Thursday, March 17, 2016

అమరకోశము నాట్యవర్గము

అమరకోశము  నాట్యవర్గము

నిషా దర్షభ గాన్ధార షడ్జ మధ్యమ ధైవతా
పఞ్చమ శ్చేత్యమీసప్త తన్త్రీ కంఠోత్థితా స్స్వరాః
(షడ్జం మయూరో వదతి గావస్త్వృ షభభాషిణః
అజావికం తు గాన్ధారం క్రౌఞ్చః క్వణతి మధ్యమం
పుష్పసాదారణే కాలే పికః కూజతి పఞ్చమం
ధైవతం హేషతే వాజీ నిషాదం బృంహతే గజః
మయూరాదయ ఏతేహి మత్తా గాయన్తి పఞ్చమం)

నిషాదః = కడపటి స్వరమగుట వలన దీనియందు స్వరములన్నీ చేరియుండును
ఋషభః = హృదయమునందు ప్రవేశించునది , వృషభ స్వరము వంటి స్వరము పలుకునది
గాన్దారః = వాక్కులను ధరించునది, స్వరాంతరముయొక్క శృతిని బుచ్చుకొనునట్టిది, గాంధార దేశస్తులచే పాడబడునది
షడ్జః = నాసిక, కంఠము, రొమ్ము, దవడలు, నాలుక, దంతములు ఇవి ఆరు స్థలములయందు పుట్టునది
మధ్యమః = ఉరః కంఠములతో కూడి మధ్యావయవమైన నాభివలన పుట్టునది, సప్తస్వరముల మధ్యమునందుండునది
ధైవతః = బుద్ధిమంతులచేత పాడబడునది, నాభ్యాది స్థానముల వలన పుట్టునది
పన్చమః = నాభి, ఉరస్సు, హృదయము, కంఠము, శిరస్సు అను ఐదు స్థానముల యందు పుట్టునది, కోయిలలచేత విస్తరింపజేయబడునది
ఇవి సప్త స్వరముల పేర్లు


కాకలీ తు కలే సూక్ష్మే

కాకలీ = కలమనగా మధురము, అస్ఫుటము అయిన ధ్వని. అది సూక్ష్మమైన యెడల కాకలి యనబడును 
ఇది సూక్ష్మమైన ధ్వని పేరు

ధ్వనౌ తు మధురాస్ఫుటే
కలో

కలః = సుఖమై వ్యక్తము కాని వర్ణములు కలిగిన ధ్వని కలమనబడును, సుఖము నిచ్చునది, కలమనగా మదము అది కలిగినది.
ఇది అవ్యక్తమైన ధ్వని పేరు

మన్ద్రస్తు గమ్భీరే

మంద్రః = దీని చేతనెరుగబడును, మెల్లగా పలుకబడునది
ఇది గంభీర ధ్వని పేరు

తారో త్యుచ్చైః

తారః = స్వరమునన్ని స్థానముల వలనను తరింప జేయునది
ఇది ఉచ్ఛధ్వని పేరు

త్రయస్త్రిషు

కలోధ్వని, కలావాణీ, కలం క్వణనం ఇత్యాది మూడు పేర్లును మూడు లింగములయందును వర్తించును

సమన్వితల యస్త్వేకతాలో

లయమనగా నృత్త గీత వాద్యములు సరిగా ముగించుట. అది ఎందు లెస్సగా కూడి యుండునో అది ఏక తాళమనబడును, సమమైన కాల, క్రియా మానములు కలిగినది
ఇది గీత వాద్య లయ సామ్యమునకు పేరు

వీణా తు వల్లకీ
విపఞ్చీవీణాః

వీణాః = సర్వమూ దీనియందు బుట్టును,
వల్లకీ = స్వర విశేషము ధరించునది
విపంచీ =స్వరములను విస్తరింపజేయునది, దీనియందు స్వరములు వ్యక్తముగా చేయబడును
ఇవి మూడున్ను వీణ పేర్లు

సాతు తన్త్రీభి స్సప్తభిః పరివాదినీ

పరివాదినీ = అంతటను సప్తస్వరముల పలుకునది
ఇది తంతువులతో కూడిన వీణ పేరు

తత వీణాధికం వాద్యమ్

తతము = తంత్రి యనగా విస్తరించబడునది తతమనగా సూత్రము ఆ తంతువులు కలవి కనుక వీణాదులు తతములనబడుచున్నవి, దీనియందు స్వరములు వ్యక్తముగా చేయబడుచున్నవి ఇటువంటి ఇతర వాద్యములు – కిన్నరి, సైరంధ్రి, రావణ హస్తము మొదలైనవి
ఇవి వీణ వంటి తంత్రీ వాద్యముల పేర్లు

ఆనద్ధమ్ మురజాదికమ్

ఆనద్ధం = చర్మము చేత కట్టబడుచున్నది
మద్దెల వంటి చర్మ వాద్యముల పేరు

వంశాదికమ్ తు సుషిరమ్

సుషిరం = సుషి యనగా రంధ్రము అది గలది సుషిరము
ఇది వేణు, శంఖ, కాహళ్యాది ముఖ  వాద్యములకు పేరు

కాంస్యతాలాదికం ఘనమ్

ఘనం = కొట్టబడునది,అగ్ని సంయోగము వలన ద్రవమును చెంది మరల గట్టి పడునది
కంచు తాళము మొదలైన వాద్యముల పేరు

చతుర్విధ మిదమ్ వాద్యం వాదిత్రాతోదనామకం

వాద్యము, వాదిత్రము = పలికించెడునది కనుక వాద్యము, వాదిత్రమున్ను
ఆతోద్యం = అంతటా వాదింపబడునది
ఈ మూడున్ను తతానద్దసుషిరఘనములనెడివాద్యములకు పేర్లు

మృదఙ్గా మురజాః

మృదంగాః = కొట్టబడునది, మృత్తిక అంగముగా కలది.
మురః = మురమనగా చర్మ వలయము, అది కలది
ఇవి మద్దెలకు పేర్లు

భేదాస్త్వఙ్క్యాలిఙ్గ్యోర్థ్వకా స్త్రయః

కరక కాయ వంటి ఆకారము కలది అంక్యము,
యవ మధ్యము వంటి నడుము కలది ఊర్ధ్వకము
గోపుఛ్ఛము వంటి ఆకారము కలిగినది ఆలింగ్యము
తొడమీద నుంచుకొని వాయించునది అంక్యము
వాయించు సంమయమున ఆలింగనము చేయబడునది ఆలింగ్యము
ఇవి మద్దెల భేదములకు పేర్లు

స్వా ద్యశఃపటహో ఢక్కా –

యశః పటహః  = కీర్తి కొరకైన పటహము
ఢక్కా = ఢక్ అనెడి శబ్దము పలుకునది
ఇవి ఢవళ పేర్లు

భేరీ స్త్రీ దున్దుభిః పుమాన్

భేరీః = శత్రువులను భయపెట్టునది
దుందుభి = దుందువను శబ్దముచేత ప్రకాశించునది
ఇవి భేరి పేర్లు

ఆనకః పటహో స్త్రీ స్యాత్  

ఆనకః = దీని వలన స్వరవిశేషము ఉజ్జీవితమౌను
పటః = పటత్ అను శబ్దమును పలుకునది
ఇవి తమ్మట పేర్లు

కోణో వీణాదివాదనం

కోణః = దీని చేత పలికించబడును
వీణాదివాదనం = వీణాదులను వాయించునది
ఇది వీణాది వాద్యముల వాయించు కొడుపు పేరు

వీణాదణ్డః ప్రవాళస్స్యాత్

ప్రవాళః = స్వరములు దీనియందు కూడి యుండును
ఇది వీణ యొక్క ఒళుగు పేరు

కకుభస్తు ప్రసేవకః

కకుభః = వాయువును పోనీక నిలుపునది
ప్రసేవకః = మిక్కిలి కదిసి యుండునది
ఇవి రెండు వీణ యొక్క కరివె పేర్లు

కోలంబకస్తు కాయో స్యా

అస్యా  = ఈ వీణ యొక్క  కాయః = తంత్రి మొదలగు శరీరము కోలమ్బకః = శబ్దమును విస్తరించునది
(కోలంబకమన్న శిరస్సున తంతువులను అవలంబించి యుండునది అని, ఉరస్థలమందు శబ్దించునది అని అర్ధము చేసుకోనగును)
ఇది వీణ యొక్క తంత్రి, ఒళగు మొదలగు శరీరము పేరు

ఉపానాహో నిబన్ధనమ్

ఉపనాహః = తంతులు దీని యందు కట్టబడును
నిబంధనం = దీని యందు తంతులు కట్ట బడును
ఇవి రెండున్ను తంతులు కట్టు బిరడాల పేర్లు

వాద్యప్రభేదా డమరు మడ్డు డిణ్డిమ ఝర్ఝరాః
మర్దలః పణవో న్యే చ

డమరుహః = డమ యను శబ్దమును పలుకునది (దీనిని యోగులు, కాపాలికాదులు వాయింతురు) , ఈ డమరుకమే ఘనమైన మడ్డువనబడును. మడ్ అని పలుకునది కనుక మడువు.
డిండిమః = డిండి యను శబ్దమును చేయునది
ఝర్ఝర = ఝర్ఝ యనెడి ధ్వనిని పలుకునది
మర్డళః = మర్దించబడునది
పణవః = దీని చేత స్తోత్రము చేయ బడును
ఇవి వరుసగా డమరుకము, గుమ్మెట, రాయడి గిడిగిళ్ళు, కైమళ్ళు, మద్దెల, ఉదుక అను వాద్యభేదముల పేర్లు

నర్తకీ లాసోకే సమే

నర్తకీ = ఆడునట్టిది
లాసికా = రంగస్థలమందు క్రీడించునది
ఈ రెండును నాట్యమాడు స్త్రీ పేర్లు

విలమ్బితమ్ ద్రుతం మద్యం తత్వ మోఘో ఘనం క్రమాత్

విలంబిత, ద్రుత మధ్యంబు లనెడి లయ విశేషములు వరుసగా తత్వ, ఓఘ ఘనంబులనబడును
విలంబ = వేరు వేరుగా గతి విశేషములు గలుగుట వలన దీనియందు కరపదాదులు నిలకడగలవగును
ద్రుతం = దీని యందు కరాచరణాదులు త్వరితములగును
మద్యం = విలంబిత ద్రుతముల యొక్క కూడుటచేత ఆ రెంటి నడుమనుండునది
తత్త్వం = కరచారణాది గతివిశేషముల యొక్క ప్రత్యెక దర్శన క్రియావిస్తారము  కలిగినది
ఒఘః = కరచారణాది గతివిశేషముల యొక్క సమవాయము
ఘనం = దీనిచేత భేదింపబడును
ఈ మూడున్ను వరుసగా నృత్త గీత వాద్యముల విలంబ ద్రుత మధ్యమానముల పేర్లు

తాలః కాలక్రియామానం

తాళః = హస్తాకుంచనప్రసారణాది క్రియకును, కాలమునకును కల ప్రమాణము పేరు మరియు ఇంట కాలము చేత ఈ క్రమమున అంగుళీ విన్యాసాదులు చేయవలయునని తెలియపరచునట్టి కాల క్రియా పరిమాణము తాళమనబడును, నృత్త గీత వాద్యములు దీనియందు నిలిచియుండును
ఇది కాలమునకును హస్తా కుంచన ప్రసారణాది క్రియకును కల ప్రమాణము పేరు

లయ స్సామ్యమ్

లయః = నృత్త గీతాదులు దీనియందు సమముగా కూడియుండును
ఇది నృత్త గీతాదులు సమముగా కూడియుండుట పేరు

అథా స్త్రియాం
తాణ్డవమ్ నటనం నాట్యం లాస్యం నృత్యం చ నర్తనే

తాణ్డవమ్ = తణ్డువనెడి ఋషిచేత చెప్పబడినది, దీనిచేత భూమియందు కొట్టబడును
నటనం = నటించుట
నాట్యం = నటుని యొక్క వ్యాపారము
లాస్యం = క్రీడించుట
నృత్యం, నర్తనం = నర్తించుట
భరతశాస్త్ర ప్రక్రియలైన ఈ యారింటికిని పరస్పర భేదము కలదు
ఉద్ధత కరణాంగ విక్షేపములు కలిగి ఆరభటీ వృత్తి ప్రధానమైనది తాండవము
కోమల  కరణాంగ విక్షేపములు కలిగి కైశికీ వృత్తి ప్రధానమైనది లాస్యము
అంగ విక్షేపము మాత్రము కలిగినది నృత్తము
వివాహాది శుభకార్యములందు సర్వరస ప్రధానమైనది నాట్యము

తౌర్యత్రికం నృత్త గీత వాద్యం నాట్య మిదం త్రయం

తూర్యమనగా మద్దెల మొదలైనవి. ఇందు పుట్టిన శబ్దము తౌర్యము
నాట్యం = నటుని సంబంధమైనది
ఈ రెండును నృత్త గీత వాద్యములు మూడును కూడుట పేర్లు

భ్రకుంసశ్చ భ్రుకుంసశ్చ భ్రూకుంసశ్చేతి నర్తకః
స్త్రీ వేషదారీ పురుషో

భ్రకుంశుడు, భ్రుకుంశుడు, భ్రూకుంశుడు అనగా కనుబొమల చేత అర్ధమును సూచించుట యైనను,
కాంతియైనను కలవాడు
ఈ ముడున్ను స్త్రీ వేషధారియై నటనము చేయు పురుషుని పేర్లు

గణికా ఽ ర్జుకా

అర్జుకా = ఆర్జించునది
ఇది (నాట్య పరిభాషలో) వేశ్య పేరు

భాగినీపతి రావుత్తో –

తోబుట్టువును ఏలువాడు
ఇది తోడబుట్టిన దాని మగనికి పేరు

భావో విద్వాన్

భావః = సర్వార్ధములను భావింపజేయువాడు
ఇద విద్వాంసుని కి పేరు

అధావుకః జనకో

ఆవుకః = రక్షించువాడు
ఇది తండ్రికి పేరు

యువరాజస్తూ కుమారో భర్తృదారకః

యువరాజః = చిన్న రాజు
కుమారః = ఆడుకొను వాడు
దారకః = ఆదరింపబడువాడు
భర్తృదారకః = దొర కొడుకు
ఇవి యువరాజుకు పేర్లు

రాజా భట్టారకో దేవః

భట్టారకః = భటులచేత యుద్ధముని తరింపజేయువాడు, శత్రు భటులను పీడించువాడు
దేవః = ప్రకాశించువాడు
ఇవి రాజుకు పేర్లు

తత్సుతా భర్తృదారికా
ఇది రాజు యొక్క కూతురునకుపేరు

దేవీ కృతాభిషేకాయాం

దేవీ = క్రీడించునది
ఇది పట్టాభిషిక్తురాలైన రాజు భార్య (రాణి) పేరు

ఇతరాసు తు భట్టినీ

భట్టినీ = బిగ్గరగా పల్కునది
ఇది పట్టపు రాణి కాక మిగిలిన భార్యలకు పేరు.

ఆబ్రహ్మణ్య  మవద్యోక్తౌ

ఆబ్రహ్మణ్యః = బ్రాహ్మణునికి హితము కానిది
అవధ్యోక్తౌ = చంపదగని వాడు అన్న మాట వేరు

రాజస్యాలస్తు రాష్ట్రియః

రాష్ట్రి యనగా రాజు భార్య. ఆమెకు భ్రాత రాజస్యాలకుడు. యితడు రాజుకు బావమరిది.

అంబా మాతా

అంబా = బాలురచే పిలువబడునది
ఇది తల్లి పేరు

అథ బాలా స్యా ద్వాసూ

వాసూః = తల్లి సమీపమున నుండునది (వసతి మాతృ సమీపే వాసూః)
ఇది పిన తల్లి పేరు

ఆర్యస్తు మారిషః

ఆర్యః = పాపకర్మలకు దూరముగా బోవువాడు , పూజ్యుడైనండు వలన అందరిచేత సేవింపదగిన వాడు
మారిషః = పాపములు జెరుచువాడు, అన్నిటిని ఓర్చువాడు
ఇవి రెండును పూజ్యుని పేర్లు

అత్తా మాతా నైవ అత్తికా

తల్లియే అత్తిక యనబడును (అత్తికా చాన్తికా తథా ఇతి ద్విరూప కోశాత్)
ఇది అక్కకు పేరు

నిష్ఠా నిర్వహణే సమే

నాటకములయందు పూర్వోత్తర కదల యొక్క సంగతి సంధి యనబడును. ఆ సంధులు ఐదు. అందు ఐదవ సంధి నిష్ఠ యనియు, నిర్వహణ యనియు చెప్పబడి యున్నది, కధకు నియతమైన పర్యాప్తి స్థానము
నిర్వహణం = ప్రస్తుత కద యొక్క సమాప్తి నిర్వహణము
ఈ రెండును నిర్వహణమునకు పేర్లు

హణ్డే హఞ్జే హలాహ్వానం నీచాం చేటీం సఖీం ప్రతి

హణ్డే, హఞ్జే, హలా ఈ మూడు పెర్లును వరుసగా నీచురాలిని, దాసిని, చెలికత్తెను పిలచుట పేర్లు 

అఙ్గ హరో ఽ ఙ్గ విక్షేపో

అఙ్గ హరణే = శరీరమును అటునిటు త్రిప్పుట
అఙ్గ విక్షేపః = అంగమును కదలించుట
ఇవి రెండును ఆడునప్పుడు శరీరమును కదలించుట పేర్లు

వ్యఞ్జ కాభినయౌ సమౌః

వ్యన్జకః = అర్ధమును వ్యక్తముగా చేయునది
అభినయః = దీనిచేత అభిముఖముగా అర్ధము పొందించబడును 
ఈ రెండును హస్త విన్యాసాదుల చేత భావార్ధములు తెలుపుట పేర్లు

నిర్వృత్తే త్వఙ్గసత్వాభ్యాం ద్వేత్రిష్వాన్గిక సాత్వికే

నిర్వృత్త మాన్గికం = అంగముచేత చేయబడినది
సాత్త్వికం = సత్వముచేత పుట్టించబడినది
ఆంగికాః = భూతల విక్షేపాది క్రియలు ఆంగికములు
( స్తంభ, ప్రళయ, రోమాంచ, స్వేద, వైవర్ణ్య, వేపథూ, అశ్రు, వైస్వర్య ఇవి ఎనిమిదిన్ని సాత్వికములు)
ఇవి సాత్విక క్రియలకు, స్వేద రోమాంచాదులకును పేర్లు


శృంగార వీర కరుణాద్భుత హాస్య భయానకాః
భీభత్స రౌద్రా చ రసాః
(శృంగారాదాయో ఽ ష్టౌ రసాః చ శబ్డాచ్చాన్తో ఽ పి నవమః వాత్సల్యం దశమః )

శృంగారము, వీర, కరుణ, అద్భుత, హాస్య, భయానక, భీభత్స, రౌద్రములనెడు ఎనిమిదిన్ని రసములు. చ శబ్దము వలన శాంతము తొమ్మిదవది. వత్సల రసము పదియవది. వీనిలో శాంతము అలౌకికము, వత్సలము పుత్రాది స్నేహ రూపకము. అందు వలన వీనితో చేర్చలేదు.
ఇవి సభాసదులచే ఆస్వాదించబడునవి
ఇవి ఎనిమిదిన్ని రసముల పేర్లు

శృంగార శ్శుచి రుజ్వలః

శృంగారః = ప్రాధాన్యము నొందునది.
శుచిః = జుగుప్సా విరహితమై పరిశుధ్ధమైనది.
ఉజ్జ్వలః = ప్రకాశించునది
ఇవి మూడును శృంగారరసము పేర్లు

ఉత్సాహ వర్ధనో వీరః

ఉత్సాహ వర్ధనః = ఉత్సాహము చేత వృద్ది పొందునది
వీరః = దీని చేత విక్రమింతురు
ఈ రెండు వీరరసము పేర్లు

కారుణ్యం కరుణా ఘృణా
కృపా ద యానుకమ్పా స్యా దనుక్రోశో ఽ పి

కరుణా = దీని చేత జనులు తన్ను ఆధీనము చేసికొందురు.
కారుణ్యం = కరుణయే కారుణ్యము
ఘృణా = దీని చేత మనస్సు ద్రవించును
కృపా = దీని చేత దయ చేయుదురు
దయా = దీని చేత రక్షింతురు
అనుకమ్పా = దీని చేత కొద్దిగా కదలుదురు
అనుక్రోశః = దీని చేత దుఃఖింతురు
ఇవి ఏడును దయా రసము పేర్లు

అథో హనః
హాసో హాస్యం చ

హాసః, హాసం, హాస్యం = జనులను నవ్వించునది
ఈ మూడును హాస్య రసముపేర్లు

భీభత్సం వికృతం త్రి ష్విదం ద్వయం

భీభత్సం = నింద గల్గినది
వికృతం = మనస్సును దుఃఖ పెట్టునది
ఇవి రెండును భీభత్స రసము పేర్లు

విస్మయో ద్భుత మాశ్చర్యం చిత్రమసి

విస్మయః = విశేషముగా నవ్వించునది
అద్భుతం = ఆశ్చర్యమునకు ఉత్పత్తి స్థానము
ఆశ్చర్యం = ఆస్వాదించుటకు యోగ్యమైనది
చిత్రం = ఆశ్చర్యమును జేయునది
ఇవి నాలుగును అద్భుత రసమునకు పేర్లు

అథ భైరవం
దారుణం భీషణం భీష్మం హారం భీమం భయానకం
భయంకరం ప్రతిభయం

భైరవం = భీరులకు వెరపు బుట్టించునది
దారుణం = చిత్తమును భేదించునది
భీషణం, భీష్మం, భీమం, భయానకం = అధీరుడు దీని చేత వెరపు చెందును
భయంకరం = భయమును కలుగజేయునది
ప్రతిభయం = భయముతో కూడినది
ఇవి తోమ్మిది భయానక రసము పేర్లు

రౌద్రం తూగ్రం

రౌద్రం = రుద్రుడే అది దేవతగా గలిగినది
ఉగ్రం = ఉగ్రమైనది
ఇవి రెండు రౌద్ర రసము పేర్లు


అమీత్రిషు
చతుర్దశ

అద్భుతాది శబ్దములు రస హేతు వస్తు వాచకంబులగునపుడు త్రిలింగములు

దర త్రాసౌ భీతి ర్బీ స్స్వా ధ్వసం భయం
దర, త్రాస, భీతి, భీ, భయం, సాధ్వసం అను ఆరును వెరపుపేర్లు

వికారో మానసో భావః

క్రోధ హర్షాది కృతమైన మనో వికారము భావమనబడును
భావమనగా రసమును పుట్టించునది అని కూడా.
ఆ భావము స్థాయి, వ్యభిచారి, సాత్త్వికము అని మూడు విధములు
ఇందు స్థాయి అనునది రతి హాసాది భేదము చేత 8 విధములు
వ్యభిచారి భావము నిర్వేదాది భేదము చేత 33 విధములు
సాత్త్వికము స్తంభ ప్రళయాది భేదముల చేత 8 ప్రకారములు కలిగినది
ఇది మనోవికారమునకు పేరు

అనుభావో భావబోధకః

అనుభావః = అర్ధమునెరిగించునది
భావ బోధకః= భావమునెరిగించునది
రత్యాది భావము నెరిగించు ముఖ వికాస రోమాంచాదులకు పేరు

గర్వో ఽ భిమానో ఽ హంకారో

గర్వః = దీని చేత గర్వింతురు
అభిమానః = తన్ను ఉత్కృష్టుడిగా తలపించునది
ఆహంకారః = నెను ఉత్కృష్టుడనను బుద్ధిని జేయునది
ఈ మూడును అహంకారమునకు పేర్లు

మానశ్చిత్త సుమున్నతిః

మానః = తన్ను పూజించుకొన జేయునది
చిత్త సమున్నతిః =చిత్తము యొక్క ఔన్నత్యము
ఇది నేనుత్కృష్టుడనను చిత్తౌనత్యము పేరు

అనాదరః పరిభవః పరీభావ స్తిరస్క్రియా
రీఢా  ఽ వమాన నా ఽ పఙ్ఞా ఽ వహేళన మసూర్క్షణం

అనాదరః = ఆదరము (సత్కారము) కానిది
పరిభవః, పరీభావః = పరిభవించుట
తిరస్క్రియాః = తిరస్కరించుట
రీఢాః = పీడించునది
అవమాననాః = మాననమనగా పూజ , దానికి విరుద్ధమైనది
ఆవఙ్ఞః = దీని చేత నీచముగా దలప బడును
అవహేళన = అనాదరించుట
అసూర్క్షణః = అనాదరించుట
ఈ తొమ్మిదిన్ని తిరస్కారము పేర్లు

మన్దాక్షం హ్రీ స్త్రపా వ్రీడా లజ్జా

మందాక్షం = తిన్నని మాటలు కలది
హ్రీ = సిగ్గు పడుట
త్రపాః = లజ్జించుట
వ్రీడా = సిగ్గును ప్రేరేపించునది
లజ్జాః = సిగ్గు పడుట
ఇవి ఐదున్ను సిగ్గు పేర్లు

సా ఽ పత్రపా ఽ న్యతః

అపత్రపాః = చెడ్డ సిగ్గు పేరు
ఇది పరులు చెంత నుండుట వలన కలుగు సిగ్గు పేరు
  
క్షాన్తి స్తితిక్షా

క్షాంతి = క్షమించుట క్షాంతి
తితిక్షా = ఓర్చుట
ఇవి రెండును ఓర్పునకు పేర్లు

అక్షాన్తిరీర్ష్యా

అక్షాంతి = క్షాంతి అనగా ఓర్పు, అది కానిది అక్షాంతి
ఈర్ష్యా = ఓర్చలేకుండుట
ఇవి రెండును పరుల సంపదలు ఓర్వలేకుండుటకు పేర్లు

అసూయాతు దోషారోపో గుణేష్వపి

అసూయా = మంచి గుణములున్ననూ చెడు గుణములను ఆరోపించుట
మంచి యున్నను పరులయందు దుర్గుణమారోపించుటకు పేరు

వైరం విరోధో విద్వేషో

వైరం = వీరుని యొక్క వ్యాపారము(పని)
విరోధః =ఓర్పును విశేషముగా నడ్డగించునది
విద్వేషః = అధికమైన ద్వేషము విద్వేషము
ఇవి మూడును వైరము పేర్లు

మాన్యు శోకౌ తు శుక్ స్త్రియాం

మన్యుః = దీనిచేత ఎరుంగబడును
శోకే, శుక్ = శోకించుట
ఇవి మూడును శోకము పేర్లు

పశ్చాత్తాపో నుతాపశ్చవిప్రతీసార ఇత్యపి

పశ్చాత్తాపము, అనుతాపము   = అజ్ఞానము చేత ముందొక పని చేసి వెనుక నొచ్చుకొనుట పశాత్తాపము, అనుతాపమున్ను
విప్రతీసారః = విరుద్ధము గురించి ప్రవర్తించుట
ఇవి మూడున్ను పశ్చాతాపము పేర్లు

కోప క్రోధామర్షరోష  ప్రతిఘా రుట్క్రుధౌ స్త్రియా

కోపః = కోపించుట
క్రోధః = క్రోధించుట
అమర్షః = ఒర్వలేకుండుట
రోషః = దీని చేత హింసించబడుదురు
ప్రతిఘః = సత్కర్మను చెరచునది
రుట్ = రోషించుట
క్రుధః = క్రోదించుట
ఇవి క్రోధమునకు పేర్లు

శుచౌ తు చరితే శీలం

లెస్సగా నడచుట శీలము

ఉన్మాద శ్చిత్త విభ్రమః

ఉన్మాదః = దీని చేత మదించును
చిత్త విభ్రమః =చిత్తము యొక్క భ్రాంతి
ఇవి రెండును భూతావేశముల చేత కలిగిన చిత్త చాంచల్యము పేర్లు

ప్రేమా నా ప్రియతా షార్దం ప్రేమ స్నేహః

ప్రేమా, ప్రియతా  = ప్రియము యొక్క భావము
హార్డం = హృదయమునందు పుట్టినది
ప్రేమ = సంతోషింపజేయుట
స్నేహః = ప్రీతి
ఈ నాలుగును స్నేహమునకు పేర్లు

అథ దోహదం
ఇఛ్ఛా కాంక్షా స్పృహే హాతృడ్వాఞ్ఛా లిప్సా మనోరధః
కామోభిలాష స్తర్షశ్చ

దోహదం = పూర్తిగా నిచ్చునది
ఇఛ్ఛా = ఇచ్చయించుట
కాంక్షా = కాంక్షించుట
స్పృహా = ఇచ్చయించుట
ఈహా = మనోవ్యాపారము
తృట్ = ఇచ్చయించుట
వాంఛా = కోరుట
లిప్సా = ఒక అర్ధము పొంద ఇచ్చయించుట
మనోరదః = మనస్సే రధముగా కలిగినది (భ్రమింపజేయుట వలన మనస్సుకు రధము వంటిది)
కామః = కోరుట
అభిలాషః = కోరుట
తర్షః = ఇచ్చయించుట
ఈ పన్నెండును కోరిక పేర్లు

స మహాన్ లాలసా ద్వయోః

లాలసాః = అధికమైన కోరికయే లాలస, మనస్సు యొక్క కూడుట యైనను క్రీడయైనను లాలస

ఉపాధి ర్నా ధర్మచిన్తా
ఉపాధి = దీని సమీపము యందు ధర్మము గావించబడును
ధర్మ చింతా = ధర్మము గురించి ఆలోచన చేయుట
ఇవి రెండు ధర్మ చింత పేర్లు

పుం స్యాది ర్మానసీ వ్యధా

వ్యధా = దీని చేత దైన్యము సంపాదించబడును
ఇది మనస్సంబంధమైన వ్యధ పేరు

నస్యా చ్చిన్తాస్మృతి రాధ్యానం

చింతా = చింతించుట
స్మృతి = స్మరించుట
ఆధ్యానం = చింతించుట
ఇవి మూడు చింతించుట పేర్లు

ఉత్కణ్ఠో త్కలితే సమె

ఉత్కన్ఠ = ఉద్గతమైన శోకము ఉత్కంఠ
ఉత్కలితా = ఉద్గాతమైన సంఖ్య కలిగినది
ఇష్ట వస్తుప్రాప్తి యందు కాలాతీతము ఓర్వజాలక తహతహ పడుట పేరు

ఉత్సాహో వ్యవసాయ స్స్యాత్

ఉత్సాహః = ప్రయాసమును ఓర్చుట
వ్యవసాయః = విశేషముగా నిశ్చయించుట
ఇవి రెండును మాహా కార్య విషయమైన ఉద్యోగము పేర్లు

స వీర్య మతిశక్తిభాక్

వీర్యం = మిక్కిలి దృఢమైన ఉత్సాహము పేరు

కపటో స్త్రీ వ్యాజ దమ్భోపదయ శ్ఛథ్మకైతవే
కుసృతిర్నికృతి శ్శాఠ్యం

కపటః = బ్రహ్మను కూడా పొందునది, ఃశిరస్సున పటము వలె కప్పియుండునది
వ్యాజః = దీని చేత ప్రేరేపించబడును
దమ్భః = పీడించునది
ఉపధిః = సమీప వస్తువు నందుంచబడునది
ఛద్మః =దీని చేత స్వరూపము కప్పుబడును
కైతవం = కితవుడనగా ధూర్తుడు, అతని వ్యాపారము కైతవము
కుసృతిః = కుత్సితమైన నడత
నికృష్టం = నీచముగా హింసించునది
శాఠ్యం = శఠుని యొక్క భావము
ఇవి ఎనిమిదిని కపటము పేర్లు

ప్రమాదో నవధానతా

ప్రమాదః = ప్రకృష్టమైన మదము ప్రమాదము, (శక్తుండై యుండియు చేయదగిన కార్యము చేయకుండుట ప్రమాదము)
అనవధానతా = అవధానము లేనివానియొక్క భావము
ఇవి రెండు ప్రమాదము పేర్లు

కౌతూహలం కౌతుకం చ కుతుకం చ కుతూహలం

కౌతూహలం, కుతూహలం = కుత్సితమైన పాపమును బయలు పర్రచునది
కౌతుకం = కుత్సితమును చేరుచునది
ఇవి మూడును అపూర్వ వస్తువును కోరుట పేర్లు

స్త్రీణాం విలాస బిబ్బోక విభ్రమా లలితం తథా
హేలా లీలే త్యమీ హవాః క్రియా శృంగార భావజాః

స్త్రీల యొక్క శృంగారభావమైన రతివలన పుట్టిన విలాసాది క్రియలు భావములనబడును . దీనియందు కాముకులగుదురు, దీనిచేత కాముకులు స్వవశముగా చేయబడుదురు.
విలాసః = ప్రియునియొక్క దర్శనము చేతనైన కటాక్ష భ్రూ వికారాదులు విలాసము
బిబ్బోకః = సాపరాదుడైన ప్రియునియొక్క కధ వినునప్పుడు కలుగు ఇంచుక అనాదరము
విభ్రమః = విశేషమైన చలనము
లలితం = సుకుమారాంగ విన్యాస రూపమై యొప్పునది
హేలా = సంభోగమందలి యభిప్రాయము హేల
లీలా = సంశ్లేషము

ద్రవకేళి పరిహాసాః క్రీడా లీలా చ నర్మ చ

ద్రవః = దీని చేత మనస్సు కరుగును
కేళిః = దీని చేత క్రీడించుదురు
పరీహాసః = దీని చేత నవ్వుదురు
నర్మ = రత్యతిశయమును పొందించునది
ఈ ఆరును స్త్రీ పురుషులు పరస్పరము చేసికొనెడు పరిహాసమునకు పేర్లు

వ్యాజో ఽ పదేశో లక్ష్యం చ

వ్యాజము = తన ప్రయోజనమునకై ఒకటి నుద్దేశించి మరియొకటి చేయుట, దీని చేత అరిష్టము పోగొట్టబడును
ఉపదేశం = ఉద్దేశించిన పదార్ధము దీనిచేత విడువబడును
లక్ష్యం = దీని చేత ప్రయోజనము కానబడును
ఈ మూడును వ్యాజము పేర్లు


క్రీడా ఖేలా చ కుర్దనం
క్రీడా = క్రీడించుట
ఖేలా = విహరించుట
కుర్దనం = క్రీడించుట
ఇవి మూడును కందుకాది క్రీడ పేర్లు

ఘర్మో నిదాఘ స్స్వేద స్స్యాత్

ఘర్మ = కారునది
నిదాఘః = మిక్కిలి పీడించునది
స్వేదః = దీని వలన ఒడలు చెమర్చును
ఈ మూడును చెమట పేర్లు

ప్రళయో నష్ట చేష్టతా

ప్రళయః = దీనియందు క్రియలు లీనమౌను
హర్షాదుల వలన దేహచేష్టలు మాలియుండుట పేరు

ఆవహిత్థాకారగుప్తిః
(అనురాగాదులవలన పుట్టిన గగుర్పాటు మొదలైన అవయవ వికారము ఆకారము) ఆకారమును లజ్జా భయాడులచే కప్పుట ఆవహిత్థ యనబడును

ఆకారగుప్తిః = దీని చేత ఆకారము గోపనము చేయబడును
ఈ రెండును  ఆకారగోపనము పేర్లు

సమౌ సంవేగ సంభ్రమౌ

సంవేగః = దీని చేత చలింపబడుట వలన నైనను , వెరచుట వలన నైనను త్వరపడును
సంభ్రమః = దీనిచే చలనము కలుగును
ఇవి రెండు హర్షాదుల వలన పనులు త్వరపడుట పేర్లు

స్యా దా ఛ్ఛురితకం హాస సోత్ప్రాసః

ఉత్ప్రాసః = ఎత్తి పొడుచుట
అ ఛ్ఛురితకం = ఉత్ప్రాసముతో కూడిన నవ్వు
ఇతరులకు రోషము కలిగించు నవ్వు పేరు

స మనాక్ స్మితమ్

స్మితః = అల్పమైన నవ్వు, ఇంచుకంత నవ్వు, కపోల వికాసమాత్రము
ఇది చిరునవ్వు పేరు
       
మధ్యమః స్యా ద్విహసితం

విహసితం = చిరునవ్వుకు పెద్ద నవ్వుకు మధ్యమైన నవ్వు విహసితము, విశేషముగా నవ్వుట

రోమాఞ్చో రోమ హర్షణం

రోమాన్చః = రోమములు గగ్గురు పొడుచుట
రోమ హర్షణం = దీని చేత రోమములు ప్రకాశించును
ఇవి రెండు గగ్గురు పొడుచుట పేర్లు

క్రందితం కుదితం కృష్టం

క్రందితం = రోదించుట
కుదితం = కన్నీరు కార్చుట
కృష్టం = ఏడ్చుట
ఇవి రోదనము పేర్లు

జ్రుంభస్తుత్రిషు జ్రుమ్భణం

జ్రుమ్భణం = ందీని చేత దేహము సంకోచ వికాసాదులను పొందును
ఇది ఆవులింత పేరు

విప్రలమ్భో విసంవాదో

విప్రలంభః = విపరీతముగా అర్ధము పొందుట
విసంవాదః = విపరీతముగా పలుకుట

రిన్ఖణం స్ఖలనం సమే

రింఖణం = జారుట
స్ఖలనం = చలించుట
ఈ రెండును జారుటకు గాని స్వధర్మమును వదలుటకు గాని పేర్లు

స్యాన్నిద్రా శయనం స్వాప స్స్వప్న స్సంవేశ ఇత్యపి

నిద్రా = దీనియందు ఇంద్రియములు నియతముగా ఉపరతములౌను
శయనం = నిద్రించుట
స్వాపః, స్వప్నం = శయనించుట
సంవేశః =ఇంద్రియములు దీని యందు ప్రవేశించును
ఈ ఐదున్ను నిద్ర పేర్లు

తంద్రీ ప్రమీలా

తంద్రీ = దీనియందు ఇంద్రియములు మిక్కిలి ఉపరతములౌను
ప్రమీలా = ఇంద్రియములు దీనియందు మిక్కిలి మూయబడును
ఈ రెండు కునికిపాటు పేర్లు(అత్యంత శ్రమాడులచే అన్ని యవయవములు స్వాధీనము తప్పియుండుట)

భ్రకుటి ర్భ్రుకుటి ర్భ్రూకుటి స్త్రియాం

భ్రకుటి, భ్రుకుటి, భ్రూకుటి = కనుబొమల కుటిలత్వము
ఇవి బొమముడి పేర్లు

అదృష్టి స్స్వ్యాద సౌమ్యే క్ష్ణి

అదృష్టి = క్రూరమైన దృష్టి, విరుద్ధమైన దృష్టి
ఇది రోషము చేత క్రూరమైన చూపు

సంసిద్ది ప్రకృతీ సమే
స్వరూపం చ స్వభావశ్చ నిసర్గశ్చ  

సంసిధ్ధిః = పదార్ధమును లెస్సగా పొందునది
ప్రకృతి = పదార్ధమును ప్రకృష్టముగా చేయునది
స్వరూపం = తన యొక్క రూపము
స్వభావః = తన యొక్క భావము
నిసర్గః = పదార్ధము దీని చేత మిక్కిలి సృజించబడును
ఇవి ఐదున్ను స్వభావము పేర్లు

అథః వేపథుః
కమ్పః

వేపఠుః = కంపించుట
కంపః = చలించుట
ఈ రెండు వణుకు పేర్లు

అథ క్షణ ఉద్ధర్షో మహ ఉద్దవ ఉత్సవః  

క్షణః = దుఃఖమును చెరచునది
ఉద్దర్షః =దీని చేత సంతోషింతురు
మహః = జనులచేత పూజింపబడును
ఉద్ధవః = దుఃఖమును పోగొట్టునది
ఉత్సవః = సుఖమును పుట్టించునది, జనులను ప్రేరేపించునది
ఈ ఐదును ఉత్సవము పేర్లు

దీనితో నాట్య వర్గము సుసంపన్నము
తరువాత పాతాళ వర్గము


1 comment:

  1. Can you please give me source of your explanation of amarakosam.

    ReplyDelete