కడి వాతావరణమంతా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముఖద్వారం నుండే మూడు
పెద్ద పెద్ద గోపురాలు దర్శనమిస్తాయి. ఇందులో మధ్య గోపురం నుండి లోపలికి వెళ్తే
అనేక గోపురాలు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యోదయం.
ఉషోదయ వేళ ఆలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. పొద్దున లేచి గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత
కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే చాలు... ఎంతసేపైనా ఆ
దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. ఎండ వేడెక్కి చుర్రుమనిపించేవరకు
అలాగే ఉండిపోతారు కూడా.
ఈ దేవాలయంలో మరో అద్భుతమైన ప్రదేశం బ్యాస్ -
రిలీఫ్స్ గ్యాలరీ. నాలుగు గోడలతో నిర్మించిన ఈ మండపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణగాథలే కనిపిస్తాయి. ముఖ్యంగా తూర్పున ఉన్న 'మంధన్' అనే
గ్యాలరీ అందర్నీ ఆకట్టుకుంటుంది. భారత పురాణాలైన రామాయణ, మహా భారతదృశ్యాలు అనేకం ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాయి. దేవతలూ, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి.
తూర్పు వైపు మండపంలో విష్ణుమూర్తి పుట్టుక, అవతారాల కు సంబంధించిన శిల్పాలు ఉంటే
పశ్చిమం వైపు మండపం గోడలపై యుద్ధాలు, మరణాలకు సంబంధించిన
ఆకృతులు కనిపిస్తాయి. కురుక్షేత్ర
యుద్ధం, రామ
రావణ యుద్ధ సంఘటనలు ఎంతో చక్కగా మలచబడ్డాయి. ఇక దక్షిణ మండపంలో ఆలయాన్ని
నిర్మించిన రాజు రెండవ సూర్యవర్మన్ రాజ్యానికి సంబంధించిన సైనిక పటాల దృశ్యాలు
దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెర కింపురుషాధి అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు
కొలువుదీరిన యమసభ వంటి అనేక కళాఖండాలు ఆంగ్‌కోర్ వాట్ ఆలయ గోడలపై
సాక్షాత్కరిస్తాయి.
పూర్వకాలంలో కాంభోజ దేశంలో
హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని
నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు
చరిత్ర ద్వారా తెలుస్తోంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి
చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని
రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, టోనెల్
సాప్ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న 'నాగ' అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు
చారిత్రక ఆధారాలున్నాయి. ఖ్మేర్ సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్ సామ్రాజ్యాధినేత
అయిన 'కాము'తో భరత ఖండానికి
సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం
భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవిత కాలంలో కనీసం
ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం ఒకటి.
ఆంగ్‌కోర్ వాట్ దేవాలయానికి
సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అద్భుత ప్రదేశం ఆంగ్‌కోర్ థోమ్. ఖ్మేర్
సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తుల్లో ఒకరైన 'జయవర్మ - 6 ఆంగ్‌కోర్ థోమ్‌ను రాజధానిగా చేసుకుని రాజ్యాధికారం చేపట్టాడనడానికి
చారిత్రక ఆధారాలున్నాయి. దీనినే 'మహా నగరం' అని కూడా అంటారు. తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ
నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ
బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏనుగుల మిద్దెలు, లెపర్
రాజు ప్రతిమలు, బెయాన్, బఫూన్ లాంటి
అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత. ఆంగ్‌కోర్ థోమ్ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో
నిర్మించిన గోర్డెన్ టవర్ (బెయాన్) ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మించిన బెయాన్ (బుద్ధుని) దేవాలయం ఆంగ్‌కోర్ థోమ్‌కి
ఆకర్షణీయంగా నిలుస్తుంది ప్రాసాత్ త ప్రోమ్ / తా ప్రొమ్
అంకోర్ వాట్ లోని అత్యంత
ఆకర్షణీయమైన సముదాయం ఈ పురాతన ఆలయ సముదాయం. అంకోర్ థోమ్ కు తూర్పున ఒక కిలోమీటర్
దూరం లో ఉన్న ఈ కట్టడం జయవర్మ VII క్రీ.శ. 12వ శతాబ్దం చివర, 13వ శతాబ్దం పూర్వ
భాగంలో కట్టించాడని చరిత్రకారుల నమ్మకం. బేయాన్ లాగే దీనిని కూడా మహాయాన పద్ధతిలో నిర్మించారు.
మొదట్లో దీని పేరు రాజ విహార(రాజు గారి ఆరామం). జయవర్మ కుటుంబ సభ్యలకు నివాసంగా
దీనిని కట్టినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిని తా ప్రోమ్(పురాతన బ్రహ్మ)
అంటున్నారు. యునెస్కో వారు వారసత్వ సంపదగా గుర్తించిన తరువాత పెద్దగా మార్పులు
లేకుండానే పరిరక్షిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద బూరుగుదూది చెట్లు, మర్రి చెట్లు
దేవాలయం మీద, ప్రాకారాల మీద వేళ్ళతో, ఊడలతో దట్టంగా పెరగడం వలన అదొక రకమైన
ఆకర్షణగా నిలిచింది ఈ కట్టడం. భారతీయ
పురాతత్వ శాఖ, కాంబోడియా ప్రభుత్వపు APSARA (Authority for the Protection and
Management of Angkor and the Region of Siem Reap) తో ఈ కట్టడం పరిరక్షణ బాధ్యత చేపట్టింది. మిగిలిన ఆలయాలలా కాకుండా ఈ
కట్టడం తూర్పు ముఖంగా ఉండి బల్లపరుపు కట్టడంగా ఉంటుంది. ఈ సముదాయంలో దాదాపు
8,00,000 మంది నివసించేవారని అప్పటి చారిత్రిక ప్రతుల వలన తెలుస్తోంది. ఇందులో 18
మంది రాజ గురువులు, 615 మంది నర్తకీమణులు
ఉండేవారట. వీరికి సేవల కోసం సేవకులు, మిగిలిన ప్రజలు దాదాపు 8 లక్షల మంది చుట్టు
ప్రక్కల గ్రామాలలో ఉండే వారట.
ఆంజెలీనా జోలీ నటించిన హాలీవుడ్
సినిమా “లారా క్రోఫ్ట్ అండ్ ది టూంబ్ రైడర్స్” సినిమా ఇక్కడే చిత్రీకరించారు. Banteay Srei or Banteay
Srey (బాన్తే శ్రీ) :
ఆంగ్కోర్ వాట్ లోని దేవాలయాలలో ఇదొక్కటే
రాజుల చేత కాకుండా ఇతరులచేత నిర్మించబడినది. ఇది పదవ శతాబ్దంలో ఒకటవ హర్ష వర్మ
మనుమడు, రెండవ రాజేంద్ర వర్మకు సచివుడు అయిన యఙ్ఞ వరాహ నిర్మించిన శివాలయం. త్రిభువనేశ్వర
ఆలయం గా పేరొందిన ఈ దేవాలయం ఉన్న ఊరు పేరు ఈశ్వరపుర. ఇది శివాలయమైనా ఉత్తరాన ఉన్న
గుడులు విష్ణు మూర్తివి. ఈ ఆలయం ఆధునిక నామం బాన్తే శ్రీ అంటే సౌందర్య సౌధం లేక
సౌందర్య సుదతి (citadelof beauty or citadel of woman). కుడ్యాలమీద ఉన్న శిల్ప
సంపద చూస్తే ఆ పేరెందుకు వచ్చిందో తేలికగా అర్ధమవుతుంది. ఇక్కడ ఉపయోగించిన రాయి
ఎర్ర ఇసుకరాయి (red sandstone) అందుకనే చాలా నైపుణ్యంతో శిల్పాలని చెక్కడం
సాధ్యమైంది.
ఈ ఆలయం లోని సొగసైన దేవతా మూర్తులు అనేక మార్లు జరిగిన చోరీలలో చేతులు మారాయి.
వాటిని పరిరక్షించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొన్నిసార్లు విఫలమైనాయి.
నాంఫెన్ లోప్రభుత్వ మ్యూజియంలొ భద్రపరచిన శివ, ఉమాదేవి మూర్తులు కూడా చోరీకి గురి
అయ్యాయి.
ఈ దేవాలయాల మీద శిల్పాలు లేని గోపురాలు కానీ, గోడలు కానీ లేవంటే అతిశయోక్తి
కాదు. కాల పురుషుడు, వాలి సుగ్రీవుల
యుద్ధము, తిలోత్తమ కొరకు సుందోపసుందుల పోరాటము, ఖాండవ దహనము, నటరాజు తాండవము, రావణుని
కైలాస పర్వత ఉద్ధరణ, ఆపై శివుని చే గర్వభంగము మొదలైనవి అత్యంత సుందరంగా
తీర్చిదిద్దబడ్డాయి. ప్రా ఖాన్ (Preah Khan) 1191 లో ఏడవ జయవర్మ
శత్రువులైన ఛామ్ వంశస్తుల మీద విజయం సాధించిన సందర్భంగా కట్టించిన అద్భుతమైన
కట్టడం.. Preah Khan అంటే రాచ ఖడ్గం లేక
పవిత్ర ఖడ్గం అని అర్ధం. ఈ ఆలయాన్ని
కనుగొన్న తరువాత మరమ్మతులు జరిగినా, అంతకు ముందు అతి
వేగంగా విస్తరించిన అరణ్య సంపదను అలాగే విడిచిపెట్టడం వలన ఆలయ సౌందర్యం ఎంతో
కమనీయంగా ఉంటుంది.ఇక్కడి ముఖ్య దేవత బోధిసత్వ అవలోకితేశ్వరుడు, ఈయనకు జయవర్మ
తండ్రి రూపంలో ఈ ఆలయంలో శిల్ప రూపం ఇచ్చారు. ఈ ఆలయ సముదాయం
దేవాలయం, బౌద్ధ
విశ్వవిద్యాలయం మరియు నగరం మూడిటి సంగమంగా ఉండేదిట.
ఈ సముదాయం చుట్టూరా కందకము, ఆ లోపల ప్రాకారము
ఉన్నాయి. ప్రాకార కుడ్యము
మీద 50 మీటర్లకొక నాగులను
చేత పట్టిన గరుడుల విగ్రహాలను మొత్తం 72 శిల్పాలను చెక్కారు మొత్తం 700 X 800 మీటర్ల కందకం లోపల ఈ సముదాయం 140 ఎకరాల మేర
విస్తరించి ఉంది. ఈ సముదాయానికి నలువైపులా నాలుగు సింహద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల గుండా
వెళ్ళదానికి కందకం మీద ఉండే దారికి ఇరువైపులా క్షీరసాగర మధనాన్ని తలపించే రకంగా
దేవతలు, అసురులు సర్పాన్ని
పట్టుకున్నట్లు చెక్కారు.లోపలి గర్భ గుడికి మూడు గోపురాలు ఉన్నాయి. తూర్పు వైపున
నృత్యమండపం ఉన్నది. పడమటి వైపున చదరంగము, లంకా యుద్ధము చెక్కారు. దీని స్తంభాలు
పురాతన భారతీయ ఆలయ స్తంభాలను పోలి ఉన్నాయి. ఆంగ్కోర్ లో మరెక్కడా ఇటువంటి స్తంభాలు
లేవు. ఈ కట్టడం ధాన్యాగారం అని పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం. గుడికి
నలువైపులా కొద్దిగా చిన్నవైన గుడులు ఉన్నాయి. గర్భ గుడిని బుద్ధుడికి అంకితం
చేసినట్లు కనబడినా చుట్టూ ఉన్నా ఆలయాలు శివుడి గురించి కట్టినట్లు సులభంగా
తెలిసిపోతుంది. ఈ కట్టడాలన్నీ కూడా పెద్ద పెద్ద
వృక్షాలతో ఆక్రమించబడి ఉన్నాయి. మిగిలిన కట్టడాల మాదిరే దీనిమీద శిల్ప సంపద కూడా
కనులకింపుగా ఉంటుంది.
మొత్తం మీద మూడు రోజులు ఉండి
చాలా వరకూ చూశాము. మేము చూసినది తక్కువ, చూడాల్సింది ఇంకా చాలా ఉందని తెలుసు. కానీ
సమయాభావం వలన మనసు భారంగా అవగా మలేసియాకి తిరుగు ప్రయాణమయ్యాం. డాక్టర్ బి. మల్లికార్జున రావు విజయవాడ x
No comments:
Post a Comment